Butter Chicken Recipe : ఇంట్లోనే బటర్ చికెన్ చేసేయండి.. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు
Butter Chicken Recipe : మీరు చికెన్ ప్రియులా? మీ ఇంట్లోవాళ్లకు చికెన్ అంటే ఇష్టమా? నిత్యం చికెన్‍ను ఒకేలా వండుకుని విసిగిపోయారా? అయితే టేస్టీ టేస్టీగా బటర్ చికెన్ ట్రై చేయండి.
చికెన్ అంటే ఇష్టం ఉన్నవారు.. ఎప్పుడూ ఒకేలా తింటే బోర్ కొడుతుంది కదా. అందుకే బటర్ చికెన్ తయారు చేయండి. ఈ బటర్ చికెన్ చపాతీ, పూరీ, నాన్స్ మొదలైన వాటితో చాలా బాగుంటుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు హోటళ్లలో బటర్ చికెన్ తిని ఉంటే.. ఇంట్లో ప్రయత్నించండి. ఈ బటర్ చికెన్ తయారు చేయడం చాలా సులభం.
కావాల్సిన పదార్థాలు
చికెన్ - 1/2 కిలో, పెరుగు - 1/4 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్, పసుపు పొడి - 1 టీస్పూన్, కారం - 2 టీస్పూన్లు, జీలకర్ర పొడి - 1 టీస్పూన్, గరం మసాలా - 1 టీస్పూన్, నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - రుచి ప్రకారం, నూనె - 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క - 1 ముక్క, యాలకులు - 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి - 2 (తురిమినవి), టొమాటోలు - 6, జీడిపప్పు - 20 (నీళ్లలో నానబెట్టి పేస్ట్ చేయాలి), వెన్న - 3 టేబుల్ స్పూన్లు, మీగడ - 1/2 కప్పు, కొత్తిమీర - కొద్దిగా
ఎలా చేయాలంటే..
ముందుగా చికెన్‌ని బాగా కడగాలి. తర్వాత కడిగిన చికెన్‌ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత కనీసం 1 గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచండి. చికెన్ నానిన తర్వాత గ్యాస్ మంటపై గిన్నె పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. అందులో నానబెట్టిన చికెన్ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత మరో కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి అయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి బాగా వేగించాలి. ఇప్పుడు రుబ్బిన టొమాటోలు వేసి కలుపుతూ పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత కారం, జీలకర్ర, పంచదార, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో జీడిపప్పు పేస్ట్ వేసి చిన్న మంట మీద ఉంచి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత గ్రేవీకి కావల్సినంత నీరు పోసి కలుపుతూ ఉండాలి. చికెన్ ముక్కలు వేసి, తక్కువ మంట మీద ఉంచి చికెన్‌ను 10-15 నిమిషాలు ఉడికించాలి. చివరగా మెంతి వేసుకుని, గరం మసాలా వేసి కలపాలి. పైన బటర్, మిల్క్ క్రీమ్ వేసి కొత్తిమీర చల్లితే రుచికరమైన బటర్ చికెన్ రెడీ.