India Canada Issue : భారత్‌పై కెనడా కుట్ర.. మరో దేశానికి సమాచారం లీక్ చేస్తున్న ట్రూడో ప్రభుత్వం!-canada officials leaked confidential information on indias alleged role in nijjar murder case ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Canada Issue : భారత్‌పై కెనడా కుట్ర.. మరో దేశానికి సమాచారం లీక్ చేస్తున్న ట్రూడో ప్రభుత్వం!

India Canada Issue : భారత్‌పై కెనడా కుట్ర.. మరో దేశానికి సమాచారం లీక్ చేస్తున్న ట్రూడో ప్రభుత్వం!

Anand Sai HT Telugu
Oct 30, 2024 11:48 AM IST

India Canada Issue : సిక్కు వేర్పాటువాదులకు వ్యతిరేకంగా భారత్ కుట్రలు పన్నుతున్నదని కెనడా ఆరోపించింది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్‌తో భారత్‌కు వ్యతిరేకంగా సమాచారాన్ని పంచుకున్నారు కెనడా అధికారులు.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (AP)

భారత్‌కు వ్యతిరేకంగా కెనడా కుట్ర చేస్తోందని తెలుస్తోంది. ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంలోని ఇద్దరు ఉన్నతాధికారులు భారత్‌కు వ్యతిరేకంగా సమాచారాన్ని లీక్ చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతానికి దీనిపై భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అమెరికన్ వార్తాపత్రికకు సమాచారం లీక్ చేసినందుకు పార్లమెంటరీ ప్యానెల్ కూడా ఆ అధికారులను తీవ్రంగా మందలించినట్లుగా తెలుస్తోంది.

కెనడా పోలీసులు భారత అధికారులను ప్రశ్నించకముందే ఆంగ్ల దినపత్రిక వాషింగ్టన్ పోస్ట్‌కు సమాచారాన్ని లీక్ చేసినట్లు అధికారులు అంగీకరించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధం ఉందని కెనడా పోలీసులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది.

కెనడాలో సిక్కు వేర్పాటువాదులపై దాడుల వెనుక భారత ప్రభుత్వ ఉన్నతాధికారి హస్తం ఉందని ట్రూడో ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారు నథాలీ డ్రూయిన్ చెప్పినట్లు సమాచారం. సమాచారాన్ని లీక్ చేయడానికి తనకు ట్రూడో అనుమతి అవసరం లేదని ఆయన అన్నారు.

సమాచారాన్ని లీక్ చేయడం కమ్యూనికేషన్ స్ట్రాటజీలో భాగమేనని డ్రూయిన్ పేర్కొన్నారు. ట్రూడో కార్యాలయం కమ్యూనికేషన్ వ్యూహాన్ని నిర్వహించిందని సలహాదారు తెలిపారు. 'భారత్‌తో సహకారం కోసం మేం తీసుకున్న చర్యల గురించి రహస్య సమాచారం లేదు. కెనడా పౌరులపై చట్టవ్యతిరేక కార్యకలాపాలకు భారత ప్రభుత్వంతో సంబంధం ఉందని ఆధారాలు చూపిస్తున్నాయి.' అని ఆయన అన్నారు.

భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సింగపూర్ లో కెనడా విదేశాంగ మంత్రిని కలిశారని వాషింగ్టన్ పోస్ట్‌లో ఓ కథనం ప్రచురితమైంది. సెప్టెంబర్ 12న జరిగిన ఈ సమావేశంలో తాను, డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డేవిడ్ మోరిసన్, ఆర్సీఎంపీ కమిషనర్ మార్క్ ఫ్లిన్ పాల్గొన్నట్లు డ్రూయిన్ తెలిపారు.

ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించడానికి అనేక చర్యలు ప్రవేశపెట్టామని చెప్పారు. మేం సమర్పించిన సమాచారాన్ని అంగీకరించడానికి దోవల్ నిరాకరించారని వెల్లడించారు. కెనడాలోని సిక్కు వేర్పాటువాదులపై నిజ్జార్ హత్య, దాడులను నిర్వహించడానికి భారతదేశం క్రిమినల్ నెట్‌వర్క్‌లను, ప్రత్యేకంగా బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉపయోగించిందని కెనడా అధికారులు ఆరోపించిన రుజువులను సమర్పించారు.

ఈ వార్తల లీకేజీపై పార్లమెంటరీ ప్యానెల్ మండిపడింది. ట్రూడో, ఆయన కేబినెట్ మంత్రులు, పోలీసులు ఆ సమాచారాన్ని ప్రజలతో పంచుకోకుండా పత్రికకు ఎందుకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని ప్యానెల్ ప్రశ్నించింది.

అక్టోబరు 14న ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను న్యూ ఢిల్లీ బహిష్కరించిన తర్వాత కెనడా, భారతదేశం మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారతదేశ హైకమిషనర్‌ను నిజ్జార్ కేసులో పేర్కొన్నందుకు వివాదం పెద్దగా అయింది.

Whats_app_banner