Warm Milk Before Bed: రాత్రి పడుకునే ముందు వెచ్చటి పాలను తాగడం మంచిదా కాదా?-know how beneficial is it to drink warm milk before bed ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Warm Milk Before Bed: రాత్రి పడుకునే ముందు వెచ్చటి పాలను తాగడం మంచిదా కాదా?

Warm Milk Before Bed: రాత్రి పడుకునే ముందు వెచ్చటి పాలను తాగడం మంచిదా కాదా?

HT Telugu Desk HT Telugu
Nov 30, 2023 06:49 PM IST

Warm Milk Before Bed: నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే పాలలో ఏం వేసుకుని తాగాలు, అసలు ఏం ప్రయోజనాలుంటాయో వివరంగా తెల్సుకోండి.

నిద్రకు ముందు పాలు తాగడం
నిద్రకు ముందు పాలు తాగడం (freepik)

ఇదివరకటి కాలంలో ఎక్కువగా రాత్రి పడుకునే ముందు చాలా మంది పాలు తాగుతూ ఉండేవారు. అయితే ఇటీవల క్రమ క్రమంగా ఆ అలవాటు తగ్గుతూ వస్తోందనే చెప్పాలి. అయితే దీన్ని మళ్లీ అంతా అలవాటుగా చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్ర పోవడానికి ఒక అర గంట ముందు చక్కగా ఒక గ్లాసు వేడి వేడి పాలను తాగాలని సిఫార్సు చేస్తున్నారు. పాలు ఎలా తాగితే ప్రయోజనమో, దాని లాభాలేంటో వివరంగా చూసేద్దాం.

  • పడుకోవడానికి ముందు గ్లాసు గోరు వెచ్చని పాలు తాగడం వల్ల జీర్ణ శక్తి మెరుగు అవుతుంది.
  • ఇలా క్రమం తప్పకుండా రోజూ పాలు తాగడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి. అందువల్ల ఎముకలు బోలుగా మారడం, నొప్పుల్లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
  • పాలల్లో లాక్టియం అనే ప్రొటీన్‌ ఉంటుంది. ఇది శరీరానికి సాంత్వన భావనను కలిగిస్తుంది. అందువల్ల ఒత్తిడి, ఆందోళన లాంటివి తగ్గుముఖం పడతాయి.
  • చాలా మందికి ఉదయం లేవడంతోనే నీరసంగా ఉంటుంది. బలహీనంగా ఉంటారు. అలాంటి వారు రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. అది మళ్లీ శక్తివంతంగా నిద్ర లేవడానికి మీకు ఉపకరిస్తుంది.
  • పాలల్లో ట్రైప్టోఫాన్‌ అనే అమైనో యాసిడ్‌ ఉంటుంది. ఇది కండరాలు, న్యూరో ట్రాన్స్‌ మీటర్లు, ఎంజైముల్లాంటివి సరిగ్గా పని చేయడానికి పనికి వస్తుంది. చక్కగా నిద్ర పడుతుంది. నిద్ర నాణ్యతను పెంచడానికి పాలు ఎంతగానో సహకరిస్తాయి.
  • కొంత మందికి అర్ధ రాత్రి విపరీతంగా ఆకలి వేస్తుంటుంది. అలాంటప్పుడు వీరు లేచి ఏదో ఒకటి తింటూ ఉంటారు. అలా సమయం కాని సమయంలో తినడం వల్ల బరువు పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా నిద్రకు ముందు గ్లాసుడు పాలు తాగడం వల్ల ఇలా రాత్రిళ్లు ఆకలి వేయకుండా ఉంటుంది.
  • అయితే పాలను తాగేప్పుడు లోఫ్యాట్‌ పాలు లేదా నో ఫ్యాట్‌ పాలను తాగడం వల్ల కొలెస్ట్రాల్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. అందువల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పాలు ఎలా తాగాలి

ప్రయోజనాలు ఎన్ని ఉన్నా పాలను తాగేందుకు చాలా మంది ఇష్టపడరు. పంచదార ఇతర ఎనర్జీ పౌడర్లు వేసుకుని తింటూ ఉంటారు. ఇవన్నీ ఆరోగ్యంపై ఎంత మంచి ప్రభావాన్ని చూపుతాయో తెలియదు. కాబట్టి రాత్రి పడుకునే ముందు తాగే పాలలో బెల్లం పొడి, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు యాలకుల పొడి వేసుకుని కలుపుకుని తాగండి. ఇవి సహజంగానే పాలకు మంచి రుచిని ఇస్తాయి. దీంతో పాటు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి.

Whats_app_banner