Car Insurance Claim | కారు ఇన్సూరెన్స్ ఇలా క్లెయిమ్ చేయండి!
Car Insurance Claim.. కొత్త కారు అయినా, సెకండ్ హ్యాండ్ కారు అయినా ఇన్సూరెన్స్ ఉండటం తప్పనిసరి. ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది మీ పర్సనల్ చాయిస్ కాదు. చట్టప్రకారం మీకు, మీ కారుకు బీమా ఉండటం తప్పనిసరి. కారు ఏదైనా ప్రమాదానికి గురైన సమయంలో మీతోపాటు మీ కారుకు జరిగిన డ్యామేజీ, మీ వల్ల అవతలి వ్యక్తికి జరిగిన నష్టాన్ని కూడా ఈ ఇన్సూరెన్స్ ద్వారా పూడ్చుకోవచ్చు.
తప్పనిసరి కావడంతో కారు కొన్న ప్రతి యజమాని ఇన్సూరెన్స్ అయితే తీసుకుంటున్నారు కానీ.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేయాలో మాత్రం చాలా మందికి తెలియదు. బీమా పొందడానికి ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తున్నాం. మీరూ చదవండి.
మీ దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ ఏంటి?
కారు ఇన్సూరెన్స్‌లలో రెండు రకాలు ఉంటాయి. వీటిలో మీది ఏదో ముందుగా చూసుకోండి. ఒక్కోదానికి ఒక్కో రకంగా మీరు క్లెయిమ్ చేయవలసి ఉంటుంది.
- కారు ఇన్సూరెన్స్ క్యాష్‌లెస్ క్లెయిమ్స్
- కారు ఇన్సూరెన్స్ రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్స్
క్యాష్‌లెస్ క్లెయిమ్స్ అయితే..
ఇది బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీ తీసుకున్న వాళ్ల కారు ఏదైనా ప్రమాదానికి గురైతే.. మొత్తం ఇన్సూరెన్స్ సంస్థే బాధ్యత తీసుకుంటుంది. ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీయే కారును రిపేర్ చేయిస్తుంది. అయితే మీ క్లెయిమ్ డాక్యుమెంట్లను సదరు సంస్థ అంగీకరించిన తర్వాతే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరో విషయం ఏంటంటే.. సదరు ఇన్సూరెన్స్ సంస్థ చెప్పిన గ్యారేజీలోనే మీరు కారు రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది.
రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ అయితే..
చాలా వరకూ ఇన్సూరెన్స్ పాలసీలు ఈ రకానికి చెందినవే ఉంటాయి. ఇక్కడ కారుకు ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో మీకు నచ్చిన గ్యారేజీలో కారు రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ రిపేర్ ఖర్చులన్నీ ముందు మీరే భరించాలి. తర్వాత వీటి బిల్స్‌ను సదరు సంస్థ నుంచి క్లెయిమ్ చేసుకోవాలి. మీరు ఇచ్చిన బిల్స్‌ను ఇన్సూరర్ అంగీకరించిన తర్వాతే మీకు రిపేర్ డబ్బులు వస్తాయి.
క్యాష్‌లెస్ క్లెయిమ్ ఎలా చేయాలి?
క్యాష్‌లెస్ క్లెయిమ్‌కు కింది స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.
- మీ కారు ప్రమాదానికి గురైన వెంటనే కారుకు ఏదైనా డ్యామేజీ జరిగినా, మీకు లేదా అవతలి వ్యక్తికి గాయాలు తగిలినా.. వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా చనిపోవడం, తీవ్ర గాయాలు అయిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి.
- తర్వాత ఆ కారును సదరు సంస్థకు చెందిన వాళ్లు ఏదైనా గ్యారేజీకి తీసుకెళ్లి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారు. అయితే ప్రమాదం జరిగిన చోటు నుంచి ఇన్సూరర్ అనుమతి లేకుండా కారును కదిలించకుండా చూసుకోండి.
- గ్యారేజీ సిబ్బంది అంచనా వేసిన తర్వాత రిపేర్‌కు అయ్యే ఖర్చులను ఇన్సూరర్ పరిశీలిస్తారు. దానిని ఆమోదించిన తర్వాతే మీ కారు రిపేర్ చేస్తారు.
- రిపేర్ తర్వాత ఇన్వాయిస్‌లను సదరు గ్యారేజీ.. ఇన్సూరెన్స్ సంస్థకే అందజేస్తుంది. వీటితోపాటు ఇతర డాక్యుమెంట్లను కూడా ఇన్సూరర్ పరిశీలిస్తారు.
