Rape Attempt | రేపల్లే ఘటనలో వెంటనే స్పందించాం.. ఇక పాత నేరస్థులను వదిలిపెట్టాం-minister taneti vanitha on repalle railway station rape incident ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rape Attempt | రేపల్లే ఘటనలో వెంటనే స్పందించాం.. ఇక పాత నేరస్థులను వదిలిపెట్టాం

Rape Attempt | రేపల్లే ఘటనలో వెంటనే స్పందించాం.. ఇక పాత నేరస్థులను వదిలిపెట్టాం

HT Telugu Desk HT Telugu
May 02, 2022 03:41 PM IST

రేపల్లె రైల్వే స్టేషన్‌లో అత్యాచార యత్నానికి గురై ప్రస్తుతం ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు.

<p>మంత్రి తానేటి వనిత</p>
మంత్రి తానేటి వనిత

బాపట్ల జిల్లా రేపల్లే అత్యాచార బాధితురాలని మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేశ్, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. అనంతరం మంత్రి.. తానేటి వనిత మాట్లాడారు. ఘటన జరిగిన ప్రదేశానికి పోలీసులు వెంటనే వచ్చారని తెలిపారు. బాధితురాలు, ఆమె భర్త అర్ధరాత్రి ఊరికి వెళ్లే సదుపాయం లేకపోవడంతో రేపల్లె రైల్వే స్టేషన్‌లో పడుకున్నారని తెలిపారు.

మద్యం సేవించిన ముగ్గురు, ఆ మహిళపై కన్నేసి.. అక్కడికి వచ్చి బాధితురాలి భర్తను టైమ్‌ అడిగినట్లు నటించి.. ఆపై దాడి చేసి తన దగ్గర ఉన్న డబ్బు దోచుకున్నారని మంత్రి తానేటి వనిత చెప్పారు. తన భర్తపై దాడిని ఆపాలని ఆమె అడ్డుపడితే మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోయారని వెల్లడించారు. ఆమెను కాపాడుకునేందుకు భర్త అందరి దగ్గరికి వెళ్లినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. రైల్వే స్టేషన్‌లో పడుకున్న వేరే ప్రయాణికులను కోరినా.. వారు ముందుకు రాలేదన్నారు.

రైల్వే స్టేషన్‌ బయట ఉన్న రిక్షావాళ్ల సూచన మేరకు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారన్నారు. వారు పెట్రోలింగ్‌ వాహనంతో వస్తుండగా ఆ సైరన్‌ విని పారిపోయారని మంత్రి అన్నారు. రైల్వే స్టేషన్‌ సమీపంలో నేతాజీ కాలనీ ఉందని.., అక్కడ ఉన్న నేర చరిత్రుల గురించి పోలీసులు ఆరా తీశారన్నారు. కాలనీలోకి రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎవరైనా మద్యం సేవించి వచ్చారా? అని పోలీసులు విచారణ చేయగా.. ముగ్గురి గురించి తెలిసిందన్నారు.

'వారిని ఉదయం 7 గంటల్లోపే అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 1 గంటకు ఫిర్యాదు రాగా చాలా వేగంగా స్పందించి కేవలం 6 గంటల్లోపే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చాలా వేగంగా స్పందించారు కాబట్టి.. బాధితురాలిని సకాలంలో ఆదుకోగలిగాం. బాధితురాలిని ఇప్పుడే ఆస్పత్రిలో పరామర్శించాం. ఆమె 7 నెలల గర్భిణి కావడంతో, అనుకోని దుర్ఘటనతో ఆమె ఇబ్బంది పడుతోంది. నిన్ననే ఆమెకు రూ.2 లక్షల సహాయం చేశాం. అత్యాచార ప్రయత్నం జరిగింది కాబట్టి, అత్యాచారాల నిరోధ చట్టం ప్రకారం బాధితురాలికి రూ.8.50 లక్షల పరిహారం అందుతుంది. ఆ ప్రకారం ఇప్పుడే ఆమెకు అందులో సగం రూ.4.12 లక్షలు ఇచ్చాం. అదే విధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి కూడా మరో రూ.50 వేలు వస్తాయి. దానికి సంబంధించి కూడా ఇప్పుడే రూ.12 వేలు ఇచ్చాం.' అని మంత్రి తానేటి వనిత చెప్పారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ నిందితులను వదిలిపెట్టమని.. కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఘటన జరిగింది రైల్వే స్టేషన్‌లో కాబట్టి అక్కడ భద్రత బాధ్యత రైల్వే పోలీసులదని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్ర పోలీసులు చాలా వేగంగా స్పందించారు. బాధితురాలని కాపాడారన్నారు. ఇక నుంచి అన్ని చోట్లా పాత నేరస్తులపై దృష్టి పెట్టాలని పోలీసులను ఆదేశిస్తున్నామని హోంమంత్రి చెప్పారు.

దిశ అమలు కాకపోవడం వల్లనే

ఇలాంటి దుర్ఘటనల్లో దర్యాప్తు, విచారణ చాలా వేగంగా జరిగి నిందితులకు శిక్ష పడే విధంగా దిశ చట్టం రూపొందించాం. కానీ కేంద్రం క్లియరెన్స్‌ రాకపోవడంతో, చట్టం అమలు కావడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. కానీ పలు ఘటనల్లో ఆ పార్టీ వారే బాధ్యులుగా తేలుతున్నారు. ఈ విషయాన్ని విపక్షం గుర్తించాలి. అర్థం లేని విమర్శలు విడిచిపెట్టాలి.

                                                                   - మంత్రి తానేటి వనిత

Whats_app_banner