Home Remedies for Hairfall : బంగాళదుంపలతో ఒత్తైన జుట్టు సొంతం చేసుకోండిలా..-home remedies for hairfall natural ways to make your hair thicker and bouncy at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Remedies For Hairfall : బంగాళదుంపలతో ఒత్తైన జుట్టు సొంతం చేసుకోండిలా..

Home Remedies for Hairfall : బంగాళదుంపలతో ఒత్తైన జుట్టు సొంతం చేసుకోండిలా..

Geddam Vijaya Madhuri HT Telugu
Apr 04, 2023 05:17 PM IST

Home Remedies for Hairfall : జుట్టు అనేది అందరికీ ఓ ఎమోషన్. బ్రేకప్ కన్నా.. హెయిర్ ఫాల్ ఎక్కువ బాధపెడుతుందని చాలామంది అంటూ ఉంటారు. కాలుష్యం, విటమిన్స్ లోపం, ఒత్తిడి వంటి కారణాలతో జుట్టు రాలిపోతూ ఉంటుంది. అయితే పలు సహజమైన మార్గాలతో ఈ సమస్యను దూరం చేసుకుని.. ఒత్తైన జుట్టును పొందవచ్చు అంటున్నారు.

సహజమైన పద్ధతులతో జుట్టును ఇలా కాపాడుకోండి..
సహజమైన పద్ధతులతో జుట్టును ఇలా కాపాడుకోండి..

Home Remedies for Hairfall : సాధారణంగా జుట్టు పొడవు ప్రతి నెలా 1.25 సెం.మీ పెరుగుతుంది. కానీ పేలవమైన జీవనశైలి కారణంగా జుట్టు పెరుగుదల ప్రక్రియ మందగించిపోతుంది. అందమైన, ఒత్తైన జుట్టు పొందాలనుకుంటే దాని కోసం మీరు తీసుకునే ఫుడ్, ఒత్తిడి, పలు రకాల హెయిర్ మాస్క్​లను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. జుట్టు రాలడం, నెరిసిపోవడం, పల్చబడడం వంటివి చాలా సాధారణ సమస్యలుగా మారిపోతున్న ఈరోజుల్లో.. జుట్టు పట్ల శ్రద్ధ చూపించడం చాలా ముఖ్యం.

నిజానికి మన జుట్టు కెరోటిన్ అనే ప్రొటీన్‌తో తయారైంది. అంటే మన జుట్టులో ప్రొటీన్ ఉంటుంది కాబట్టి.. ఆహారంలో ప్రొటీన్ ఉండడం చాలా ముఖ్యం. అయితే మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటూ.. కొన్ని ఫుడ్స్ తీసుకుంటూ.. కొన్ని మాస్కులు ఉపయోగిస్తే మంచి హెయిర్ పొందవచ్చు అంటున్నారు. కెమికల్ ప్రొడెక్ట్స్ ఉపయోగించడం కన్నా.. సహజమైన పద్ధతులు ద్వారా.. ఒత్తైనా, దృఢంమైన జుట్టు పొందవచ్చు. జుట్టును బలోపేతం చేసే సహజ నివారణలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరి..

సన్నని వెంట్రుకలకు గూస్బెర్రీ కంటే మెరుగైనది ఏదీ ఉండదు. ఇది జుట్టును ఒత్తుగా, మందంగా, నల్లగా చేస్తుంది. ఉసిరికాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీనిని అప్లై చేయడమే కాకుండా తినడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

జుట్టు ఒత్తుగా ఉండాలంటే తలస్నానం చేసే ముందు ఉసిరికా, నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించాలి. ఇందుకోసం రెండు చెంచాల ఉసిరి రసానికి.. రెండు చెంచాల నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్​లా చేయాలి. తర్వాత ఈ పేస్ట్‌ను తలకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఉసిరి రసాన్ని వారానికోసారి రాసుకుంటే జుట్టు బలపడుతుంది.

బంగాళాదుంప రసం

బంగాళాదుంప రసం కూడా జుట్టును బలంగా, ఒత్తుగా మార్చగలదు. అయితే చాలా తక్కువ మంది మహిళలకు దీని గురించి తెలుసు. బంగాళాదుంప రసం జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా వాటిని బలంగా, మందంగా మారుస్తుంది.

