High Voltage Electric Bike : భారతదేశంలో మొట్టమొదటి హై వోల్టేజ్ ఈవీ మోటార్‌సైకిల్ లాంచ్
Raptee.HV EV Bike : చెన్నైకి చెందిన ఈవీ స్టార్టప్ రాప్టీ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. భారతదేశంలో మెుట్టమెుదటి హై వోల్జేజ్(HV) బైక్ ఇదే. దీని వివరాలు తెలుసుకుందాం..
Raptee.HV భారతదేశపు మొట్టమొదటి హై-వోల్టేజ్ (HV) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. దీని పేరు రాప్టీ టీ30. భారతదేశపు మొట్టమొదటి హై-వోల్టేజ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌గా ఇది రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే సాంకేతికతతో దీనిని అభివృద్ధి చేశారు. కంపెనీ ప్రకారం ఇది తక్కువ వేడితో 250-300సిసి ఇంధనంతో నడిచే మోటార్‌సైకిళ్లకు పోటీగా ఉండనుంది.
రాప్టీ ఈవీలు అధిక-వోల్టేజ్ సాంకేతికతతో వచ్చిన భారతదేశంలోని మొదటి ద్విచక్ర వాహనాలు. ఎలక్ట్రిక్ కార్లు ఉపయోగించే అదే ఛార్జింగ్ ప్రమాణాలు ఇందులో ఉంటాయి. ఇవి ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న 13,500 సీసీS2 కార్ ఛార్జింగ్ స్టేషన్‌లకు అనుకూలంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. అంటే అందులో కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చన్నమాట. వచ్చే ఏడాదిలోగా ఛార్జింగ్ స్టేషన్లను పెంచే ఆలోచనలో ఉన్నారు.
ఈ ఈవీలు.. 250-300సీసీ ICE(Internal Combustion Engine) మోటార్‌సైకిళ్లతో సమానంగా ఉంటాయి. అందుకే వాటికి పోటీగా రూ.2.39 లక్షల ధరతో విడుదల చేశారు. ఈ ఎలక్ట్రిక్ బైకులను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కి.మీలకు పైగా ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.
ఈ మోటార్‌సైకిల్ 3.5 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది IP67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్‌ని అందిస్తోంది. సేఫ్టీ పరంగా కూడా బాగుంటుందని కంపెనీ తెలిపింది. రాప్టీ బైక్ బ్యాటరీ లైఫ్ 8 ఏళ్లు లేదా 80,000 కి.మీల వారంటీ కలిగి ఉంటుందని ప్రకటించింది. ఇది వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చనుంది.
హై వోల్జేజ్ సాంకేతికత కోసం రాప్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ మోటార్‌సైకిల్ నాలుగు రంగుల ఆప్షన్లలో వస్తుంది. హారిజోన్ రెడ్, ఆర్కిటిక్ వైట్, మెర్క్యురీ గ్రే, ఎక్లిప్స్ బ్లాక్ అనే కలర్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ ఈవీల విడుదల సందర్భంగా రాప్టీ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో దినేష్ అర్జున్ మాట్లాడారు.
'మేం జనవరి నుంచి చెన్నై, బెంగళూరులో డెలివరీలను ప్రారంభిస్తాం. ఎంచుకున్న మార్కెట్లలో ముందుకెళ్లిన తర్వాత ఇతర ప్రధాన నగరాలకు విస్తరిస్తాం. మా లక్ష్యం మంచి సాంకేతికతతో మోటార్‌సైకిళ్లను తయారు చేయడం. భారతదేశపు మొట్టమొదటి హై-వోల్టేజ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ప్రారంభించడం పెద్ద సవాలుతో కూడుకున్నది. గత 5 సంవత్సరాలుగా మా బృందం దీనిని సాధ్యం చేయడానికి కృషి చేసింది. ఎట్టకేలకు దీన్ని విజయవంతం చేయడంలో మా విజన్, ఇన్నోవేషన్ కనిపిస్తుంది. ఏదైనా సాధించగలం అనడానికి ఇది నిదర్శనం.' అని దినేష్ అర్జున్ చెప్పారు.