Miss World: మిస్ వరల్డ్‌కు, మిస్ యూనివర్స్‌కు మధ్య తేడా ఏమిటి? ఆ పోటీల్లో ఎలా పాల్గొనవచ్చు?
Miss World: మిస్ వరల్డ్ విజేత ఎవరో ఈరోజు రాత్రికి తెలిసిపోతుంది. చాలామందికి మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ మధ్య తేడా తెలియదు. ఈ రెండిటికీ మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం.
Miss World: మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్... రెండూ కూడా అందాల ప్రపంచంలో ఉత్తమ కిరీటాలే. వీటిని సొంతం చేసుకున్న విజేత ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందుతుంది. సుస్మితసేన్, లారా దత్తా, హర్నాజ్ సంధు... వీరంతా మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్న వారే. ఇక రీటా ఫారియా, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్... వీరంతా మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందినవారు.
మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్... ఈ రెండూ కూడా ప్రపంచంలోనే అత్యుత్తమ అందాల పోటీలు. వీటిలో గెలిచిన అందగత్తెలు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఎంతో గుర్తింపును పొందుతారు. అయితే ఈ రెండిటినీ వేరువేరుగా నిర్వహిస్తారు. ఈ మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్... ఈ రెండూ కూడా అపురూప అందగత్తెలనే కాదు తెలివైన వారిని కూడా ఎంపిక చేస్తాయి.
మిస్ వరల్డ్ ఎవరు నిర్వహిస్తారు?
మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహించేది పూర్తిగా ప్రైవేటు సంస్థలే. మిస్ వరల్డ్ పోటీలను మొదలుపెట్టింది బ్రిటన్‌కు చెందిన ఎరిక్ మోర్లే అనే వ్యక్తి. అతను ఒక బ్రిటిష్ టీవీలో యాంకర్‌గా పనిచేసేవాడు. అందాన్ని ఆరాధించే ఎరిక్ మోర్లే 1951లో మిస్ వరల్డ్ పోటీలను మొదలుపెట్టారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా దీన్ని నిర్వహించేవారు. ఎరిక్ మోర్లే మరణించాక అతని భార్య జూలియా మోర్లే వీటిని నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఈ మిస్ వరల్డ్ పోటీలను కచ్చితంగా నిర్వహిస్తారు.
మిస్ యూనివర్స్ ఎవరు నిర్వహిస్తారు?
మిస్ యూనివర్స్ విషయానికి వస్తే దీన్ని ప్రారంభించింది అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఒక వ్యాపారవేత్త. పసిఫిక్ మిల్స్ అనే దుస్తుల కంపెనీని ఆయన నడిపేవారు. ఆ కంపెనీ ద్వారానే మిస్ యూనివర్స్ ను ప్రారంభించారు. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ప్రారంభించి దాని ద్వారానే ఈ పోటీలను నిర్వహించేవారు. బ్రిటన్లో మిస్ వరల్డ్ పోటీలు మొదలయ్యాక దాన్నే స్ఫూర్తిగా తీసుకొని మిస్ యూనివర్స్ పోటీలను 1952లో ప్రారంభించారు. ఈ రెండింటికి పెద్ద తేడా లేదు. ఈ రెండూ కూడా ప్రపంచ దేశాలకు చెందిన అందగత్తెలను ఒకచోట చేర్చి... వారిలోంచి అపురూప అందగత్తెను ఎంపిక చేస్తారు.
మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఈ రెండింటి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. మిస్ యూనివర్స్ పోటీలకు సంబంధించి ప్రతి దేశంలోనూ ఒక సంస్థ స్థానిక ఫ్రాంచైజీని కొనుక్కుంటారు. అలాగే మిస్ వరల్డ్ పోటీలకు పంపేందుకు స్థానిక ఫ్రాంచైజీ ఉంది. ఫెమీనా అలాంటి స్థానిక ఫ్రాంఛైజీ సంస్థే. ఆ ఫ్రాంఛైజీ దక్కించుకున్న సంస్థలు దేశవ్యాప్తంగా అందాల పోటీలను నిర్వహిస్తాయి. ఆ పోటీలో గెలిచిన వారిని అంతర్జాతీయంగా జరిగే మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలకు పంపిస్తాయి. ఫెమీనా మిస్ ఇండియాగా నిలిచిన భామ మిస్ వరల్డ్ పోటీలకు వెళుతుంది.
ప్రతి దేశంలో జరిగే అందాల పోటీలకు ఎంట్రీలను ఆహ్వానిస్తూ ప్రకటన ఇస్తారు. ప్రతి రాష్ట్రంలోనూ ముందుగా అందగత్తెలు ఎంపిక చేస్తారు. మిస్ కర్ణాటక, మిస్ తమిళనాడు ఇలా ప్రతి రాష్ట్రం నుంచి ఒకరు మిస్ ఇండియా వంటి పోటీలకు వెళతారు.
స్థానిక రాష్ట్రాల్లో జరిగే పోటీలకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.
టాపిక్