Caravan Holidays | కారవాన్‌లో విహారం.. తెలంగాణ టూరిజం చేసింది సాకారం
సాధారణంగా సినిమా స్టార్లు, పొలిటీషియన్స్ ఏదైనా పర్యటనకు వెళ్తున్నపుడు సకల సౌకర్యాలు ఉండే ప్రత్యేకమైన కారవాన్ వాహనాలను ఉపయోగిస్తారు. ఇలాంటి వాహనాలను అద్దెకు తీసుకొని కోరిన చోటుకి విహార యాత్రకు వెళ్లండంటూ తెలంగాణ టూరిజం శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
Hyderabad | సాధారణంగా మన సినిమా స్టార్లు ఎక్కడికైనా ఔట్ డౌర్ షూటింగ్‌కి వెళ్లినపుడు ప్రత్యేకమైన వాహనాలను ఉపయోగించడం మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. వీటినే కారవాన్ లేదా వ్యానిటీ వ్యాన్స్ అని పిలుస్తారు. ఈ ప్రత్యేకమైన వాహనంలో వారికి సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. షూటింగ్ బ్రేక్ టైంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు ఉంటాయి. అలాగే వాష్ రూమ్స్, టీవీ, రీఫిజరేటర్, వండుకుని తినడానికి ప్రత్యేక వంట సామాగ్రి ఇలా ఒకటేమిటి ఏం కావాలన్నా అందులో ముందుగానే సిద్ధం చేసి ఉంటాయి. వేరే చోటికి వెళ్లినపుడు అక్కడ సరైన వసతులు లేకపోతే ఈ కారవాన్ వాహనాలు చాలా బాగా ఉపయోగపడతాయి. కేవలం సినిమా స్టార్లే కాదు, పొలిటీషియన్స్ కూడా ఏదైనా పర్యటనకు వెళ్తున్నపుడు ఇలాంటి కారవాన్‌లు ఉపయోగిస్తారు.
మరి ఇలాంటి కారవాన్ వాహనాలను కొనుగోలు చేయాలంటే అది అందరికీ సాధ్యపడదు. అయితే అద్దెకు తీసుకొని కోరిన చోటుకి విహార యాత్రకు వెళ్లండంటూ తెలంగాణ టూరిజం శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నగరంలో లేదా మరే ప్రాంతానికైనా విహారయాత్రకు వెళ్లడానికి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ (TSTDC) తరఫున క్యాబ్స్, బస్సులతో పాటు కారవాన్ వాహనాలను ఇప్పుడు అద్దెకు ఇస్తున్నారు. కొవిడ్19 సమయంలో అందరితో కలిసి వెళ్లేందుకు మీకు ఇబ్బంది ఉంటే వీటిని మీకోసమే అద్దెకు తీసుకొని వెళ్లొచ్చు అని చెబుతోంది.
ఏదైనా పచ్చని అటవీప్రాంతానికి లేదా చల్లటి జలపాతాలు ఉన్న చోటుకు లేదా ఇంకెక్కెడికైనా మీ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ఈ కారవాన్ వాహనంలో యాత్రకు వెళ్లి ఒక గొప్ప అనుభూతిని పొందవచ్చు. టీఎస్ టీడీసీకి చెందిన కారవాన్ వాహనంలో ఏసి, ఆధునిక టాయిలెట్, షవర్, రెండు LED స్క్రీన్‌లు ఉండటమే కాకుండా ఒక ఫ్రిజిరేటర్‌తో కూడిన కిచెన్ సౌకర్యం కూడా ఉంది. ఇందులో ఉండే సోఫాలను బెడ్‌లుగా కూడా మార్చుకోవచ్చు. ఒక వ్యాన్‌లో మొత్తం 7 మంది ప్రయాణించవచ్చునని టీఎస్ టీడీసీ చెబుతోంది. అంతేకాదు ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి ఎయిర్ పోర్ట్ నుంచి పికప్- డ్రాప్ సౌకర్యం కూడా ఉంటుంది.
కారవాన్ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి
హైదరాబాద్ నగరంలో అయితే..
8 గంటలు – 80 కిమీ – రూ. 4000
12 గంటలు – 200 కిమీ – రూ. 6000
అవుట్‌స్టేషన్ వెళ్లాలనుకుంటే ఒక కిలోమీటరుకు రూ. 35 ఛార్జి ఉంటుంది, ప్రయాణ దూరం కనీసం 300 కి.మీ ఉండాలి. ఒకవేళ పరిధిని మించి ప్రయాణిస్తే ఒక్కోకిలోమీటరుకు, ఒక్కోగంటకు చొప్పున అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. ఇక మీరు చేసే విహారయాత్రకు సంబంధించిన ఖర్చులో కనీసం 20 శాతం అదనంగా డిపాజిట్ చేయాలి, ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. అలాగే అవుట్‌స్టేషన్ యాత్రలకు GST కూడా ఉంటుంది. టోల్ గేట్లు ఛార్జీలు, పార్కింగ్ ఛార్జీలు మొదలైనవాటిని వినియోగదారుడే భరించాలి.
ఇక యాత్రికుల బడ్జెట్‌ను బట్టి విలాసవంతమైన బెంజ్, వోల్వో బస్సులతో పాటు కార్లు, ఇన్నోవాలు కూడా అద్దెకు ఉన్నాయి. యాత్రికుల సామర్థ్యాన్ని బట్టి ఖర్చును పంచుకుంటే వారికి వారే ప్రత్యేకంగా ప్రయాణించవచ్చునని తెలంగాణ టూరిజం శాఖ చెబుతోంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
సంబంధిత కథనం