Lifestyles habits that impact fertility: సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీసే పనులు ఇవే
Lifestyles habits that impact fertility: ఫర్టిలిటీ సామర్థ్యం దెబ్బతినడంలో మనం అనుసరించే జీవన శైలి ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మీరు అనుసరించే జీవన శైలి సంతానోత్పత్తి సామర్థ్యం సహా అనేక అంశాలపై ప్రభావం చూపుతుంది. ఆహారం, వ్యాయామం, బరువు, ఒత్తిడి స్థాయి, నిద్రపోయే తీరు, వయస్సు వంటివన్నీ ఫర్టిలిటీపై ఏదో రకంగా ప్రభావం చూపుతాయి. శారీరక, మానసిక ఆరోగ్యం, వృత్తిపర ఒత్తిళ్లు కాలుష్యం, మత్తుపదార్థాల వాడకం, మందులు వంటివన్నీ సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతాయి.
వయస్సురీత్యా ఫర్టిలీటీ సామర్థ్యంలో తగ్గుదల
పురుషులు, మహిళల్లో వయస్సు పెరుగుతున్నకొద్దీ సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ముఖ్యంగా ఆరోగ్యవంతురాలైన శిశువుకు జన్మనివ్వడంలో మహిళ వయస్సు కీలకపాత్ర పోషిస్తుంది. 30 ఏళ్ల వయస్సు నుంచి మహిళలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. 35 తరువాత ఈ సామర్థ్యం ఇంకా తగ్గిపోతుంది.
మహిళ సంతానం పొందడంలో భాగస్వామి అయిన పురుషుడి వయస్సు కూడా ప్రభావం చూపుతుంది. భాగస్వామి 45 ఏళ్లపైబడినప్పుడు గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శిశువు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.
ఊబకాయం ఉన్న పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. అలాగే వీర్యకణాల నాణ్యత కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే మహిళలు బరువు తక్కువగా ఉన్నప్పుడుు ఒవేరియన్ సమస్యలు, సంతానోత్పత్తి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అతిగా మద్యపానం, పొగాకు వాడకం, అలాగే మత్తుపదార్థాలు వినియోగించినప్పుడు అది పురుషులు, మహిళల ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.
ఈ అంశంపై అపోలో ఫెర్టిలిటీ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మాలతీ మధు మాట్లాడారు. ‘జీవనశైలి సాధారణ ఆరోగ్యంపై, అలాగే ఫర్టిలిటీపై పెను ప్రభావం చూపుతుంది. అధిక కొవ్వులు గల ఆహారం తీసుకోవడం, ఆలస్యంగా సంతానం కావాలనుకోవడం, పొగ తాగడం, ఆల్కహాల్ తీసుకోవడం, లైంగిక ప్రవర్తన, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివన్నీ ప్రభావం చూపుతాయి. జన్యుపరమైన, పర్యావరణపరమైన అంశాలు ఊబకాయం, అధిక బరువుకు కారణమవుతాయి. ఇవన్నీ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. చాలా వరకు సంతానోత్పత్తి సమస్యలను అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ(ఏఆర్‌టీ) పద్ధతుల ద్వారా పరిష్కరించవచ్చు. అనారోగ్యకరమైన జీవన శైలిని మార్చుకోవడం ద్వారా ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు..’ అని వివరించారు.
ఫెర్టిలిటీ సామర్థ్యంపై ప్రభావం ఇలా..
- అధిక కొవ్వు గల ఆహారం వీర్యకణాల స్వరూపంపై మాత్రమే కాకుండా, పిండదశలోనూ ప్రభావం చూపుతుంది.
- పొగ తాగే అలవాటు ఉన్న మగవారిలో స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది. వీర్యకణాల చలనం, స్పెర్మ్ స్వరూపం మారుతుంది. డీఎన్ఏ దెబ్బతింటుంది.
- పొగ తాగే అలవాటు ఉన్న మహిళల్లో అండం పొర మందం పెరుగుతుంది. దీని వల్ల వీర్యకణాలు చొచ్చుకు వెళ్లడం కష్టమవుతుంది. అలాగే ఆల్కహాల్ కూడా శరీరం వివిధ పోషకాలు సంగ్రహించడంలో అడ్డుపడుతుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థకు పోషకాలు ముఖ్యమన్న విషయం గ్రహించాలి.
- ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్న మహిళలు సంతానోత్పత్తి సామర్థ్యం పెంచుకోవాలంటే తగిన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
- బరువును అదుపులో ఉంచుకోవడం, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది.