Arvind Kejriwal : ప్రధాని మోదీపై అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు 5 ప్రశ్నలు-arvind kejriwal comments on pm modi and asks 5 questions to rss chief mohan bhagawat ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Arvind Kejriwal : ప్రధాని మోదీపై అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు 5 ప్రశ్నలు

Arvind Kejriwal : ప్రధాని మోదీపై అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు 5 ప్రశ్నలు

Anand Sai HT Telugu
Sep 22, 2024 05:47 PM IST

Arvind Kejriwal : తనపై వచ్చిన అవినీతి ఆరోపణలతో బాధపడి రాజీనామా చేశానని దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు పలు ప్రశ్నలు వేశారు.

అరవింద్ కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి, ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడానికి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుంటుందని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత తన తొలి 'జనతా కీ అదాలత్' బహిరంగ సభలో కేజ్రీవాల్ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను ఐదు ప్రశ్నలు సంధించారు. గౌరవంతో మోహన్ భగవత్‌ను ఐదు ప్రశ్నలు అడగాలనుకుంటున్నానని కేజ్రీవాల్ చెప్పారు.

కేజ్రీవాల్ అడిగిన ప్రశ్నలు ఇవే..

మోదీ ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయడం, వారిని ప్రలోభపెట్టడం ద్వారా లేదా ఈడీ, సీబీఐలతో బెదిరించడం ద్వారా ప్రభుత్వాలను పడగొట్టే విధానం సరైనదేనా? భారతీయ జనతా పార్టీ రాజకీయాలతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) ఏకీభవిస్తుందా? అని అడిగారు.

అవినీతిపరులని మోదీ స్వయంగా పిలిచిన వ్యక్తులను తన పార్టీలో చేర్చుకున్నారు. అలాంటి రాజకీయాలను మీరు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు.

బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చింది. బిజెపి తప్పుదారి పట్టకుండా చూసుకోవడం ఆర్ఎస్ఎస్ బాధ్యత. ఎప్పుడైనా మోదీని తప్పుడు పనులు చేయకుండా ఆపారా? జేపీ నడ్డా లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు ఆర్‌ఎస్‌ఎస్ అవసరం లేదని అన్నారు. అంతగా ఎదిగిపోయారా?

మాతృసంస్థపై తన అసంతృప్తిని చూపిస్తున్నారు. వాళ్లు ఇలా చెప్పినప్పుడు మీకు బాధ కలగలేదా?

75 ఏళ్ల తర్వాత నేతలు రిటైర్ అవుతారని మీరు చట్టం చేశారు. మోదీకి ఈ రూల్ వర్తించదని అమిత్ షా చెబుతున్నారు. అద్వానీకి వర్తించే రూల్ మోదీకి ఎందుకు వర్తించదు? అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

బాధపడి రాజీనామా చేశా

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. తాను దేశానికి సేవ చేసేందుకేరాజకీయాల్లోకి వచ్చానని, అధికారం, పదవి కోసం కాదని కేజ్రీవాల్ అన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలతో బాధపడి రాజీనామా చేశానని , గత 10 ఏళ్లలో తాను సంపాదించింది డబ్బు కాదని, గౌరవం మాత్రమేనని అన్నారు. త్వరలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తనకు అగ్ని పరీక్ష అని, తాను నిజాయితీపరుడు కాదు అని భావిస్తే ప్రజలు ఓటు వేయవద్దని కోరారు.

Whats_app_banner