Indian doctor in US: అమెరికాలో భారతీయ డాక్టర్ అమానుషం; ఇంట్లో పిల్లలు, మహిళల వేలాది నగ్న వీడియోలు-indian doctor films naked children and adults in us arrested ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Doctor In Us: అమెరికాలో భారతీయ డాక్టర్ అమానుషం; ఇంట్లో పిల్లలు, మహిళల వేలాది నగ్న వీడియోలు

Indian doctor in US: అమెరికాలో భారతీయ డాక్టర్ అమానుషం; ఇంట్లో పిల్లలు, మహిళల వేలాది నగ్న వీడియోలు

HT Telugu Desk HT Telugu
Aug 21, 2024 07:45 PM IST

Indian doctor in US: అమెరికాలో ఒక భారతీయ డాక్టర్ వికృత చర్యలు ఇటీవల బయట పడ్డాయి. ప్రస్తుతం ఆ 40 ఏళ్ల డాక్టర్ జైల్లో ఉన్నాడు. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలోని ఓక్లాండ్ కౌంటీలోని రోచెస్టర్ హిల్స్ నగరంలోని అతని ఇంట్లో వేల సంఖ్యలో పిల్లలు, మహిళల నగ్న చిత్రాలు, వీడియోలు బయటపడ్డాయి.

అమెరికాలో భారతీయ డాక్టర్ అమానుషం
అమెరికాలో భారతీయ డాక్టర్ అమానుషం (REUTERS)

Indian doctor in US: కొన్నేళ్లుగా పిల్లలు, మహిళల నగ్న చిత్రాలు, వీడియోలను రికార్డు చేసిన 40 ఏళ్ల భారతీయ వైద్యుడు ఔమైర్ ఏజాజ్ ను పలు లైంగిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేసి, 2 మిలియన్ డాలర్ల బాండ్ పై అమెరికా జైలులో ఉంచారు.

ఇల్లు, క్లినిక్ నిండా రహస్య కెమెరాలు

బాత్రూంలు, దుస్తులు మార్చుకునే ప్రాంతాలు, ఆసుపత్రి గదులు, తన స్వంత ఇంటిలోని పలు ప్రాంతాల్లో వివిధ సెట్టింగులలో ఆ డాక్టర్ రహస్య కెమెరాలను అమర్చాడు. ఆగస్టు 8 న ఔమైర్ ఏజాజ్ ను అరెస్టు చేసినట్లు ఫాక్స్ న్యూస్ నివేదించింది. అతడి వికృతాలకు సంబంధించిన సమాచారాన్ని అతడి భార్యే పోలీసులకు అందించారు. ఇంట్లో వేల సంఖ్యలో ఉన్న డిజిటల్ వీడియోలు, ఫొటోల వివరాలను ఆమె పోలీసులకు అందించారు. దాంతో, పోలీసులు అతని నేరాల గురించి తెలుసుకున్నారు. అయితే, అరెస్టుకు ముందు అతడికి ఎలాంటి నేరచరిత్ర లేదు.

లైంగికంగా కూడా..

అపస్మారక స్థితిలో లేదా నిద్రిస్తున్న అనేక మంది మహిళలపై అతడు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. అంతేకాదు, వాటిని రికార్డ్ చేశాడని ఓక్లాండ్ కౌంటీ షెరీఫ్ మంగళవారం తెలిపారు. ఏజాజ్ నేరాల తీవ్రత ప్రస్తుతానికి పూర్తిగా తెలియదు. కానీ, అతడి నేరాల లోతుపాతులను పూర్తిగా దర్యాప్తు చేయడానికి కొన్ని నెలలు పడుతుందని షెరీఫ్ మైక్ బౌచర్డ్ చెప్పారు. అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలోని ఓక్లాండ్ కౌంటీలోని రోచెస్టర్ హిల్స్ నగరంలోని అతని ఇంట్లో దొరికిన వేలాది వీడియోలను పరిశీలిస్తున్న అధికారులు మరింత మంది బాధితులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

దర్యాప్తు ప్రారంభం

భారతీయ డాక్టర్ ఔమైర్ ఏజాజ్ నేరాల జాబితా పెద్దదేనని యూఎస్ పోలీసులు భావిస్తున్నారు. అతడి వికృత చర్యల విస్తృతి పెద్దదేనని, బాధితుల సంఖ్య కూడా భారీగానే ఉండవచ్చని భావిస్తున్నారు. అతడి నేరాల దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. తన సంరక్షణలో ఉన్న డజన్ల కొద్దీ యువతులను వేధించిన కేసులో దోషిగా తేలిన స్పోర్ట్స్ డాక్టర్ లారీ నాజర్ తో ఈ డాక్టర్ ఔమైర్ ఏజాజ్ నేరాల స్థాయిని పోలీసులు పోల్చారు.

ఆగస్ట్ 8 న అరెస్ట్

ఆగస్టు 8న ఏజాజ్ ను అతని ఇంట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఇంట్లో పలు సెర్చ్ వారెంట్లతో సోదాలు నిర్వహించారు. వాటిలో ఆ ఇంట్లో కంప్యూటర్లు, ఫోన్లు, 15 రికార్డింగ్ పరికరాలు లభించాయి. ఒక్క హార్డ్ డ్రైవ్ లో 13,000 వీడియోలు ఉన్నాయని బౌచర్డ్ తెలిపారు. క్లౌడ్ స్టోరేజ్ లో కూడా వీడియోలను అప్ లోడ్ చేశాడని తెలిపారు. ఆగస్టు 13న ఏజాజ్ పై పిల్లలపై లైంగిక దాడికి సంబంధించిన ఒక కేసు, దుస్తులు లేని వ్యక్తుల ఫోటోలను తీసినందుకు నాలుగు కేసులు, నేరం చేయడానికి కంప్యూటర్ ను ఉపయోగించడంపై ఐదు అభియోగాలు మోపారు. అనంతరం, అతడిని 2 మిలియన్ డాలర్ల బాండ్ పై ఓక్లాండ్ కౌంటీ జైలులో ఉంచారు.

బయటి ప్రదేశాల్లో కూడా..

2023లో గోల్డ్ ఫిష్ స్విమ్మింగ్ క్లబ్ లోని దుస్తులు మార్చుకునే గదిలో ఓ తల్లి, ఆమె పిల్లలు దుస్తులు మార్చుకుంటుండగా ఏజాజ్ రికార్డు చేశాడు. అలా చాలా మంది తల్లులు, పిల్లల వీడియోలను రికార్డు చేశాడు. క్లింటన్ టౌన్ షిప్ లోని హెన్రీ ఫోర్డ్ మాకోంబ్ హాస్పిటల్, గ్రాండ్ బ్లాంక్ లోని అసెన్షన్ జెనెసిస్ హాస్పిటల్ లలో ఉద్యోగం చేసినట్లు అతని వర్క్ హిస్టరీ చూపిస్తుంది. ప్రస్తుతం అతడిని వివిధ ఆసుపత్రులకు పంపే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న వైద్యుడిగా పనిచేస్తున్నాడు.

2011 లో భారత్ నుంచి..

అంతకు ముందు 2011లో భారత్ నుంచి వర్క్ వీసా పై అమెరికా వెళ్లాడు. అలబామా, మిచిగాన్ లలోని పలు ఆసుపత్రులలో పని చేశారు. అతడి బాధితులు తమను సంప్రదించడానికి వీలుగా పోలీసులు ఈమెయిల్ ను ఏర్పాటు చేశారు.

Whats_app_banner