Arvind Kejriwal: "56 ప్రశ్నలు అడిగారు.. ఈ కేసు మొత్తం ఫేక్": 9గంటలపాటు సీబీఐ విచారణ తర్వాత సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‍ను లిక్కర్ పాలసీ కేసులో 9 గంటల పాటు విచారించింది సీబీఐ. ఆయన సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి బయటికి వచ్చారు.
Arvind Kejriwal: ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party - APP) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‍ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తొమ్మిది గంటల పాటు విచారించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో ఆయనను ఆదివారం (ఏప్రిల్ 16) సుదీర్ఘంగా ప్రశ్నించారు సీబీఐ అధికారులు. సుమారు 9 గంటల విచారణ తర్వాత ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి కేజ్రీవాల్ ఆదివారం రాత్రి బయటికి వచ్చారు. లిక్కర్ పాలసీ కేసులో సాక్షిగా విచారణకు రావాలని కేజ్రీవాల్‍కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆదివారం ఆయన సీబీఐ ముందు హాజరయ్యారు. కాగా, సీఎం, పార్టీ చీఫ్ కేజ్రీవాల్‍ను సీబీఐ సుదీర్ఘంగా విచారిస్తున్న తరుణంలో ఆప్ ముఖ్యనేతలు ఓ సమావేశాన్ని కూడా నిర్వహించారు.
అంతా నకిలీ
లిక్కర్ పాలసీ కేసు అంతా ఫేక్ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. “సీబీఐ నన్ను 56 ప్రశ్నలు అడిగింది. అవన్నీ నకిలీవే. ఈ కేసే నకిలీది. మాపై నేరం మోపేందుకు వారి వద్ద ఏమీ లేదని నాకు అర్థమైంది. ఒక్క ఆధారం కూడా వారి వద్ద లేదు” అని సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి లోధీ రోడ్డులోని తన ఇంటికి చేరుకున్న సమయంలో విలేకరులతో కేజ్రీవాల్ అన్నారు.
బీజేపీకి కేజ్రీవాల్ ఫోబియా
Arvind Kejriwal - Aam Aadmi Party: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‍ను విచారిస్తున్న సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఆమ్ఆద్మీ నేతలు రాఘవ్ చడ్డా, సంజయ్ సింగ్, జాస్మిన్ షాతో పాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. దీంతో రాఘవ్‍తో పాటు ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
“కేజ్రీవాల్ ఫోబియాతో బీజేపీ వణికిపోతోంది. కేజ్రీవాల్‍పై ఉన్న భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. మేం జైలుకు భయపడం” అని రాఘవ్ చద్దా అన్నారు.
Arvind Kejriwal: సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద 1,000 మందికి పైగా భద్రతా సిబ్బంది మోహరించారు. ఆ ప్రాంతమంతా 144 సెక్షన్ విధించారు అధికారులు. నలుగురి కంటే ఎక్కువ మంది ఆ ప్రాంతంలో గుమికూడదని ఆంక్షలు విధించారు.
ఆమ్ఆద్మీ నేతల సమావేశం
Arvind Kejriwal - Aam Aadmi Party Meet: సీఎం అరవింద్ కేజ్రీవాల్‍ను సీబీఐ సుదీర్ఘంగా విచారిస్తున్నసమయంలో ఆదివారం సాయంత్రం ఆమ్ఆద్మీ పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు. ఆప్ జాతీయ సెక్రటరీ పంకజ్ గుప్తా, ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్ మహమ్మద్ ఇక్బాల్ ఈ సమావేశంలో ఉన్నారు. అలాగే పార్టీ ఆఫీస్ బేరర్లు, జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
Arvind Kejriwal - Aam Aadmi Party Meet: ఒకవేళ తనను అరెస్ట్ చేయాలని బీజేపీ ఆదేశిస్తే.. సీబీఐ అలానే చేస్తుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. విచారణకు వెళ్లే ముందు అన్నారు. తాను అవినీతి పరుడిని అయితే, ఈ భూమిపై ఇంకెవరు నిజాయితీపరులు కారని ఆయన చెప్పారు. మద్యం పాలసీ కేసులో రోజుకు ఒకరిని అదుపులోకి తీసుకొని కేజ్రీవాల్ లేదా సిసోడియా పేర్లు చెప్పాలని హింసిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఫిబ్రవరిలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ ముఖ్యనేత మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఆయన ఇంకా కస్టడీలోనే ఉన్నారు. బెయిల్‍కు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇక ఇదే కేసుకు సంబంధం ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలతో ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‍ను 2022లో ఈడీ అరెస్ట్ చేసింది.