Kota suicides: కోటాలో మరో జేఈఈ విద్యార్థి ఆత్మహత్య; ఈ ఏడాది ఇప్పటివరకు 12 మంది బలవన్మరణం-16yearold student found dead in kota suicide suspected ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kota Suicides: కోటాలో మరో జేఈఈ విద్యార్థి ఆత్మహత్య; ఈ ఏడాది ఇప్పటివరకు 12 మంది బలవన్మరణం

Kota suicides: కోటాలో మరో జేఈఈ విద్యార్థి ఆత్మహత్య; ఈ ఏడాది ఇప్పటివరకు 12 మంది బలవన్మరణం

HT Telugu Desk HT Telugu
Jul 04, 2024 09:11 PM IST

నీట్, జేఈఈ పరీక్షల శిక్షణకు పేరుగాంచిన రాజస్తాన్ లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. పరీక్షలు, ఫలితాల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. బిహార్ కు చెందిన 16 ఏళ్ల విద్యార్థి ఒకరు బుధవారం ఉరి వేసుకుని చనిపోయాడు.

కోటాలో మరో జేఈఈ విద్యార్థి ఆత్మహత్య
కోటాలో మరో జేఈఈ విద్యార్థి ఆత్మహత్య

అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)కు సిద్ధమవుతున్న బీహార్ లోని నలందకు చెందిన 16 ఏళ్ల విద్యార్థి రాజస్థాన్ లోని కోచింగ్ హబ్ కోటాలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.

సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని..

తను ఉంటున్న పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆ విద్యార్థి చనిపోయాడు. స్థానిక పోలీసు అధికారి మహేంద్ర మారూ ‘‘ఆ విద్యార్థి పేయింగ్ గెస్ట్ హౌజ్ లోని తన రూమ్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేేసుకుని చనిపోయాడు. అంతకుముందు, అదే ఫ్లోర్ లో ఉంటున్న స్నేహితులు పలుమార్లు అతని తలుపు తట్టారు... ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు పోలీసులకు, నీట్ కు ప్రిపేర్ అవుతూ, కోటాలోనే వేరే చోటు ఉంటున్న తన తమ్ముడికి సమాచారం ఇచ్చారు’’ అని వివరించారు. ఆ 16 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని తలుపులు పగులగొట్టి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. అతని తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. కోటాలోని ఓ కోచింగ్ సెంటర్ లో గత ఏడాది కాలంగా ఆ విద్యార్థి శిక్షణ పొందుతున్నాడు.

గతనెలలో 12 మంది..

కోటాలో గత నెలలో ముగ్గురు సహా 2024 లో ఇప్పటివరకు 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏడాది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏటా రూ.10,000 కోట్ల విలువైన నీట్, జేఈఈ కోచింగ్ వ్యాపారానికి కోట కేంద్రంగా ఉంది. దేశం నలుమూలల నుండి విద్యార్థులు పదవ తరగతి పూర్తయిన తరువాత కోటాకు పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. రెసిడెన్షియల్ టెస్ట్ ప్రిపరేషన్ ఇన్స్టిట్యూట్లలో నమోదు చేసుకుంటారు.

ఆత్మహత్యల హబ్

కోటాలో 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా కోచింగ్ సంస్థలు మూసివేయడం లేదా ఆన్లైన్లో నడపడంతో 2020 మరియు 2021 లో ఆత్మహత్యలు నమోదు కాలేదు. ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ వసతి గృహాలు గదుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు మానసిక మద్దతు, భద్రత కల్పించాలని గత ఏడాది ఆగస్టులో అధికారులు ఆదేశించారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు రాజస్థాన్ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ లో పలు చర్యలు ప్రకటించింది.

Whats_app_banner