Erotophobia: త్వరలో నా పెళ్లి, కానీ నాకు ఆ పనంటే భయం, ఆ ఫోబియాను ఎలా అధిగమించాలి?-my wedding soon but i have a fear of sex how to overcome erotophobia ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Erotophobia: త్వరలో నా పెళ్లి, కానీ నాకు ఆ పనంటే భయం, ఆ ఫోబియాను ఎలా అధిగమించాలి?

Erotophobia: త్వరలో నా పెళ్లి, కానీ నాకు ఆ పనంటే భయం, ఆ ఫోబియాను ఎలా అధిగమించాలి?

Haritha Chappa HT Telugu
Jul 31, 2024 12:30 PM IST

Erotophobia: ఎంతోమందికి ఒక వ్యక్తితో సన్నిహితంగా లైంగిక కలవాలంటే భయం ఉంటుంది. దీన్ని ఎరోటోఫోబియా అని పిలుస్తారు. దీన్ని ఎలా అధిగమించాలో వైద్యులు చెబుతున్నారు.

ఎరోటొఫోబియాను అధిగమించడం ఎలా?
ఎరోటొఫోబియాను అధిగమించడం ఎలా? (Pexel)

Erotophobia: పెళ్లికి సిద్ధపడిన జంటలు ఎన్నో. పెళ్లయిన తర్వాత జీవిత భాగస్వామితో శారీరకంగా, మానసికంగా కలవాల్సి వస్తుంది. మానసికంగా కలిసినా కూడా ఎంతోమందికి శారీరకంగా కలవాలంటే వణుకు మొదలవుతుంది. అలా లైంగిక ప్రక్రియకు భయపడడాన్ని ఎరేటోఫోబియా అంటారు. ఇది సెక్స్ ను వ్యతిరేకించడమే కాదు, సెక్స్ అంటేనే భయపడడం. ఆ పేరు చెబితేనే తీవ్రమైన ఆందోళనకు గురవడం. ఈ ఎరెటోఫోబియా బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది.

ఎరెటోఫోబియా అంటే ఏమిటి?

ఎరెటోఫోబియా అంటే లైంగిక విషయాలు మాట్లాడడం, లైంగిక ప్రక్రియలో పాల్గొనడం, ఆ పరిస్థితులను ఊహించుకుంటేనే భయపడడం... వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ ఫోబియా కలిగి ఉన్న వ్యక్తులు లైంగిక చర్యలకు దూరంగా ఉంటారు. అలాంటి పని చేయాల్సివస్తే అసౌకర్యంగా ఫీల్ అవుతారు. విపరీతంగా భయపడతారు. ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంది.

ఎరెటోఫోబియా రావడానికి కొన్ని రకాల కారణాలు ఉన్నాయి. చిన్నప్పుడే లైంగిక దాడులకు ఎదుర్కొవడం, శరీరంలో ఏదైనా లోపం ఉండడం, నగ్నత్వం అంటే భయపడడం, ఎవరైనా శరీరాన్ని తాకుతారనే భయం కలగడం వంటి వాటితో ఇది ముడిపడి ఉంటుంది.

కొంతమంది మొదటిసారి లైంగిక ప్రక్రియకు ఒప్పుకున్నా కూడా ఆ తర్వాత అదంటేనే భయపడి పోతారు. ఈ పరిస్థితిని వాజినిస్మస్ అని పిలుస్తారు. ఎక్కువగా మహిళల్లో ఇది కలుగుతుంది.

లైంగిక వేధింపులు

పిల్లల్లో చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురవుతున్నవారి సంఖ్య అధికంగానే ఉంది. పెద్దయ్యాక ఇది వారిలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ గా మారుతుంది. ఇది పెద్దయిన తర్వాత కూడా ఎవరితోనైనా సాన్నిహిత్యానికి లేదా సెక్స్ పరంగా దగ్గర అయ్యేందుకు ఇష్టపడకుండా చేస్తుంది. ఇది లైంగిక పనితీరును కూడా దెబ్బతీస్తుంది. ఇలాంటివారు పెళ్లికి ఇష్టపడరు. పెళ్లి చేసుకున్నా కూడా జీవిత భాగస్వామితో కలిసేందుకు అయిష్టంగా ఉంటారు.

