Buddha Purnima 2023: నేడే బుద్ద పూర్ణిమ.. ఈరోజు విశిష్టత, చరిత్ర తెలుసుకోండి..-know importance date and history of budda purnima 2023 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Buddha Purnima 2023: నేడే బుద్ద పూర్ణిమ.. ఈరోజు విశిష్టత, చరిత్ర తెలుసుకోండి..

Buddha Purnima 2023: నేడే బుద్ద పూర్ణిమ.. ఈరోజు విశిష్టత, చరిత్ర తెలుసుకోండి..

Krishna Priya Pallavi HT Telugu
May 05, 2023 07:00 AM IST

Buddha Purnima 2023: ఈరోజు బుద్ధ పూర్ణిమ. ఈ రోజు గురించి చరిత్ర, ప్రాముఖ్యత మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

నేడే బుద్ద పూర్ణిమ
నేడే బుద్ద పూర్ణిమ (Unsplash)

పవిత్రమైన బుద్ధ పూర్ణిమ వచ్చేసింది. దీన్నే బుద్ధ జయంతి అని కూడా అంటారు. బుద్దుని జయంతిని పురస్కరించకుని చేసుకునే పండగ ఇది. ఈరోజు గౌతమ బుద్ధుడు బోధనలను పాటిస్తామని ప్రతిజ్ఞ తీసుకుంటారు. ఉదయాన్నే స్నానం ఆచరించి, ఇంటిని శుభ్రం చేసుకుంటారు. తూర్పు ఆసియా, దక్షిణ ఆసియాలో , శ్రీలంక, నేపాల్, భూటాన్, టిబెట్, థాయిలాండ్, చైనా, కొరియా, లావోస్, వియత్నాం, మంగోలియా, కాంబోడియా, ఇండోనేషియా , భారతదేశంలో బౌద్ధులందరూ ఈ రోజును ఆద్యాత్మిక వేడుకలా జరుపుకుంటారు. బుద్ధ పూర్ణిమ గురించిన చరిత్ర, తేదీ, ప్రాముఖ్యత తెలుసుకుందాం.

బుద్ధ పూర్ణిమ 2023 తేదీ:

వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది మే 5 న వచ్చింది. ఇదే రోజు చంద్రగ్రహణం కూడా ఉంది. బుద్ధుని జనన, మరణాలకు సంబంధించి ఖచ్చితమైన తేదీలు చెప్పలేరు కానీ, పూర్వీకులు అతని జీవిత కాలం క్రీ.పూ 563 - 483 అని చెబుతారు. ఈ సంవత్సరం ఇది బుద్ధుని 2585 జయంతి అన్నమాట. దృక్ పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి మే 05 వ తేదీన ఉదయం 4:14 కు మొదలై మే 06 వ తేదీన ఉదయం 3:33 నిమిషాలకు ముగుస్తుంది.

బుద్ధ పూర్ణిమ చరిత్ర, ప్రాముఖ్యత:

ఎక్కువగా తూర్పు, దక్షిణ ఆసియాలలో బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు. ఈరోజు గౌతమ బుద్ధుని జయంతి. బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్దుడు. ఆయన నేపాల్ లోని లుంబిని లో జన్మించారు. పౌర్ణమి రోజు బౌద్ధులకు చాలా విశిష్టమైంది. బుద్దుడి జీవితంలో 3 ముఖ్యమైన ఘట్టాలు ఇదే రోజున జరిగాయని దానికా ప్రాముఖ్యత. మొదటిది ఆయన జననం. పౌర్ణమి రోజున లుంబినీలో జన్మించారు. రెండోది ఆరు సంవత్సరాల శ్రమ తరువాత ఈరోజే బుద్ధునికి బోది చెట్టు కింద జ్ఞానోదయం అయ్యింది. సిద్దార్థుడు గౌతమ బుద్ధుడిగా మారిన రోజు ఇదే. మూడోది ఈ రోజే ఆయనకు 80 సంవత్సరాలున్నప్పుడు కుసినారా లో నిర్వాణం పొందారు.

బుద్ధ పూర్ణిమ వేడుకలు:

ఈరోజు భక్తులు తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. ఉదయాన్నే స్నానం ఆచరిస్తారు. గంగాజలాన్నిఇంటి పరిసరాల్లో, ముఖ్య ద్వారం దగ్గర చల్లుతారు. కొవ్వొత్తి వెలిగించి, ఇంటిని పూలతో అలంకరిస్తారు. ముఖ్య ద్వారం దగ్గర స్వస్తికం ను పసుపు లేదా కుంకుమతో తీర్చిదిద్దుతారు. బోధి వృక్షానికి పాలు పోసి కొవ్వొత్తి వెలిగిస్తారు. పేద ప్రజలకు, అవసరముున్నవారికి ఈరోజు బట్టలు, ఆహారం దానం చేస్తారు.

Whats_app_banner