Monsoon Travel Tips | వర్షాకాలంలో ఈ ప్రాంతాలకు విహారయాత్ర సురక్షితం కాదు!-these popular destinations in india should be avoided touring in monsoon ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monsoon Travel Tips | వర్షాకాలంలో ఈ ప్రాంతాలకు విహారయాత్ర సురక్షితం కాదు!

Monsoon Travel Tips | వర్షాకాలంలో ఈ ప్రాంతాలకు విహారయాత్ర సురక్షితం కాదు!

HT Telugu Desk HT Telugu
Aug 03, 2022 05:18 PM IST

భారతదేశంలో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలను వర్షాకాలంలో విహరించటం అంత సురక్షితం కాదు. అలాంటి కొన్ని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

Travelling in Monsoon
Travelling in Monsoon (Pixabay)

మాన్‌సూన్‌లో కురిసే వర్షాలకు ప్రదేశాలన్నీ పచ్చగా మారుతాయి. మట్టి వాసనల సుగంధాలు, ఆకాశగంగలను తలపించే జలపాతాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఒళ్లంత తుల్లింతగా వర్షంలో తడిసిముద్దవచ్చు. అయితే ఇది నాణేనికి ఒకవైపు. మరోవైపు ఏంటంటే చిత్తడి నేలలు, చిక్కటి బురద, సీజనల్ వ్యాధులు, కాలుష్యంగా మారే ప్రదేశాలు, ట్రాఫిక్ జాంలు వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి, అన్ని విధాల సిద్ధం చేసుకొని విహార యాత్రకని బయలుదేరితే.. తీరా అక్కడకు వెళ్లాక వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేకపోతే, హోటల్ గదులకు మాత్రమే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. ఫలితంగా ప్రయాణం వృధా, ప్రయాణ ఖర్చులు వృధా అన్నింటికి మించి మీ విలువైన సమయం వృధా అవుతుంది. విహారయాత్రను ఆస్వాదిద్దామనుకుంటే నరకయాతన అనుభవించాల్సి రావొచ్చు. ఎందుకంటే మీరు ఎంచుకున్నది నిజంగా గొప్ప పర్యాటక ప్రదేశం అయి ఉండవచ్చు. కానీ నిర్ధిష్టమైన సీజన్‌లో వెళ్తేనే అందం, ఆనందాన్ని అనుభవించవచ్చు. సీజన్ కాని సీజన్లో వెళ్తే మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు.

అందుకనే మీకోసం అలాంటి కొన్ని ప్రదేశాలను ఇక్కడ అందిస్తున్నాం. ఈ పర్యాటక ప్రాంతాలు వర్షాకాలంలో పర్యటించటానికి అనువైనవి కావు. దీనిని బట్టి మీరు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంచుకునే వీలు కలుగుతుంది.

ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ రుతుపవనాల సమయంలో ఉత్తరాఖండ్ వాతావరణం కొన్ని ప్రాంతాలలో భయానకంగా ఉంటుంది. వర్షాకాలం సమయంలో ఉత్తరాఖండ్ ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో కొండచరియలు విరిగిపడటం, వరదలు రావటం, క్లౌడ్ బరస్ట్ వంటి ఊహించని ప్రతికూల పరిస్థితులు సంభవిస్తాయని గమనించండి. ఈ సీజన్లో అక్కడ ట్రెక్కింగ్ చేయడం, పలు ప్రదేశాలకు ప్రయాణించటం చాలా ప్రమాదకరం.

అస్సాం

వర్షాకాలంలో అస్సాంలోని వివిధ ప్రాంతాలలో తరచుగా కొండచరియలు విరిగిపడటం వార్తలో మీరు చదివే ఉండవచ్చు. వర్షాలు కురిసినప్పుడు ఇక్కడి ప్రాంతాలన్నీ పచ్చదనంతో నిండిపోయినప్పటికీ, ఈ సమయంలో అస్సాం సందర్శించకుండా ఉండటమే మంచిది. అంతేకాదు అస్సాంలో వచ్చే వరదలు ఎంతో వినాశకరమైనవి, ప్రయాణించే రోడ్లు తెగిపోవటం, దెబ్బతినడం జరుగుతుంది.

డార్జిలింగ్

డార్జిలింగ్ మంచి పర్యాటక ప్రదేశం. అయినప్పటికీ వర్షాకాలంలో ఈ ప్రాంతమంతా నిస్తేజంగా మారుతుంది. నిరంతర వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ప్రజలు బయట తిరగటం కష్టంగా ఉంటుంది. రోజంతా గదులకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి సమయంలో టీ ఎస్టేట్‌ల చుట్టూ తిరగడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మార్గాలు జారుడుగా మారుతాయి. అడుగేస్తే టికెట్ లేకుండానే మరోచోటికి వెళ్లిపోవచ్చు. డార్జిలింగ్ పర్యటించాలంటే వేసవి కాలం లేదా చలికాలంలో అయినా యాత్రను ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే హిమాచల్ ప్రదేశ్, ఇతర ఈశాన్య ప్రాంతాలు, హిల్ స్టేషన్స్ వెళ్లకూడదు.

కూర్గ్

దక్షిణ భారతదేశంలో కూర్గ్ లేదా కొడగు ఒక రొమాంటిక్ డెస్టినేషన్. చాలా మంది కొత్త జంటలు హనీమూన్ కోసం ఇక్కడకు వస్తారు. అయితే వర్షాకాలంలో విహరించటం మాత్రం ఇది అనువైనది కాదు. భారీ వర్షాలతో ఇక్కడ ఎక్కువగా రెడ్ అలర్ట్‌ హెచ్చరికలను జారీచేస్తారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండాకాలం, చలికాలంలో ప్లాన్ చేసుకోవాలి.

అలాగే చెన్నై, అండమాన్ దీవులకు వెళ్లడం కూడా ఈ సీజన్ అనువైనది కాదు. సముద్రంలో భయంకరంగా అలలు వస్తాయి.

ముంబై

ముంబైలో చూడటానికి, యాక్టివిటీస్ చేయటానికి ఎంతో గొప్ప ప్రదేశం. అయితే వర్షాకాలంలో వెళ్తే మాత్రం కష్టాలను కొనితెచ్చుకున్నట్లే. వర్షాకాలంలో ఇక్కడ ఎడతెరపి లేకుండా కురిసే వర్షాలకు రోడ్లు నదులవుతాయి. ముంబై చిన్నచిన ద్వీపాల సమూహంతో ఏర్పడిన ఒక నగరం. సముద్రపు బ్యాక్ వాటర్ క్రీక్స్ చాలా ఉంటాయి. ఆ నీళ్లు, వర్షపు నీళ్లు ఒక్కసారిగా నగరాన్ని ముంచెత్తుతాయి. వాహనాలు, రైళ్లు తిరగవు. పడవలే దిక్కు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్