HBD Samantha | సమంతా నుంచి ప్రతి అమ్మాయి నేర్చుకోవాల్సిన విషయాలివే..
సమంతా. ఈమె ఓ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు. ఓ స్టార్ మహిళ కూడా. సమంతా నుంచి ప్రతి అమ్మాయి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఎప్పుడు ఆమెని హీరోయిన్గా మాత్రమే కాదు.. ఓ రోల్ మోడల్‌గా తీసుకోవాల్సిన అంశాలు తనలో ఉన్నాయి. ఆమె పుట్టినరోజు సందర్భంగా మీరు ఆ విషయాలు తెలుసుకోండి.
Samantha Birthday Special | మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి.. స్టార్ హీరోయిన్గా ఎదిగినా సమంతా ఎందరికో ఆదర్శం. సినిమాలే చూడని ఫ్యామిలీ నుంచి వచ్చి.. తనకు నచ్చిన రంగంలో అంతకంతకు ఎదుగుతున్న ఆమెను చూసి ప్రతి అమ్మాయి చాలా విషయాలు నేర్చుకోవాలి. అవేంటంటే..
ఎక్కడ నుంచి వచ్చామని కాదు..
సమంతా చదువుల్లో టాప్ స్టూడెంట్. మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల తన పాకెట్ మనీ తానే సంపాదించుకోవాలని నిర్ణయించుకుని మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. మెల్లిగా సినిమాలలో అడుగుపెట్టి.. సౌత్‌లోనే టాప్ హీరోయిన్గా పేరు గడించింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి..
ఒకే మతం కాదు, ఒకే కులం కాదు, ఒకే భాష కాదు, ఒకే ప్రాంతం కాదు. ప్రేమకు ఇవేమి అవసరం లేదని నిరూపిస్తూ.. నాగచైతన్యను పెళ్లి చేసుకుని నిరూపించింది ఈ భామ. ఇరువురి మతాలను గౌరవిస్తూ.. హిందూ, క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకుంది.
పెళ్లి అయితే హీరోయిన్ కెరీర్ ముగిసినట్టేనా?
పెళ్లి అయితే హీరోయిన్ కెరీర్ ముగిసిపోతుంది అనే మాటలను ఖండిస్తూ… పెళ్లి తర్వాత కూడా నటించి టాప్ హీరోయిన్గా ఎదిగింది. పెళ్లి తర్వాత మంచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ ఇండస్ట్రీ హిట్లు ఇచ్చింది. ఓ బేబీతో సోలోగా రికార్డులు రాసింది. పెళ్లితర్వాత అమ్మాయిలకు లైఫ్ ఉండదు అనుకునేవారికి సమంతాను ఉదాహరణగా చూపించండి.
చై నుంచి విడిపోయిన సమయంలో..
ఎంతో ప్రేమగా పెళ్లి చేసుకున్న వ్యక్తి నుంచి విడిపోయిందంటే ఎంతో బలమైన కారణాలే ఉంటాయి. తప్పు ఇద్దరి వైపు కూడా ఉండొచ్చు. కానీ చై-సామ్ విడిపోయిన సమయంలో.. సమంతాదే తప్పు అంటూ ఎందరో ఆమెను వేలెత్తి చూపించారు. సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేశారు. కానీ ఆ సమయంలో సమంతా ఎంత స్ట్రాంగ్‌గా ఆ పరిస్థితిని హ్యాండిల్ చేసిందో మన అందరికి తెలుసు. అలాంటి పరిస్థితిలో కృంగిపోకుండా.. మరిన్ని ప్రాజెక్టులతో ముందుకు దూసుకుపోయింది. వెబ్ సిరీస్‌తో బాలీవుడ్లో ఎంట్రీ కూడా ఇచ్చేసింది.
మనం తీసుకున్న నిర్ణయం సరైనదే అని మనకి అనిపించినప్పుడు.. ఎలాంటి రాతలకు, మాటలకు కృంగిపోవాల్సిన అవసరం లేదని నిరూపించింది సమంతా. మీరు కూడా ఏదొక సమయంలో ఇలాంటి పరిస్థితి మీరు ఎదుర్కోవచ్చు. ఎవరూ ఏమంటున్నా.. పట్టించుకోకుండా మన పని మనం చేసుకున్న రోజు సక్సెస్ అవుతాం.
సినిమారంగంలోనే కాదు..
సినిమాలనుంచే సంపాదించడం కాదు.. వేర్వేరు రంగాల్లో పెట్టుబడి పెట్టి.. లాభాలను, నష్టాలను చూస్తుంది ఈ భామ. ఫ్యాషన్, ఏకమ్ స్కూల్, అర్బన్ కిసాన్, రెస్టారెంట్స్ వంటి వాటిలో పెట్టుబడి పెడుతుంది. యాక్టర్‌గా కెరీర్ ఎప్పటికైనా ముగుస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ తనకు తోడుగా ఉంటాయి. మనం కూడా ఏ రంగంలో అయినా దూసుకుపోవచ్చు. కానీ మనం బ్యాకప్‌ని సెట్ చేసుకోవాలి. సెకండ్ ఇన్కమ్ వచ్చేలా ప్లాన్స్ వేసుకోవాలి. ఈ భామ చదువుల్లో కూడా టాప్‌నే.
రోజు రోజుకు మరింత ఫిట్‌గా..
పుష్పలో ఊ అంటావా మావా.. ఊహు అంటావా పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. కానీ ఆ పాట విడుదలయ్యాక సమంతాపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఆ సమయంలో.. ఆ బాడీ మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? హీరోయిన్గా ఉండడం సులువేమో కానీ.. ఐటమ్ సాంగ్‌లో నర్తించడానికి బాడీ మరింత ఫిట్‌గా ఉండాలంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది.
సమంతా ముందు నుంచే ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. బరువులు ఎత్తడం తన హాబీ. ఏ సమయంలో అయినా.. ఏలాంటి పరిస్థితుల్లో ఉన్నా సమంతా తన వ్యాయామాలు, కసరత్తులు మాత్రం వదలలేదు. అమ్మాయిలు మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలంటే.. వ్యాయామాలు తప్పనిసరి అని నిరూపిస్తుంది ఈ భామ.
ఎంత ఎదిగినా ఒదిగిపోయేతత్వం..
సమంతా ఎంత స్టార్ హీరోయిన్ అయినా సరే ఎప్పుడు ఆ పొగరు చూపించదు అంటారు తన స్టాఫ్. వారిని తన కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ.. వారికి ఏమి కావాలో అన్ని అందిస్తుంది అంటుంటారు. మనం కూడా లైఫ్‌లో ఎంత ఎదిగినా.. ఎదుటివారిని చులకనగా మాత్రం చూడకూడదు.
ప్రత్యూష ఫౌండేషన్..
సమంతా మంచి నటి మాత్రమే కాదు. మంచి మనసున్న వ్యక్తి కూడా. చిన్నప్పటి నుంచి తన చూసిన పరిస్థితులు, ఎదురైన అనుభవాలనుంచే పుట్టుకొచ్చినదే ప్రత్యూష ఫౌండేషన్. ఈ ఫౌండేషన్‌తో ఎంతో మందిని ఆదుకుంటుంది ఈ సుందరి. ఇలా ఒకటా రెండా? చాలా విషయాల్లో సమంతా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని.. కెరీర్లో దూసుకుపోతుంది.
సంబంధిత కథనం