- ఈ పరిశీలన మొత్తం పూర్తయిన తర్వాత నేరుగా గ్యారేజీకే ఇన్సూరర్ డబ్బులు చెల్లిస్తారు.
- అయితే మొత్తం బిల్లులో కొంత మొత్తం కారు యజమాని కూడా చెల్లించాల్సి వస్తుంది. ఇది చాలా వరకూ తక్కువ మొత్తమే ఉంటుంది.
- ఒకవేళ కారు రిపేర్ అయ్యే పరిస్థితి లేకపోతే.. తరుగుదల తీసేసిన తర్వాత కారు విలువ మొత్తాన్ని సదరు కారు యజమానికి ఇన్సూరెన్స్ సంస్థ చెల్లిస్తుంది.
రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ ఎలా?
రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌కు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.
- మీ కారు ప్రమాదానికి గురైన వెంటనే ఇన్సూరర్‌కు సమాచారం ఇవ్వండి. ఒకవేళ ఫోన్ ద్వారా లేదా ఆన్‌లైన్‌లో చెప్పే అవకాశం ఉంటే 24 గంటల్లోపు ఈ సమాచారం ఇవ్వాలి.
- ఆ తర్వాత మీకు ఓ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. భవిష్యత్తులో క్లెయిమ్ చేసుకోవడానికి ఈ నంబర్ ఉపయోగపడుతుంది.
- తర్వాత కారును మీకు నచ్చిన గ్యారేజీలో రిపేర్ చేయించుకోవచ్చు.
- రిపేర్ పూర్తయిన తర్వాత బిల్స్‌తోపాటు అవసరమైన డాక్యుమెంట్లను ఇన్సూరెన్స్ సంస్థకు ఇవ్వాలి. వాటిని పరిశీలించి సదరు సంస్థ రీయింబర్స్‌మెంట్ ఇస్తుంది.
ఈ రెండు క్లెయిమ్‌ల విషయంలోనూ ఓ సర్వేయర్ లేదా అసెసర్ ఉంటారు. ఈ క్లెయిమ్‌ను చూసి, నష్టాన్ని అంచనా వేసి సదరు సంస్థకు రిపోర్ట్ ఇచ్చేది ఈ వ్యక్తే.
థర్డ్ పార్టీలాగా క్లెయిమ్ ఎలా?
ఇక ఇన్సూరెన్స్‌లో థర్డ్ పార్టీ కవర్ కూడా ఉంటుంది. ఇక్కడ రెండు పార్టీలు మీరు, ఇన్సూరెన్స్ సంస్థ కాగా.. థర్డ్ పార్టీ అంటే ప్రమాదం వల్ల నష్టపోయిన పాదచారి లేదా మరో వాహనానికి చెందిన ఓనర్. మీ వల్ల వారికి నష్టం జరిగితే.. థర్డ్ పార్టీగా వాళ్లు మీ ఇన్సూరెన్స్ సంస్థ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు వారి సంస్థ నుంచి క్లెయిమ్ అడగవచ్చు. దీనికోసం కింది స్టెప్స్ ఫాలో కావాలి.
- ఒకవేళ కారు ప్రమాదానికి గురై అవతలి వాహనం వల్ల మీ కారు దెబ్బతింటే వెంటనే ఆ అవతలి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ నోట్ చేసుకోండి. ఈ ఘటనను చూసిన సాక్షుల వివరాలు కూడా తీసుకోండి. ఈ వివరాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించండి.
- అవతలి వాహనం యజమాని ఇన్సూరెన్స్ సంస్థ వివరాలు తెలుసుకొని.. జరిగిన నష్టానికి క్లెయిమ్ చేస్తూ దరఖాస్తు చేసుకోండి.
- ఆ తర్వాత మీరు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో కేసు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన ఏరియాలో ఉన్న లేదంటే అవతలి వాహనం యజమాని ఉండే ప్రాంతంలోని ట్రిబ్యునల్‌లో కేసు దాఖలు చేయాలి. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ఈ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ప్రమాదాల వల్ల నష్టపోయిన వారికి త్వరగా పరిహారం అందించేందుకు ఓ సివిల్ కోర్టులాగా ఈ ట్రిబ్యునల్ పని చేస్తుంది.
- మీరు చెప్పిన వివరాలన్నీ సరైనవేనని తేలిన తర్వాత సదరు ఇన్సూరెన్స్ సంస్థ మీకు పరిహారం చెల్లిస్తుంది.
సంబంధిత కథనం