Assembly Bypoll : ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్
Assembly Bypoll Election : ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కొన్ని కీలక స్థానాల్లో పోలింగ్ జరుగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారా అని ఆసక్తి నెలకొంది.
దేశంలోని 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో బీహార్ నుంచి హిమాచల్ వరకు ఉత్కంఠ నెలకొంది. కొందరు సభ్యులు మృతి చెందడం, మరికొందరు సభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉప ఎన్నికలు జరగనున్న ఏడు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలోని అమరవాడ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు కూడా ఓటింగ్ జరగుతోంది. మధ్యప్రదేశ్‌లో కొన్ని వారాల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఈ ఉపఎన్నికపై ఆసక్తి నెలకొంది.
అమరవాడ ఉప ఎన్నికల్లో మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోరు నెలకొంది. అమర్వాడ చింద్వార్ జిల్లాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం. చింద్వారా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ స్వస్థలం.
పశ్చిమ బెంగాల్‌లో నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2022లో TMC ఎమ్మెల్యే సాధన్ పాండే మరణం కారణంగా మాణిక్తలా ఉపఎన్నిక జరుగుతుంది. రాయ్‌గంజ్, రణఘాట్ సౌత్, బాగ్దా నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు నడుస్తు్న్నాయి. పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగించాలని చూస్తున్నాయి.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో మాణిక్తలా నియోజకవర్గాన్ని టీఎంసీ స్వాధీనం చేసుకుంది. రాయ్‌గంజ్, రణఘాట్ సౌత్, బాగ్దాలో BJP గెలిచింది. అయితే ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఆ పార్టీని వీడి టీఎంసీలో చేరారు. టీఎంసీకి రాయ్‌గంజ్ నుంచి కృష్ణ కళ్యాణి, రణఘాట్ దక్షిణ్ నుంచి ముకుత్ మణిని ప్రకటించింది.
బీహార్‌లోని రూపాలి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు ఓటింగ్ జరుగుతుంది. ఈ ఉప ఎన్నికల్లో 11 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3 లక్షలకు పైగా ఓటర్లు తేల్చనున్నారు. రూపాలీ నియోజకవర్గం ఎమ్మెల్యే బీమా భారతి జేడీ(యూ)ని వీడి ఆర్జేడీలో చేరిన తర్వాత శాసనసభకు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. బీమా భారతి పూర్నియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆర్‌జేడీ టికెట్‌పై పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి పప్పు యాదవ్ చేతిలో ఓడిపోయారు.
పంజాబ్‌లోని జలధార్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు ఓటింగ్ జరగుతుంది. ఈ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు అగ్నిపరీక్షగా భావిస్తున్నారు. జలంధర్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం రిజర్వ్‌డ్ నియోజకవర్గం. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య బహుముఖ పోటీ జరిగే అవకాశం ఉంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా, హమీర్‌పూర్, నలాగఢ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కమలేష్ ఠాకూర్ డెహ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కమలేష్ ఠాకూర్ ఎన్నికల రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఇదే తొలిసారి. ఈ నియోజకవర్గంలో బీజేపీ హోషియార్ సింగ్‌కు టికెట్ ఇచ్చింది. సీటుపై ఠాకూర్, హోషియార్ సింగ్‌ల మధ్య పోరు జరుగుతుందని భావిస్తున్నారు.