Jowar Roti : ఆరోగ్యాన్ని పెంచే జొన్న రొట్టె.. అల్పాహారం కోసం ఇలా తయారు చేయండి
Jowar Roti For Breakfast : చిరు ధాన్యాల్లో జొన్నలది ప్రత్యేకమైన స్థానం. ఇది తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనలు ఉంటాయి. అల్పాహారంగా జొన్న రొట్టెలను ఎలా తయారు చేయాలో చూద్దాం..
జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది. చిరుధాన్యాల్లోని వీటిని కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మధ్యకాలంలో వీటి వాడకం కూడా ఎక్కువైపోయింది. చాలా మంది రాత్రి వేళల్లో జొన్న రొట్టెలు చేసుకుని డిన్నర్ చేసేస్తున్నారు. అయితే ఉదయం పూట కూడా వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. జొన్న రొట్టెలు అనగానే పిండిని మాత్రమే వేసి తయారు చేస్తారు. ఇలా కొందరికి నచ్చదు. అందుకే కాస్త వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది. రుచికరమైన జొన్న రొట్టెలను ఎలా తయారు చేయాలో చూడండి.
కావాల్సిన పదార్థాలు..
జొన్న పిండి 2 కప్పులు, గోధుమ పిండి 1 కప్పు, జీలకర్ర అర టీ స్పూన్, నువ్వులు అర టీ స్పూన్, ఉల్లిపాయ 1 సన్నగా తరగాలి, పచ్చి మిర్చి 2 సన్నగా తరగాలి, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరగాలి, ఉప్పు రుచికి సరిపడా, నూనె లేదా నెయ్యి సరిపడా, వేడి నీళ్లు తగినన్ని.
జొన్న రొట్టె తయారు చేసే విధానం
పైన చెప్పిన పదార్థాలను ఒక పాత్రలోకి తీసుకోవాలి. అందులో వేడి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత పిండి మృధువుగా అయ్యే వరకూ చేయాలి. ఇప్పుడు పిండి మీద నూనె చల్లి దాన్ని పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకోవాలి. ఒక్కో ముద్దను పీట మీదకు తీసుకుని, చేతులకు తడి అంటించి.. పిండి ముద్దను ఒత్తుతూ పెద్దదిగా చేయాలి. రోటిలాగా చేసుకోవాలి.
ఇలా తయారు చేసిన రొట్టెలను నాన్ స్టిక్ పాన్ మీద వేసి కాల్చుకోవాలి. సన్నని మంట మీద రొట్టెలను కాల్చితే బాగుంటుంది. రెండు వైపులా కాల్చాలి. కావాలనుకుంటే మధ్యలో రొట్టెపై రెండు వైపులా నెయ్యి లేదా నూనెను కూడా వేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చాలి.
ఇలా కాల్చితే రొట్టెలు టేస్టీగా ఉంటాయి. నేరుగా తినొచ్చు. పప్పు, కూరలతోనూ తీసుకోవచ్చు. కావాలంటే పచ్చి ఉల్లిపాయను కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. ఉదయం అల్పాహారంలోకి తీసుకోండి. ఆరోగ్యానికి కూడా మంచిది.
జొన్న రొట్టెలను క్రమం తప్పకుండా తింటే శరీరంలో వృద్ధాప్య ప్రక్రియకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి. దీనిలోని అధిక పోషకాల కూర్పు సంపూర్ణమైన భోజనంగా, రోజు తీసుకోవడానికి ఉత్తమమైన మిల్లెట్‍గా ఉంటుంది. దీనిలోని మెగ్నీషియం, విటమిన్ల బీ,ఈలతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.