మీ జుట్టు సహజంగా బలంగా ఉండాలంటే.. మీ జుట్టుకు బంగాళాదుంప రసాన్ని రాయండి. తలస్నానం చేసే ముందు బంగాళదుంప రసాన్ని తలకు పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. బంగాళదుంపలో ఉండే విటమిన్స్ మీ జుట్టును పొడవుగా, దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది.

మెంతి గింజలు

మెంతులు అధిక మొత్తంలో ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మూలాల నుంచి జుట్టును బలోపేతం చేయడంలో, తీవ్రమైన సమస్యలకు చికిత్స చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

రెండు చెంచాల కొబ్బరి నూనెను ఒక చెంచా మెంతికూర పేస్ట్‌తో కలిపి జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత షాంపూతో కడగాలి. ఇలా నెలపాటు కంటిన్యూగా చేయడం వల్ల మీ జుట్టు ఒత్తుగా మారడంతో పాటు మంచి జుట్టు పెరుగుదల కూడా ప్రారంభమవుతుంది.

ఉల్లిపాయ రసం

సన్నని వెంట్రుకల సమస్యను తొలగించడానికి ఉల్లిపాయ రసం ఒక బెస్ట్ హోం రెమెడీ. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో కొల్లాజెన్ మొత్తాన్ని పెంచుతుంది. ఇది జుట్టును ఒత్తుగా చేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని తీసి జుట్టుకు పట్టించి 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి.

గుడ్లు

జుట్టు ఒత్తుగా, దృఢంగా చేయడంలో గుడ్డు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గుడ్లలో ప్రోటీన్, సెలీనియం, ఫాస్పరస్, జింక్, ఐరన్, సల్ఫర్, అయోడిన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. అంతేకాకుండా జుట్టును ఒత్తుగా మారుస్తాయి.

గుడ్డులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, తేనెను వేసి బాగా కలపాలి. ఇప్పుడు తల మొత్తం సమానంగా అప్లై చేసి, ఒక గంట పాటు అలాగే ఉంచాలి. దీని తర్వాత చల్లని నీరు, షాంపూతో జుట్టును కడగాలి. పొడి, బలహీనమైన జుట్టును బలోపేతం చేయడంలో ఆలివ్ సహాయపడుతుంది.

మందార పువ్వులు

మందార పువ్వులు కూడా సన్నని వెంట్రుకలను ఒత్తుగా మార్చడంలో బాగా సహాయపడుతాయి. ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, రైబోఫ్లావిన్, థయామిన్, నియాసిన్, విటమిన్ సి మందార పువ్వులలో లభిస్తాయి.

పల్చటి జుట్టు సమస్య ఉంటే తాజా పువ్వుల మందార రసంలో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ఉడికించండి. నీరు పూర్తిగా ఆరిపోయాక సీసాలో నింపండి. తలస్నానం చేసే ముందు.. జుట్టు మూలాలకు బాగా అప్లై చేయాలి. దీంతో జుట్టు ఒత్తుగా, పొడవుగా, మెరుస్తూ ఉంటుంది.

అలోవెరా, తేనె

కలబంద జుట్టుకు లైఫ్‌సేవర్‌లా పనిచేస్తుంది. ఇది మీ జుట్టును అందంగా, మెరిసేలా చేయడమే కాకుండా.. జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టుకు జీవం పోయడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

పల్చటి జుట్టు సమస్య రాకుండా ఉండేందుకు, జుట్టు అందంగా మారాలంటే అలోవెరా జెల్​ను తలకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచి తల స్నానం చేయాలి. తాజా కలబంద జెల్ జుట్టు ఆకృతిని మెరుగుపరచడానికి మంచిగా పనిచేస్తుంది. కలబంద, తేనెను సమాన పరిమాణంలో కలిపి కూడా తలకు అప్లై చేయవచ్చు. దీనిని అప్లై చేసిన 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.

ఈ సహజమైన పద్ధతులతో పాటు మంచి ఫుడ్, వ్యాయమం చేస్తూ ఉంటే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

సంబంధిత కథనం