Miss World 2024: మిస్ వరల్డ్ 2024 విన్నర్‌ను తేల్చే జడ్జిలలో మనవాళ్లే ఎక్కువ, ఇద్దరు తెలుగు హీరోయిన్లు కూడా-most of the judges who will decide the winner of miss world 2024 are indians ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Miss World 2024: మిస్ వరల్డ్ 2024 విన్నర్‌ను తేల్చే జడ్జిలలో మనవాళ్లే ఎక్కువ, ఇద్దరు తెలుగు హీరోయిన్లు కూడా

Miss World 2024: మిస్ వరల్డ్ 2024 విన్నర్‌ను తేల్చే జడ్జిలలో మనవాళ్లే ఎక్కువ, ఇద్దరు తెలుగు హీరోయిన్లు కూడా

Haritha Chappa HT Telugu
Mar 09, 2024 01:55 PM IST

Miss World 2024: మిస్ వరల్డ్ విన్నర్ ఎవరో కొన్ని గంటల్లో తేలిపోతుంది. మిస్ వరల్డ్ విజేతను ఎంపిక చేసే జడ్జిలలో భారతీయులే ఉన్నారు. వారిలో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారు.

మిస్ వరల్డ్ పోటీదారు సినీ శెట్టి
మిస్ వరల్డ్ పోటీదారు సినీ శెట్టి

Miss World 2024: 71వ మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో ఘనంగా జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో విజేత ఎవరో తేలిపోతుంది. ఈ పోటీల్లో అనేక దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొంటున్నారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు విజేత ఎవరో తేలిపోతే మిస్ వరల్డ్ కార్యక్రమాలు కూడా ముగిసిపోతాయి. దాదాపు 112 దేశాల నుంచి పోటీదారులు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడుతున్నారు. మన దేశం నుంచి కన్నడ అందం సినీ శెట్టి మిస్ వరల్డ్ పోటీలో ఉంది. ఆమె ప్రస్తుతం టాప్ 20లో చోటు సంపాదించింది.

మిస్ వరల్డ్ కిరీటం

2017లో మానుషీ చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత మళ్లీ ఆ కిరీటం మన దేశానికి దక్కలేదు. ఇప్పుడు సినీ శెట్టి ఆ కిరీటాన్ని అందుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు. ఇప్పటివరకు మిస్ వరల్డ్ కిరీటాన్ని భారతదేశం ఆరుసార్లు గెలిచింది. తొలిసారి రీటా ఫారియా 1966లో ఈ కిరీటాన్ని ఇండియాకు తెచ్చింది. తర్వాత ఐశ్వర్యారాయ్, డయానా హెడెన్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ ప్రపంచ సుందరీమణులుగా గెలిచారు.

మిస్ వరల్డ్ పోటీ ఎక్కడ జరుగుతోంది?

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రస్తుతం మిస్ వరల్డ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ పోటీ ముగిసిపోతుంది. విజేత ఎవరో తేలిపోతుంది. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ వేడుక మొదలవుతుంది. దీన్ని చూడాలనుకుంటే మిస్ వరల్డ్ వెబ్ సైట్లోకి వెళ్లి ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. లేదా సోనీ లివ్ వారు దీన్ని ప్రసారం చేస్తున్నారు.

హోస్ట్... కరణ్ జోహార్

మిస్ వరల్డ్ 2024 కార్యక్రమానికి ప్రముఖ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈయనతో పాటు ఫిలిప్పీన్స్ కు చెందిన మేగాన్ యంగ్ కూడా ఉండబోతున్నారు. మేగాన్ యంగ్ 2013లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు.

న్యాయ నిర్ణేతలు ఎవరు?

మిస్ వరల్డ్ 2024 వేడుకకు న్యాయనిర్ణేతలుగా మన దేశానికి చెందిన ప్రముఖులు వ్యవహరిస్తున్నారు. 12 మంది న్యాయమూర్తుల పానెల్ ఏర్పాటైంది. ఇందులో బాలీవుడ్ సినీ నిర్మాత సాజిద్ నాదియవాలా, క్రికెటర్ హర్భజన్ సింగ్, నటి అమృత ఫడ్నవీస్, హీరోయిన్ కృతి సనన్, మరొక హీరోయిన్ పూజా హెగ్డే, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ జూలియా మోర్లే... తదితరులు ఉన్నారు. ఈసారి మిస్ వరల్డ్ వేడుక భారతదేశంలోనే జరుగుతోంది. కాబట్టి న్యాయ నిర్ణేతల ప్యానెల్‌లో ఎక్కువ మంది మన దేశానికి చెందిన వారే ఉండడం విశేషం. ఏ దేశం వారు జడ్జిలుగా ఉన్నా కూడా ఈ పోటీలు పారదర్శకంగానే జరుగుతాయి.

Whats_app_banner