how to read food labels: అవునంటే కాదనిలే.. లేదంటే ఉందనిలే.. ఆహార లేబుళ్ల మోసాలు, జిమ్మిక్కులు తెల్సుకోండి
how to read food labels: ప్యాక్ చేసి అమ్మే ఆహార పదార్థాల లేబుళ్ల అర్థాలు తెలుసుకోవడం తప్పనిసరి. లేదంటే వాటిని ఆరోగ్యకరమని తినడం అలవాటు చేసుకుంటాం. వాటి మీద రాసి ఉండే ఇంగ్రీడియంట్లు, ప్రిజర్వేటివ్లు, రసాయనాలు, వాటి పూర్తి అర్థాలు తెల్సుకోండి.
ఆహార ప్యాకేజింగ్ ఒక మ్యాజిక్ ట్రిక్ లాంటిది. ముందు వైపు వాటిని తింటే చాలు ఇక ఏ రోగాలు వచ్చే అవకాశమే లేదన్నట్లు రాసి ఉంటుంది. వెనక్కి తిప్పి చదివితేనే అసలు నిజం తెలిసేది. ముందు వైపు గుండె ఆరోగ్యానికి మంచిదని చెప్పే ఆహారంలో వెనక చూస్తే పామాయిల్ వాడతారు. బరువు తగ్గించే బిస్కట్లలో మైదా కనిపిస్తుంది. చిన్న పిల్లలకు మంచివనే చెప్పే చాకోలేట్లలో విపరీతంగా పంచదార ఉంటుంది.
కానీ మనకు తెలీని పదాలు, తెలీని కోడ్స్ ఆ ప్యాకేజింగ్ మీద రాస్తారు. వాటిని చదివగలిగితేనే వాటి గురించి పూర్తిగా తెల్సుకోగలం. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివితే ఎలాంటి ప్యాకేజింగ్ ఇంగ్రీడియంట్స్ అయినా మీరు వివరంగా అర్థం చేసుకోగలుగుతారు.
స్పష్టంగా చదవండి:
మార్కెటింగ్ కోసం ఒక బ్రాండ్ వాటిలో కొన్ని పదార్థాలు వాడామని, మరికొన్ని అనారోగ్య పదార్థాలు అస్సలు వాడలేదని మార్కెటింగ్ చేస్తుంది. దాని ప్రకారమే వెనకాల ముద్రించే ఇంగ్రీడియంట్ లిస్ట్ ఉండాలి. వాటి తయారీలో ఎక్కువగా వాడిన పదార్థం ముందు, తక్కువ వాడింది చివర్లో ముద్రిస్తారు. హైడ్రోజనేటెడ్ పామాయిల్స్, చక్కెరలు, ఉప్పులు, రిఫైన్డ్ ఫ్లోర్ లేదా మైదా వీటిలో ఏదైనా మొదట్లోనే కనిపిస్తే ఇక దాని జోలికి పోకండి. అలాగే మీకు అర్థం కాని భాషలో శాస్త్రీయ పేర్లు వాడితే వాటికి దూరంగా ఉండండి.
చక్కెరల విషయంలో జాగ్రత్త:
చక్కెర రహితంగా లేదా అదనపు చక్కెరలు లేవని చెప్పుకునే ఉత్పత్తులు తరచుగా ఇతర రూపాల్లో చక్కెరను కలిగి ఉంటాయి. అంటే వాటి మీద షుగర్ అని రాసి ఉండకుండా వేరే పేర్లుంటాయి. హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, గోల్డెన్ షుగర్, మాల్టోడెక్స్ట్రిన్, ఎరిథ్రిటాల్, సుక్రోలోజ్, సార్బిటాల్, జిలిటోల్, మాల్టిటోల్, మన్నిటోల్, ఐసోమాల్ట్, తేనె, బెల్లం, డెక్స్ట్రోస్, ఫ్రక్టోజ్, బీట్ షుగర్, హనీ, యాపిల్ జ్యూస్ వంటి పదాల కోసం చూడండి. ఇవి ఉంటే మీకు హాని చేసే తీపి వాటిలో ఉన్నట్లే. ముఖ్యంగా సిరియల్స్, కార్న్ ఫ్లేక్స్, మ్యూస్లీ, ప్రోటీన్ బార్లు, ఫ్లేవర్డ్ యోగర్ట్, సలాడ్ డ్రెస్సింగ్, ఫ్రూట్ జ్యూసులు కొనేటప్పుడు ఇవి గమనించండి.
