World Health Day 2022 | ఫిజికల్‌గా, మెంటల్‌గా ఫిట్‌గా ఉండాలంటే.. ఈ చిట్కాలు చాలు
ఆరోగ్యంగా ఉండటం, మంచి నాణ్యమైన జీవితాన్ని గడపడం అనేది శారీరక, మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. వీటిని కాపాడుకోవడానికి ప్రధాన లక్ష్యాలు ఉండాల్సిందే అంటున్నారు మానసిక నిపుణులు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవాలంటే... చాలా కష్టంతో కూడుకున్న పని. మానసికంగా ఒత్తిడి పెరిగితే.. అది శారీరక శ్రేయస్సుపై కూడా ప్రభావం చూపుతుందని గుర్తుపెట్టుకోవాలి. మరి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
World Health Day 2022 | ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆందోళనకు గురిచేసేది ఆరోగ్యం. ఈ నిర్దిష్ట అంశంపై దృష్టిని ఆకర్షించడానికి ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. ఏప్రిల్ 7వ తేదీ 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపన వార్షికోత్సవం జరిగింది. అదే రోజు నుంచి ప్రపంచ ఆరోగ్యదినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రజలు వారి ఆరోగ్యంపై దృష్టిపెట్టేలా ప్రోత్సహించడమే ముఖ్య లక్ష్యంగా దీనిని ఏటా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో భాగంగా.. ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి, వారి శ్రేయస్సుపై దృష్టి సారించేలా.. సమాజాలను రూపొందించడానికి.. వారిని ఓ ఉద్యమంలా ప్రోత్సాహించేలా.. WHO కృషి చేస్తుంది.
శారీరక, మానసిక ఆరోగ్యాల మధ్య సంబంధం..
ఈ క్రమంలోనే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందేందుకు మనము కూడా కృషి చేయాలి. మానసిక, శారీరక ఆరోగ్యాల మధ్య సమతుల్యత ఉండేలా మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. ముందుగా ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి. "నాకు బాగా అనిపించడం లేదు," "నాకు తినాలి అనిపించడం లేదు," "నాకు ఆకలిగా లేదు ఎందుకంటే నేను తినే మూడ్‌లో లేను".. ఇలాంటివన్నీ.. మానసిక, శారీరక ఆరోగ్యాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి అనడానికి ఉదాహరణలు.
శారీరక, మానసిక ఆరోగ్యం మధ్య అసమతుల్యత దీర్ఘకాలంలో క్యాన్సర్, హృదయ, శ్వాసకోశ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు వెల్లడించారు. దీర్ఘకాలిక శారీరక ఆరోగ్య పరిస్థితులు ఉన్న ముగ్గురిలో ఒకరు మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారనే విషయాన్ని నివేదికలు వెల్లడించాయి. పైగా ఇది రోగనిరోధక వ్యవస్థను కూడా క్షీణింపజేస్తుందని, నిద్రకు ఆంటంకం కలిగిస్తుందని తెలిసింది. అందుకే శారీరక, మానసిక ఆరోగ్యం మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ 5 చిట్కాలను పాటించాలి అంటున్నారు నిపుణులు.
వ్యాయామం
శరీరం ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం అనేది ఒక అద్భుతమైన ఎంపిక. ఇది శరీరానికే కాదు మానసిక శ్రేయస్సును మెరుగుపరిచేందుకు కూడా కృషి చేస్తుంది. క్రీడలు, నృత్యం, యోగా లేదా ఇతర రోజువారీ శారీరక కార్యకలాపాలలో కూడా పాల్గొనవచ్చు. ప్రతిరోజు చేసే వ్యాయామం జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరచి, శక్తి, చురుకుదనాన్ని పెంచుతుంది.
ఆహారపు అలవాట్లు
ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటుంది. తాజా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, మంచి ఆహార ప్రణాళికను అనుసరించడం మంచి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
ప్రశాంతమైన నిద్ర
రాత్రిపూట మంచి నిద్ర శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచుతుంది. మానసికంగా ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా నిద్రపోయిన సమయంలో శరీరం రిలాక్స్ అయి.. నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
చెడు అలవాట్లు
చెడు అలవాట్లను వదిలించుకోవడానికి ప్రతిరోజూ చర్యలు తీసుకోవాలి. ధూమపానం, మద్యం సేవించడం, జంక్ ఫుడ్ తినడం, ఎక్కువ స్క్రీన్ సమయం వంటి వాటిని క్రమంగా తగ్గించుకోవాలి. మన అలవాట్లను క్రమబద్ధీకరించుకోవడం వల్ల శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయి.
మంచి అలవాట్లు
మనసును శాంతపరచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి సహాయపడే కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రయత్నించాలి. ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. తద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతికూల భావోద్వేగాల కంటే సానుకూల భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెట్టండి.
సంబంధిత కథనం