Coriander: కొత్తిమీర త్వరగా వాడిపోకుండా ఫ్రెష్‍గా ఉంచుకునేందుకు టిప్స్ ఇవి.. ఫాలో అవండి!
Coriander Storage Tips: కొత్తిమీర సాధారణంగా త్వరగా వాడిపోతూ ఉంటుంది. అయితే, కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఎక్కువ కాలం ఫ్రెష్‍గా ఉంచుకునే అవకాశం ఉంటుంది. త్వరగా వాడిపోకుండా చేసుకోవచ్చు. అవేవో ఇక్కడ చూడండి.
కొత్తిమీరను సహజంగా ప్రతీ రోజు వంటల్లో వినియోగిస్తూ ఉంటాం. వంటకు మంచి రుచితో పాటు సువాసనను, ఫ్లేవర్‌ను కొత్తిమీర ఇస్తుంది. అందుకే చాలా వంటల్లో దీన్ని తప్పనిసరిగా వేస్తుంటారు. కానీ, కొత్తిమీరను ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటే త్వరగా వాడిపోతుందనే చింత ఉంటుంది. అయితే, కొన్ని రకాల టిప్స్ పాటిస్తే ఎక్కువ కాలం కొత్తిమీరను ఫ్రెష్‍గా ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఆ సూచనలు ఇక్కడ చూడండి.
రిఫ్రిజిరేటర్‌లో ఇలా..
కొత్తిమీరను రిఫ్రిజిరేటర్‌లో పెడితే సాధారణంగా కంటే ఎక్కువ కాలం ఫ్రెష్‍గా ఉంటుంది. అయితే, ఫ్రిజ్‍లో పెట్టేందుకు కూడా కొన్ని టిప్స్ పాటిస్తే ఎక్కువ రోజులు కొత్తిమీర తాజాగా ఉంటుంది.
కడిగి.. తుడిచి: కొత్తిమీరను తెచ్చినది తెచ్చినట్టుగా అలాగే ఫ్రిజ్‍లో పెట్టకూడదు. కొత్తిమీరను ముందుగా నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత కిచెన్ టవల్‍తో ఎలాంటి తేమ లేకుండా కొత్తిమీరను తుడవాలి. తేమ లేకుండా జాగ్రత్త పడాలి. ఆ తర్వాత ఫ్రిజ్‍లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల కొత్తిమీరపై ఉండే మట్టి, వ్యర్థాలు తొలగి ఎక్కువకాలం పాడవకుండా ఉంటుంది.
జిప్‍లాక్ బ్యాగ్ లేకపోతే కంటైనర్: కడిగి, తుడిచిన తర్వాత ఫ్రిజ్‍లో నేరుగా పెట్టకుండా.. సీల్ ఉండే ఓ జిప్‍లాక్ బ్యాగ్‍లో స్టోర్ చేసుకుంటే మరింత ఎక్కువ కాలం కొత్తిమీర ఫ్రెష్‍గా ఉంటుంది. జిప్‍లాక్ బ్యాగ్‍లో సీల్ చేసి పెడితే బయటి నుంచి వచ్చే గాలి, ఇతర వాసనలు కొత్తిమీరకు తగలకుండా తాజాగా ఉంటుంది. అలాగే, గాలి చొరబడని ఎయిర్ టైట్ కంటైనర్‌లో కూడా కొత్తిమీరను పెట్టవచ్చు.
పేపర్ టవల్ చుట్టి: ఫ్రిజ్‍లో స్టోర్ చేసేందుకు ఇది మరో పద్ధతి. కొత్తిమీరను పొడిగా ఉన్న ఓ పేవర్ టవల్‍లో చుట్టి ఫ్రిజ్‍లో పెట్టవచ్చు. అదనంగా ఉన్న తేమను ఆ పేపర్ టవల్ పీల్చేసుకుంటుంది. కొత్తిమీర తాజాగా ఉంటుంది. కావాలంటే కిచెన్ టవల్‍లో కూడా చుట్టి పెట్టవచ్చు.
తరిగి కూడా..: తరిగి ఫ్రిజ్‍లో స్టోర్ చేసుకున్నా కొత్తిమీర ఎక్కువ కాలం ఫ్రెష్‍గా ఉంటుంది. ఇందుకోసం ముందుగా కొత్తిమీరను నీటితో బాగా కడిగి.. చెమ్మ లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరను చాకుతో తరగాలి. తరిగిన కొత్తిమీరను ఓ ఎయిర్‌టైట్ డబ్బాలో వేసి.. దాన్ని ఫ్రిజ్‍లో పెట్టాలి. ఇలా చేయడం 10 రోజుల వరకు కొత్తిమీర తాజాగా ఉండే అవకాశం ఉంటుంది.
ఫ్రిజ్ లేకుండా ఇలా..
రిఫ్రిజిరేటర్ లేకుండా కొంతకాలం కొత్తిమీరను తాజాగా ఉంచుకునేందుకు ఓ పద్ధతి ఉంది. ఓ ఎయిర్‌టైట్ డబ్బాను తీసుకొని దాన్ని కడిగి ఎలాంటి తేమ లేకుండా బాగా తుడుచుకోవాలి. ఆ తర్వాత అంచులకు తేమ కాకుండా డబ్బాలో అడుగున కాస్త నీరు పోసుకోవాలి. కొత్తిమీర వేర్లు మునిగేలా నీరు ఉండాలి. ఆకులకు తేమ తగలకూడదు. అలా, వేర్లకు నీరు తగిలేలా డబ్బాలో కొత్తిమీర పెట్టుకోవాలి. ఆ తర్వాత గాలిలోపలికి పోకుండా మూత మూసేయాలి. ఇలా చేయడం వల్ల కొత్తిమీర కొంతకాలం ఫ్రెష్‍గా ఉంటుంది. ఈ పద్ధతి పాటించేందుకు కొత్తిమీరకు కచ్చితంగా వేర్లు ఉండాలి. వాటిని తీసేయకూడదు.
టాపిక్