Minor girl gangraped: ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలికపై సామూహిక అత్యాచారం; వెల్లువెత్తిన నిరసనలు
అస్సాంలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ధింగ్ ప్రాంతంలో ట్యూషన్ నుంచి ఇంటికి సైకిల్ పై వెళ్తున్నఆ బాలికపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.
అస్సాంలోని నాగావ్ జిల్లాలో ఒక బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అసోంలో శుక్రవారం పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. నాగావ్ లోని ధింగ్ ప్రాంతంలో గురువారం ఈ గ్యాంగ్ రేప్ జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హామీ ఇచ్చారు. తాము ఎవరినీ వదిలిపెట్టబోమని, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఘటనా స్థలాన్ని సందర్శించి ఇలాంటి రాక్షసులపై సత్వర చర్యలు తీసుకునేలా చూడాలని డీజీపీ ని సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశించారు.
సీఎం శర్మ స్పందన
రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వెళ్తున్న బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనపై స్థానికంగా నిరసనలు వెల్లువెత్తాయి. ‘‘ధింగ్ కు చెందిన హిందూ బాలికపై ఇంతటి దారుణమైన నేరానికి పాల్పడిన నేరస్థులను చట్టం వదిలిపెట్టదు. ధింగ్ కు వెళ్లి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, జలవనరుల శాఖ మంత్రి పిజుష్ హజారికాను ఆదేశించాను’’ అని ముఖ్యమంత్రి శర్మ శుక్రవారం హైలకండిలో విలేకరులతో అన్నారు. లోక్ సభ ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి ఒక సామాజిక వర్గానికి చెందిన వారు నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని శర్మ పేర్కొన్నారు. అయితే దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరికీ మినహాయింపు ఇవ్వబోమని స్పష్టం చేశారు.
స్థానికంగా నిరసనలు, బంద్
బాలికపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం వివిధ వర్గాల ప్రజలు వీధుల్లోకి వచ్చారు. దుకాణదారులు తమ వ్యాపారాలను మూసివేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసు గస్తీని పెంచారు. సామాజిక, రాజకీయ సంఘాలు నేరస్థులకు కఠినమైన శిక్షలు విధించాలని, మహిళలు, బాలికలకు భద్రతను పెంచాలని డిమాండ్ చేశాయి. మైనర్ బాలికపై జరిగిన అత్యాచారానికి ప్రతిస్పందనగా 'మాకు న్యాయం కావాలి' అని నినదిస్తూ నాగావ్ లోని ధింగ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పురుషులు, మహిళలు కదం తొక్కుతున్న వీడియో వైరల్ గా మారింది.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ధింగ్ ప్రాంతంలో ట్యూషన్ నుంచి ఇంటికి సైకిల్ పై వెళ్తుండగా ఆ బాలికపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు దుండగులు మోటారు సైకిల్ పై వచ్చి ఆమెను చుట్టుముట్టి, నిర్మానుష్య ప్రాంతానికి లాక్కువెళ్లి, అత్యాచారానికి పాల్పడి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడేశారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్థానికులు గుర్తించి రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను మొదట ధింగ్ లోని ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి తదుపరి చికిత్స, వైద్య పరీక్షల కోసం నాగావ్ లోని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఒక అనుమానితుడిని అరెస్టు చేశామని, మరొకరిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు డీజీపీ జీపీ సింగ్ జిల్లా పోలీసు అధికారులతో కలిసి ధింగ్ ను సందర్శించారు.