Friday Motivation: ఆనందంగా జీవించడానికి కావాల్సింది డబ్బు కాదు, ప్రేమ, కరుణ, స్నేహాలు, అనుబంధాలు-money is not necessary to live happily need love compassion friendships ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation: ఆనందంగా జీవించడానికి కావాల్సింది డబ్బు కాదు, ప్రేమ, కరుణ, స్నేహాలు, అనుబంధాలు

Friday Motivation: ఆనందంగా జీవించడానికి కావాల్సింది డబ్బు కాదు, ప్రేమ, కరుణ, స్నేహాలు, అనుబంధాలు

Haritha Chappa HT Telugu
May 10, 2024 05:00 AM IST

Friday Motivation: డబ్బుతో ప్రతిదీ కొనలేరు. ఆనందంగా జీవించడానికి డబ్బు ఉంటే సరిపోదు. స్నేహితులు, ప్రేమించే మనుషులు, అందమైన కుటుంబం ఉండాలి.

మోటివేషనల్ స్టోరీ
మోటివేషనల్ స్టోరీ (Pixabay)

Friday Motivation: ఒక నగరంలో ధనవంతుడైన వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. సంపన్న కుటుంబానికి చెందిన ఆ తండ్రి తన కొడుకుకు పేదవారి జీవితాలు ఎలా ఉంటాయో చూపించాలని అనుకుంటారు. పేదవారు ఎలా జీవిస్తారో చూపించి, డబ్బున్న కుటుంబంలో పుట్టడం వల్ల తన కొడుకు ఎంత అదృష్టవంతుడయ్యాడో చెప్పడమే అతని లక్ష్యం. ఒక మారుమూల గ్రామంలో ఓ పేద కుటుంబంలో రెండు రోజులు పాటు తండ్రీకొడుకులు గడిపారు. ఆ తర్వాత తిరిగి తమ ఇంటికి ప్రయాణమయ్యారు.

తండ్రి చాలా గర్వంగా తన కొడుకుని ‘ఈ రెండు రోజుల ప్రయాణం ఎలా ఉంది’ అని అడిగాడు. దానికి ఆ కొడుకు ‘చాలా బాగుంది నాన్న’ అని చెప్పాడు. వెంటనే తండ్రి ‘పేదలు ఎలా జీవిస్తున్నారో చూసావా? డబ్బులు లేకపోవడం వల్ల వారు జీవితాన్ని ఎలా గడుపుతున్నారో అర్థం చేసుకున్నావా?’ అని అడిగాడు. దానికి కొడుకు ‘చేసుకున్నాను నాన్న’ అన్నాడు.

తండ్రి ‘ఈ ప్రయాణంలో నువ్వు ఏమి నేర్చుకున్నావో చెప్పు’ అని అడిగాడు. వెంటనే కొడుకు ‘ధనవంతులమైన మనకు ఒక కుక్కే ఉంది. కానీ పేదవారి దగ్గర నాలుగైదు కుక్కలు కనిపిస్తున్నాయి. మన తోట మధ్యలో చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. కానీ పేదవారికి ఆ ఊరు చివర పెద్ద చెరువు ఉంది. మనం మన తోటలో లాంతర్లను పెట్టుకొని రాత్రిపూట విహరిస్తున్నాము. కానీ పేదవారికి రాత్రిపూట నక్షత్రాలే దారి చూపిస్తున్నాయి. మనం పచ్చదనంలో గడపాలంటే మన ఇంటి ముందు ఉన్న చిన్న తోటకు వెళ్లాలి, కానీ వారికి పెద్ద అడివే ఉంది. మనకు నివసించడానికి ఇల్లు మాత్రమే ఉంది. కానీ వారికి ఇంటితో పాటు ఎన్నో పొలాలు ఉన్నాయి. మనకు సేవ చేసేందుకు కొంతమంది పనివారు ఉన్నారు. కానీ వీరు మాత్రం ఇతరులకు సేవ చేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. మనం తినేందుకు ఆహారాన్ని కొనుక్కుంటాము. కానీ వీరు మాత్రం తమ ఆహారాన్ని తామే పెంచుతారు. ఇతరులకు కూడా పంచుతారు. మన ఆస్తులని రక్షించడానికి చుట్టూ గోడలు కట్టుకున్నాము. కానీ వీరికి రక్షణగా స్నేహితులే ఉన్నారు’ అని అన్నాడు.

కొడుకు చెప్పింది విని తండ్రి నోరు తెరవలేకపోయాడు. పేదవారిని చూసి కొడుకు చీదరించుకుంటాడని, సంపన్న కుటుంబంలో పుట్టినందుకు గర్వపడతాడని ఆయన ఊహించాడు. కానీ కొడుకు దానికి భిన్నంగా ఆలోచించాడు. ఈ లోపు ఆ కొడుకు ‘ధన్యవాదాలు నాన్నా... మనం ఎంత పేద వాళ్ళమో నాకు ఈ ప్రయాణం ద్వారా మీరు అర్థమయ్యేలా చేశారు’ అన్నాడు. ఆ మాటకి తండ్రి సిగ్గుతో తలదించుకున్నాడు.

ఇక్కడ ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన విషయం... డబ్బు ఉంది కదా అని విర్రవీగకూడదు. దానితో కొనే ఆనందాలు చాలా తక్కువ. నలుగురితో కలిసి మెలిసి జీవిస్తూ ఉంటే ఆనందం రెట్టింపు అవుతుంది. అద్దాలమేడలో చిన్న కుటుంబంలో జీవించే కన్నా పేదవారిగా గ్రామంలో వంద మందితో కలిసి జీవించడంలోనే ఆనందం ఉంటుంది. చిన్న సమస్య వస్తే అద్దాలమేడలో పలికేందుకు పనివాళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు. అదే గ్రామంలో అయితే చిన్న కష్టం వచ్చినా సాయంగా పదిమంది చుట్టూ చేరుతారు. కాబట్టి మీ స్నేహాలను, అనుబంధాలను కాపాడుకునేందుకే ప్రయత్నించండి.

WhatsApp channel