అంగస్తంభన లోపం

ఇది మగవారిలో కలిగే సమస్య. ఎంతో మందికి ఈ సమస్య ఉంటుంది. కానీ దీనిరి చికిత్స చేయించుకోవడానికి అవమానంగా ఫీల్ అవుతారు. దీనివల్ల వారిలో మానసిక ఆందోళన, ఒత్తిడి ఎక్కువ అవుతాయి. ఇది తమ భాగస్వామితో కమ్యూనికేట్ చేయలేక వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇది కూడా ఫోబియాకు కారణం అవుతుంది.

మరికొందరికి తాము సెక్స్ పరంగా సమర్థత కలిగి ఉన్నామా లేదా అన్న అపోహల్లో ఉంటారు. ఇది వారిలో తీవ్రమైన మానసిక క్షోభను సృష్టిస్తుంది. లైంగికంగా దగ్గర అవ్వడానికి భయపడేలా చేస్తుంది. ఇది చివరకు ఎరెటోఫోబియాకు కారణం అవుతుంది.

కొందరికి నగ్నత్వం నచ్చదు. జీవిత భాగస్వామి ముందు నగ్నంగా ఉండేందుకు ఇష్టపడరు. అలాంటి వారు కూడా సెక్స్ అంటే భయపడతారు. ఇదే వారిలో ఎరెటోఫోబియాకు దారితీస్తుంది.

వికారం, వాంతులు

ఎరెటోఫోబియా ఉన్నవారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వారు లైంగిక విషయాలు చర్చించేటప్పుడు దూరంగా ఉంటారు. వాటి గురించి మాట్లాడేందుకు ఇష్టపడరు. లైంగిక విషయాల గురించి మాట్లాడితే వారి గుండె కొట్టుకునే రేటు పెరుగుతుంది. చెమటలు పడతాయి. వణుకుతున్నట్టు అనిపిస్తుంది. సెక్స్ లో పాల్గొనవలసి వస్తే వికారంగా, వాంతులు కూడా చేసుకోవచ్చు.

ఇలా అధిగమించండి

ఎరెటోఫోబియా ఉన్నవారికి మానసికవేత్తలు తగిన చికిత్సను అందిస్తారు. ముఖ్యంగా వారు లైంగిక విద్యను నేర్చుకోవడం చాలా అవసరం. సెక్స్ అవసరాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఎలాంటి ఫోబియాలు మీ దరి చేరవు. లైంగిక ప్రక్రియ అనేది శరీరం మొత్తానికి కూడా ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా సెక్స్ ను ఒక అవమానకరమైనదిగా, అసహ్యమైనదిగా చూడడం మానేయాలి. ఇది జీవిత భాగస్వాముల మధ్య ప్రేమను అనుకూలతను పెంచుతుంది. వారి మధ్య అర్థం చేసుకునే పరిస్థితులను పెంచుతుంది. కాబట్టి దాని గురించి చెడుగా అభిప్రాయాలు పెట్టుకోవడం మానేయాలి. కమ్యూనికేషన్ కూడా చాలా ముఖ్యం. మీ భాగస్వాములతో మీకు లైంగిక ప్రక్రియ సమయంలో మీకు ఏమి నచ్చడం లేదో చెప్పడం మంచిది. మీకు నచ్చని పనులు చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎదుటి వ్యక్తి కోసం కొంత సర్దుకుపోవాల్సి రావచ్చు. లైంగిక కార్యక్రమం సృష్టి ప్రక్రియగా చూస్తారు. మీరు కూడా ఈ సృష్టి కార్యాన్ని పవిత్రంగా భావించడమే మంచిది.

శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటివి చేయడం వల్ల కొంతవరకు తగ్గుతాయి. మీలో లైంగిక ఉద్దీపనలు కలిగించే ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

దీని చికిత్సలో భాగంగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ వంటి సాధారణ చికిత్సలను సూచిస్తారు. ఇందులో ముందుగా భయాన్ని తొలగిస్తారు. లైంగిక ప్రక్రియ ఎంత అవసరమో వివరిస్తారు. అలాగే సెక్స్ థెరపీ ద్వారా లైంగిక సమస్యలను దూరం చేస్తారు. కొన్ని రకాల మందులు ఇవ్వడం ద్వారా ముడిపడి ఉన్న ఆందోళన లక్షణాలను తగ్గిస్తారు. మీరు సుఖంగా మీ జీవిత భాగస్వామితో సంతోషంగా జీవించేలా చేస్తారు.

Whats_app_banner