నూనెలు:
పామాయిల్స్, పొద్దుతిరుగుడు నూనె, ట్రాన్స్ ఫ్యాట్స్, పాక్షికంగా హైడ్రోజనేటెడ్ చేసిన నూనెలు కనిపిస్తే అవి ఏ మాత్రం ఆరోగ్యకరమైన ఆహారాలు కావు. పామాయిల్‌లో సంతృప్త కొవ్వులుంటాయి. ఇవి గుండెను దెబ్బతీస్తాయి. అధిక బరువుకు కారణమవుతాయి.
ఫుడ్ కలర్స్:
ఆహారాన్ని నిల్వ చేయడానికి కొన్ని ప్రిజర్వేటివ్లు వాడతారు. ఆకర్షణీయంగా కనిపించడానికి రంగులు వాడతారు. వీటిలో హానికరమైనవి తెల్సుకోడానికి ఆంగ్ల E అక్షరం కోసం చూడండి. E211, E250, E251, E621 లాంటి నంబర్లు, E102, E110, ఎల్లో No. 5 or రెడ్ No. 40 లాంటివి రాసి ఉంటే వెంటనే పక్కన పెట్టేయమంటారు ఒక ఫుడ్ బ్రాండ్ స్థాపకులు పరాశర్.
కేలరీలు కలిపి చదవండి:
సాధారణంగా ఆహార లేబుళ్లు వెనకాల వాటిలో ఉండే కేలరీల గురించి ప్రింట్ చేస్తారు. ఉదాహరణకు 200 గ్రాముల ప్యాకెట్ మీద కేవలం 50 గ్రాముల్లో ఉండే కేలరీలు లేదా ఒక సర్వింగ్ లో కేలరీలు ఎన్నో రాసి ఉంటుంది. దాంతో కేలరీలు తక్కువగా కనిపిస్తాయి. కాబట్టి మొత్తం ప్యాకెట్ కేలరీలు ఎన్ని ఉన్నాయో గమనించడం ముఖ్యం.
లేబుల్స్ అసలైన అర్థాలు:
అసలు పళ్లతో తయారు చేసింది (Made with real fruit)
దీనర్థం దీంట్లో కొద్ది శాతం నిజమైన పండ్లతో తయారు చేశారని. మిగతా పండ్ల ఎసెన్సులు లేదా ఫ్లేవర్లు వాడతారు. వీటిలో రసాయనాలు, చక్కెరలు ఎక్కువే ఉంటాయి.
లైట్ (Light)
కోక్స్, కూల్ డ్రింకుల దగ్గర నుంచి బిస్కట్ల దాకా ప్రతి దాని మీద లైట్ అని రాసి ఉంటోంది. అంటే పాత రకం కంటే ఇందులో తక్కువ కొవ్వు ఉంది అని అర్థం. కానీ రుచిలో మార్పు రాకుండా దానికోసం రకరకాల రసాయనాలు, చక్కెరలు కొన్ని ఫుడ్ బ్రాండ్స్ వాడతాయి.
మల్టీ గ్రెయిన్ (Multigrain)
మల్టీగ్రెయిన్ అని కనిపిస్తే చాలు ఆరోగ్యకరం అని ఫిక్సయిపోతారు. మైదాకు బదులుగా వీటి తయారీలో గోధుమలు, జొన్నలు లాంటివి వాడతారు. కానీ వీటితో పాటే ఇంకేమైన వాడారా అనీ గమనించుకోవాలి.
నో కొలెస్ట్రాల్ (No cholesterol)
మొక్కలు ఆధారిత ఉత్పత్తుల్లో సాధారణంగానే కొలెస్ట్రాల్ ఉండదు. అదే హైలైట్ చేసి నో కొలెస్ట్రాల్ అని రాయడమే మార్కెటింగ్ జిమ్మిక్.
హనీ ఫ్లేవర్ (Honey flavor)
తేనె మంచిదే. కానీ ప్రాసెస్ చేసిన ఆహారల్లో తేనె పూర్తిగా వాడటం అంత సాధ్యం కాదు. బదులుగా ఫ్లేవర్లు, చవకైన సిరప్స్ వాడతారు. ఇది పోషకాలను తగ్గించినట్లే.
మేడ్ విత్ రియల్ వెజిటేబుల్స్ (Made with real vegetables)
వీటిని నిజమైన కూరగాయలతో తయారు చేస్తారు అనుకుంటారు. కానీ నిర్జలీకరణ చేసి కూరగాయల పొడి, ముక్కలుంటాయి. బంగాళాదుంప వంటి తక్కువ పోషకాలున్న ఫిల్లర్లతో పెద్ద మొత్తంలో కలుపుతారు.
టాపిక్