Ashok Gehlot vs Sachin Pilot : గహ్లోత్- పైలట్ మళ్లీ డిష్యూం డిష్యూం.. కాంగ్రెస్‌కు తలనొప్పి!
Ashok Gehlot vs Sachin Pilot : సచిన్ పైలట్‌పై మరోమారు విరుచుకుపడ్డారు అశోక్ గహ్లోత్. ఆయన ఆరోపణలను సచిన్ పైలట్ తిప్పికొట్టారు.
Ashok Gehlot vs Sachin Pilot : రాజస్థాన్ కాంగ్రెస్‌లో అంతర్గత యుద్ధం మళ్లీ తెరపైకి వచ్చింది. పార్టీలో సంక్షోభానికి కారణమైన సీఎం అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య మరోమారు మాటల యుద్ధం మొదలైంది. 'సచిన్.. పార్టీకి ద్రోహం చేశారు' అంటూ అశోక్ గహ్లోత్ మండిపడగా.. వాటిని ఆయన తిప్పికొట్టారు. ఫలితంగా.. వీరిద్దరి వ్యవహారం కాంగ్రెస్‌కు మళ్లీ తలనొప్పి తెచ్చిపెట్టే విధంగా ఉంది!
టైమింగ్ చూసుకుని..?
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్నారు. మధ్యప్రదేశ్ బుర్హన్‌పూర్‌లో జరిగిన యాత్రలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు సచిన్ పైలట్ సైతం కలిసి నడిచారు. ఓవైపు.. సచిన్ పైలట్ పాద యాత్రలో ఉండగా.. మరోవైపు ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు అశోక్ గహ్లోత్. సచిన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
"పార్టీకి ద్రోహం చేసిన ఓ వ్యక్తి.. రాష్ట్రానికి సీఎం కాలేడు. పైలట్‌ను హైకమాండ్ సీఎంను చేయలేదు. ఆయన వద్ద కనీసం 10మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. పార్టీపై తిరుగుబాటు చేసిన వ్యక్తి సచిన్ పైలట్. ఓ పార్టీ అధ్యక్షుడు.. సొంత ప్రభుత్వాన్నే కుప్పకూల్చేందుకు ప్రయత్నించడం.. బహుశా చరిత్రలో ఇదే తొలిసారి. బీజేపీ ఫండింగ్‌తోనే ఆయన తిరుగుబాటు చేశారు," అని ఆరోపించారు అశోక్ గహ్లోత్.
Ashok Gehlot latest news : అశోక్ గహ్లోత్‌పై యుద్ధం, హైకమాండ్‌పై అసంతృప్తితో.. 2020లో కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేశారు సచిన్ పైలట్. 2018 ఎన్నికల అనంతరం జరిగిన ఒప్పందం ప్రకారం.. గహ్లోత్‌తో సచిన్ పైలట్ సీఎం సీటుని పంచుకోవాల్సి ఉంది. కానీ అలా జరగకపోవడంతో ఆయన తిరుగుబాటు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని వేరే రాష్ట్రంలోని హోటల్‌కు షిఫ్ట్ అయ్యారు. ఈ వ్యవహారం కొన్ని రోజులు.. రాజస్థాన్ రాజకీయాలను వేడెక్కించింది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ బుజ్జగింపుతో.. తిరిగి రాజస్థాన్‌కు వెళ్లిపోయారు ఈ యువ కాంగ్రెస్ నేత.
అయితే.. సీఎం సీటును పంచుకునే విషయంపై ఎలాంటి ఒప్పందం జరగలేదని అశోక్ గహ్లోత్ పునురుద్ఘాటించారు.
"అసలు ఆ ప్రశ్నే లేదు. సీఎం కుర్చీని పంచుకునే విషయంపై ఎప్పుడు చర్చలే జరగలేదు. సచిన్ పైలట్ ఇంకా దానినే పట్టుకుంటే.. మీరే(మీడియా) వెళ్లి రాహుల్ గాంధీని అడగండి. ఆయన నిజం చెబుతారు," అని రాజస్థాన్ సీఎం అన్నారు.
'ఇది చాలా తప్పు..'
Sachin Pilot vs Ashok Gehlot : అశోక్ గహ్లోత్ ఆరోపణలను సచిన్ పైలట్ తిప్పికొట్టారు.
"అశోక్ గహ్లోత్ లాంటి సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఎంతో అనుభవం ఉన్న ఆయన.. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తుకు పోసుకునే సమయం కాదు ఇది. బీజేపీపై పోరాటంలో అందలు కలిసిగట్టుగా పనిచేయాలి. మనం కలిసిగట్టు ఉండి గుజరాత్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయం ఇది. కలిసిగట్టుగా ఉండి రాజస్థాన్‌లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే సమయం ఇది," అని సచిన్ పైలట్ అభిప్రాయపడ్డారు.
Rajasthan Congress war : దేశంలో.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఒకటి రాజస్థాన్. ఇంకోటి ఛత్తీస్‌గఢ్. వచ్చే ఏడాది.. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లు మళ్లీ యుద్ధం దిశగా అడుగులు వేస్తుండటం.. పార్టీ హైకమాండ్‌కు కచ్చితంగా తలనొప్పి తెచ్చిపెట్టే విషయమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత కథనం