Parenting | పిల్లలు మీ మాట వినడం లేదా.. అయితే ఇలా చేసి చూడండి!
మా పిల్లలు చెప్పిన మాట వినడం లేదు. మరీ మొండిగా తయారవుతున్నారు. ఏం చేయాలో తోచడం లేదు అని చెప్పే పేరెంట్స్ సంఖ్య ఎక్కువవుతోంది. అలాంటి పేరెంట్స్ లిస్ట్‌లో మీరూ ఉంటే ఈ ఆర్టికల్ మీ కోసమే. ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటించి చూడండి. మీ పిల్లలు కచ్చితంగా మీ మాట వింటారు.
Parenting.. ఈ కాలంలో పిల్లలను పెంచి పెద్ద చేయడం పెద్ద సవాలుగా మారింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం ఒక కారణమైతే.. రోజురోజుకూ పిల్లల మారాం పెరిగిపోతుండటం మరో కారణం.
పిల్లలనూ గౌరవించాల్సిందే..
గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలని మనం తరచూ చెప్పుకుంటూనే ఉంటాం కదా. పిల్లల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. మన పిల్లలే కదా అని వారిపై అరుస్తూ, కఠినంగా వ్యవహరిస్తూ మీ మాట వినేలా చేసుకుంటే మాత్రం భవిష్యత్తులో ప్రమాదమే. పిల్లలు క్రమంగా మీకు దూరమయ్యే ప్రమాదం ఉంది.
కఠినంగా ఉండటం వల్ల ఆ సమయంలో పిల్లలు మీ మాట వింటారేమో కానీ.. క్రమంగా వారి మనసులో మీపై ప్రతికూల భావన ఏర్పడుతుంది. అందుకే పిల్లలను కూడా గౌరవించండి. ఒకరినొకరు గౌరవిస్తేనే బంధం బలపడుతుంది. అది తల్లిదండ్రులు, పిల్లలైనా సరే ఇదే సూత్రం వర్తిస్తుంది. పిల్లలపై ఊరికే అరవొద్దు. ఇలా చేయడం వల్ల లోలోపల మీపై పగను పెంచుకునే ప్రమాదం ఉంది. పిల్లలను గౌరవిస్తూ, బుజ్జగిస్తూ మీరు చెప్పాలనుకున్నది చెబుతూ వెళ్లండి.
క్రమంగా వారిలో మార్పు వస్తుంది. మీ మాట వినడం మొదలుపెడతారు. తల్లిదండ్రులుగా పిల్లలను శాసించే, తిట్టే, కొట్టే అధికారం మీకు ఉందని అనుకుంటే పొరపాటు చేసినట్లే. ఇది పిల్లలతో బంధాన్ని బలహీనం చేస్తుంది. మిమ్మల్ని అవతలి వాళ్లు ఎలా ట్రీట్ చేయాలని మీరు భావిస్తున్నారో వాళ్లను కూడా మీరు అలాగే ట్రీట్ చేయాలన్న సూత్రాన్ని గుర్తుంచుకోండి.
చెప్పింది చేయండి
పిల్లలను మీరు గౌరవించడం ప్రారంభించారంటే చాలు వాళ్లు క్రమంగా మీ మాట వినడం మొదలుపెడతారు. అప్పుడు వాళ్లకు క్రమశిక్షణను ఈజీగా నేర్పించవచ్చు. ఈ సమయంలోనే మీరు మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలు మారాం చేస్తుంటే.. ఏదో ఒక రకంగా వారిని భయపెట్టడానికి కొన్ని మాటలు చెబుతారు.
ఈ సమయంలోనే మీరు చెప్పింది కచ్చితంగా చేయండి. అలా చేయకపోతే.. వీళ్లు ఎప్పుడూ ఇంతే.. ఊరికే అలా ఏదో ఒకటి చెబుతుంటారు అన్న భావన పిల్లల్లో కలుగుతుంది. ఆ తర్వాత నుంచి మీరు చెప్పిన విషయాన్ని లైట్ తీసుకోవడం మొదలుపెడతారు. మీరు చెప్పే ప్రతి ఒక్కటీ చేసి తీరుతారన్న భావన పిల్లల్లో కలిగిందంటే చాలు.. వాళ్లు దారికొస్తారు.
