Sunita Williams In Space : స్పేస్ స్టేషన్‌లో సునీతా విలియమ్స్ అస్వస్థత.. బరువు తగ్గారా?
Sunita Williams In Space : వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పేస్‌లో ఉన్నారు. అయితే ఆమె ఆరోగ్యం గురించి వివిధ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఏమని స్పందించారో చూద్దాం..
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ జూన్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్నారు. ఇటీవల ఆమె చాలా సన్నగా కనిపించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇది చూసిన ప్రజలు ఆమె ఆరోగ్యం గురించి వెతకడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. న్యూ ఇంగ్లాండ్ స్పోర్ట్స్ నెట్వర్క్ (ఎన్ఈఎస్ఎన్)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అన్ని విషయాలను వెల్లడించారు.
'నా శరీరం కొద్దిగా మారిందని నేను అనుకుంటున్నాను. కానీ బరువు అలాగే ఉంది. నేను బరువు తగ్గుతున్నాననే విషయాలు ప్రచారం చేస్తున్నారు. నేను ఇక్కడకు వచ్చినప్పుడు ఎంత బరువు ఉన్నానో అదే బరువుతో ఉన్నానని మీకు చెప్పాలనుకుంటున్నాను.' అని చెప్పారు సునీతా విలియమ్స్.
మైక్రోగ్రావిటీ కారణంగా తన శరీరంలో కొన్ని మార్పులు వచ్చాయని విలియమ్స్ చెప్పారు. శారీరక పరిస్థితి మారినట్టుగా కనిపిస్తుంది. ఇది తరచుగా వ్యోమగాముల ముఖాలు ఉబ్బడానికి, వారి దిగువ శరీరాలు సన్నగా కనిపించడానికి కారణమవుతుంది. దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రల్లో భాగం కావడానికి కొన్ని ప్రత్యేకమైన సవాళ్లు ఉన్నాయి. బరువు లేని వాతావరణంలో జీవించడం శారీరక ప్రభావాలను కలిగి ఉంటుంది. దీన్ని ఎదుర్కోవాలంటే ప్రత్యేకమైన ఫిట్ నెస్ డైట్ తీసుకోవాలి.
ఈ ఇంటర్వ్యూలో వ్యోమగామి సునీతా విలియమ్స్ మాట్లాడుతూ.. 'నా శరీరం కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఎముక సాంద్రతను కాపాడుకోవడానికి చాలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా పిరుదులు, పాదాలపై శ్రద్ధ వహించాలి.' అని సునీతా విలియమ్స్ చెప్పారు.
స్పేస్ స్టేషన్‌లోసునీత వ్యాయామాల్లో సైక్లింగ్, ట్రెడ్ మిల్ రన్నింగ్, ప్రత్యేక పరికరాలతో శిక్షణ ఉంటుంది. మైక్రోగ్రావిటీలో వ్యోమగాములు ప్రతి నెలా 1-2 శాతం ఎముక ద్రవ్యరాశిని కోల్పోతారు. ముఖ్యంగా వెన్నెముక, పిరుదులు, కాళ్లు వంటి బరువు మోసే ఎముకల ప్రాంతాల్లో ప్రభావితమవుతాయి. ఎముకల సాంద్రతను పూర్తిగా ఆపడం ఒక సవాలు అని విలియమ్స్ అంగీకరించారు.