Indus Water Treaty : సింధు నదీ జలాల ఒప్పందానికి 64 ఏళ్లు.. పాక్‌కు భారత్ నోటీసులు ఎందుకు పంపింది?
Indus Water Treaty : పాకిస్థాన్‌కు ఇటీవలే భారతదేశం నోటీసులు పంపింది. 64 ఏళ్ల కిందట సరిగ్గా సెప్టెంబర్ 19న జరిగిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని పేర్కొంది. కాలక్రమేణా అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, అవసరాలకు తగ్గట్టుగా పున:సమీక్షించాలని భారత్ కోరుతోంది.
1960లో జరిగిన సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి సమీక్షించి, సవరించాలని కోరుతూ ఆగస్టు 30న భారత్ అధికారికంగా పాకిస్థాన్‌కు నోటీసు పంపింది. కాలానుగుణంగా ఐడబ్ల్యూటీ(Indus Water Treaty) నిబంధనలు సక్రమంగా ఆమోదించి ఒప్పందం ద్వారా సవరించాలి. ఈ మేరకు ఐడబ్ల్యూటీ ఆర్టికల్ XII(3) ప్రకారం రెండు ప్రభుత్వాలు చర్చించాలని నోటీసులు పంపింది.
సెప్టెంబర్ 19 నాటికి ఈ ఒప్పందం 64 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఒప్పందంపై కొనసాగుతున్న వివాదంతో, భారతదేశం ఎలాంటి మార్పులు, సమీక్షలను కోరుతుందో చూద్దాం.
ఒప్పందాన్ని సవరించాలనే డిమాండ్ ఎందుకు?
సింధు జలాల ఒప్పందాన్ని మార్చాలని కోరుకోవడానికి భారతదేశం అనేక ముఖ్యమైన కారణాలను చెబుతోంది. వివాద పరిష్కార వ్యవస్థను స్పష్టం చేయడం ప్రధాన కారణం. న్యాయమైన ప్రక్రియను నిర్ధారించడానికి, వివాదాలను చూసేందుకు తటస్థ నిపుణుడు, మధ్యవర్తిత్వ న్యాయస్థానం అవసరమయ్యే నిబంధనను భారతదేశం జోడించాలనుకుంటోంది. సింధు నదీ జలాల ఒప్పందం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకూ చాలా మార్పులు జరిగాయని భారత్ అంటోంది. అందుకే ఒప్పందలో మార్పులు జరగాలని పట్టుబడుతోంది.
గత 64 ఏళ్లలో జనాభా పెరిగిందని, దేశ వ్యవసాయ అవసరాలు కూడా గణనీయంగా మారిపోయాయని నోటీసుల్లో భారత్ పేర్కొంది. నీటి అవసరాల దృష్ట్యా ఒప్పందాన్ని సమీక్షించాలని అంటోంది. భారతదేశ ఉద్గార లక్ష్యాలను చేరుకోవడానికి స్వచ్ఛమైన ఇంధన అభివృద్ధిని వేగవంతం చేయాలని అనుకుంటోంది. జమ్మూ కాశ్మీర్‌లో కొనసాగుతున్న సీమాంతర ఉగ్రవాదం ప్రభావం ఒప్పందం సజావుగా సాగడాన్ని ప్రభావితం చేసింది. భారతదేశం తన హక్కులను పూర్తిగా ఉపయోగించుకోకుండా నిరోధించిందని భారత్ భావిస్తోంది.
వాతావరణ మార్పుల గణనీయమైన ప్రభావాన్ని కూడా భారతదేశం చెప్పింది. వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలను సూచిస్తూ 2021లో ఒప్పందంపై మళ్లీ చర్చలు జరపాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. వాతావరణ మార్పు, పర్యావరణ ప్రభావ అంచనాల వంటి ముఖ్యమైన సమస్యలను ఒప్పందంలో ప్రస్తావించలేదని కమిటీ నివేదిక పేర్కొంది. అందువల్ల సింధు పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యతపై వాతావరణ మార్పుల ప్రభావం, ఒప్పందం పరిధిలోకి రాని ఇతర ముఖ్యమైన అంశాలను పరిష్కరించడానికి మళ్లీ చర్చలు జరపాల్సిన అవసరం ఉందని భారతదేశం విశ్వసిస్తోంది.
సింధు నదీ జలాల ఒప్పందం ఏంటి?
ప్రపంచ బ్యాంకు సహాయంతో భారతదేశం, పాకిస్తాన్ మధ్య చర్చలు జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత 1960లో సింధు జలాల ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇది అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ ఒప్పందాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ఒప్పందానికి చాలా చరిత్ర ఉంది. ఈ ఒప్పందం సింధు, జీలం, చీనాబ్‌లను పాకిస్తాన్‌కు, రావి, బియాస్, సట్లెజ్‌లను భారతదేశానికి కేటాయిస్తుంది. ఇవన్నీ సింధు నదికి ఉపనదులు. రెండు దేశాలకు ఈ నదులపై కొన్ని ఉపయోగాలు అనుమతించారు. ఈ సమయంలో నీటి వినియోగం, నీటి పరిమాణానికి సంబంధించి భారత్, పాక్ మధ్య ఒప్పందం కుదిరింది. సింధు నదిపై భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్తాన్, చైనా వంటి దేశాలతో వివాదం ఉంది.
నదుల వినియోగానికి సంబంధించి భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య సహకారం, సమాచార మార్పిడిని సులభతరం చేయడానికి ప్రతి దేశం నుండి ఒక కమిషనర్‌తో కూడిన శాశ్వత సింధు కమిషన్‌ను ఈ ఒప్పందం ఏర్పాటు చేసింది. శాశ్వత సింధు కమిషన్ ప్రశ్నలను నిర్వహిస్తుంది. తటస్థ నిపుణుడి ద్వారా విభేదాలను పరిష్కరిస్తుంది. వివాదాలను పరిష్కరించేందుకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌తో తలెత్తే సమస్యలను పరిష్కరించే విధానాలను కూడా ఒప్పందం వివరిస్తుంది.