ఎక్కువగా భయపెట్టొద్దు
మాట వినకపోతే నిన్ను హాస్టల్‌లో వేస్తా.. డార్క్ రూమ్‌లో వేస్తా.. నీ బొమ్మలన్నీ తీసి బయటపడేస్తా.. అని కొందరు తల్లిదండ్రులు పిల్లలను భయపెడుతుంటారు. ఎంత ఎక్కువ భయపెడితే వాళ్లు అంతగా లొంగుతారని అనుకుంటారు. కానీ ఇది తప్పు. ఈ భయం కొన్నాళ్లే ఉంటుంది.
పైగా ఏదో మీ పిల్లలను భయపెట్టడానికి తప్ప నిజంగా మీరు అలా చేసే అవకాశాలు తక్కువ. అలాంటప్పుడు ఇది క్రమంగా వారిలో మీపై వ్యతిరేక భావాన్ని పెంచుతుంది. అందుకే చిన్న చిన్న విషయాలకు కూడా వారిని బెదిరించడం, భయపెట్టడం మానుకోండి.
ఒకేసారి వార్నింగ్
కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలను ఒక్కసారి ఏదైనా పని చెబితే వాళ్లు చేసేసేలా మలుచుకుంటారు. మీ పిల్లలూ అలా మారాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి. ఉదాహరణకు మీ పిల్లలు ఉదయం లేవగానే వాళ్ల పక్కలో బట్టలు మడతపెట్టకపోవడం, తిన్న తర్వాత ప్లేటు తీసి సింకులో వేయకపోవడం చేస్తుంటారు.
ఇలాంటి పనులను ఒక్కసారి చెప్పగానే పిల్లలు చేసేయాలంటే వారికో చిన్న పనిష్మెంట్ ఇవ్వండి. ఒక్కసారి చెబితే చేయలేదంటే.. ఆ రోజు టీవీ లేదా మొబైల్ చూసే చాన్స్ ఇవ్వకపోవడం, బయటకు వెళ్లి ఆడనివ్వకపోవడం వంటివి చేయండి. ఓ పని చేయకపోతే జరిగే నష్టమేంటో వారికి తెలిసి వస్తుంది. ఇది క్రమంగా వారిలో మార్పు తీసుకొస్తుంది.
చెప్పింది జాగ్రత్తగా వినండి
పిల్లలు వాళ్లు చెప్పింది మనం శ్రద్ధగా వినాలని కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది పేరెంట్స్ పని ఒత్తిడి కారణంగానో లేదంటే మొబైల్‌లో పడి బిజీగా మారడం వల్లో పిల్లలు చెప్పింది సరిగా వినడం లేదు. ఇది మీపై పిల్లల్లో వ్యతిరేక భావం పెంచేలా చేస్తుంది. వాళ్లు మీకు ఏదైనా చెబుతున్నా లేదంటే.. మీరు వారికి ఏదైనా పని చెప్పాలని అనుకున్నా.. నేరుగా వారి కళ్లలోకి చూసి మాట్లాడండి.
వారు చెప్పింది మీరు శ్రద్ధగా వింటే.. మీరు చెప్పింది కూడా వాళ్లు వింటారు. వారి గురించి మీరు ఎంతో కేర్ తీసుకుంటున్నారని, మీరు చెప్పే ప్రతి మాటా, పని వారి బాగు కోసమేనన్న భావన పిల్లల్లో కలగాలి.
ఈ పనులు కచ్చితంగా చేయండి
పిల్లలకు మనం విలువ ఇస్తున్నామన్న సంగతి వారికి తెలియాలి. ఇలా చేయాలంటే వారిని తరచూ పొగుడుతూ ఉండటం, వెన్ను తట్టి ప్రోత్సహించడం, హగ్ చేసుకోవడం, వాళ్లు చేస్తున్న పనులపై ఆసక్తి చూపడం, వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడే ప్రయత్నం చేయడం, నవ్వుతూ మాట్లాడటం, వాళ్ల భయాలను తొలగించడం, ప్రతి రోజూ కొంత సమయం వారితో గడపడం, వాళ్లు మీతో మాట్లాడిన ప్రతిసారీ స్పందించడం వంటివి చేయాలి.
పిల్లలు మిమ్మల్ని గౌరవించాలంటే.. వారికి మీరు చెబుతున్న ప్రతి పనినీ మీరూ చేస్తూ ఓ రోల్ మోడల్‌లాగా నిలవాలి. పిల్లలు సాధారణంగా మనం ఏం చేస్తే అది చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మనకు మంచి అలవాట్లు ఉంటే.. ఆటోమేటిగ్గా పిల్లలకూ అవే అలవాట్లు వస్తాయన్న విషయం గుర్తుంచుకోండి.
సంబంధిత కథనం