Children's intelligence quotient: మీ పిల్లల్లో ఐక్యూ ఇలా కాపాడండి
Children's intelligence quotient: మీ పిల్లలను చెత్త సమాచారం నుంచి దూరం చేసి వారి ఐక్యూ కాపాడేందుకు నిపుణులు అందిస్తున్న 7 టిప్స్ ఇవే.
ఈ డిజిటల్ యుగంలో తల్లిదండ్రులు తమ పిల్లలు చూసే కంటెంట్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. అందులో ఉండే పనికి మాలిన విషయాలన్నీ మీ పిల్లల ఇంటిలిజెంట్ కొషెంట్(ఐక్యూ)పై ప్రభావం చూపిస్తాయి. ఈ సమయంలో మీరు వారితో కూర్చుంటే చెత్త కంటెంట్ నుంచి దారి మళ్లించడం సాధ్యమవుతుంది. పెద్దగా వారితో ఫైట్ చేయాల్సిన అవసరం లేకుండానే దారిలో పెట్టేయొచ్చు.
అంతర్మన్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ సీమా రేఖ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో ఆయా అంశాలపై మాట్లాడారు. ‘సోషల్ మీడియా ఉపయోగం, వారి అవసరాలు, వాటికి ఉన్న పరిమితులపై పేరెంట్స్ పిల్లలతో నేరుగా మాట్లాడాలి. ఇలా చేయడం వల్ల వారిని నిర్ణయాల్లో భాగస్వాములను చేయవచ్చు. వారిని బలవంతం చేయడం కంటే ఇలా చేస్తే చక్కగా అనుసరిస్తారు. దీనికితోడు మొబైల్ నుంచి దూరం చేసేలా తగిన ప్లానింగ్‌తో లెర్నింగ్ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ చేయాలి. ఇందులో మీరు కూడా పాల్గొంటే వారికి ఉత్సాహంగా ఉంటుంది. సోషల్ మీడియా నుంచి రక్షించడం అత్యవసరం అనేది వేరే చెప్పాల్సిన పని లేదు..’ అని వివరించారు.
డాక్టర్ డీవై పాటిల్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ సుప్రకాష్ చౌదరి మాట్లాడుతూ ‘సోషల్ మీడియాలో నిమగ్నం కావడం సానుకూల, అలాగే వ్యతిరేక ప్రభావాలు చూపుతాయి. పిల్లలు ముఖ్యంగా తప్పుడు సమాచారం తెలుసుకుంటారు. వారి పరిణితి, గ్రహణ సామర్థ్యం ఈ సమయంలోనే డెవలప్ అవుతాయి..’ అని వివరించారు.
మూడొంతుల మంది పిల్లలు తాము ఆన్‌లైన్ ద్వారా తెలుసుకుంటున్న సమాచార వాస్తవికతను అంచనా వేయలేకపోతున్నారని యూనిసెఫ్ 10 దేశాల్లో నిర్వహించిన సర్వే ఎత్తిచూపింది. దీని ప్రభావం వారి గ్రహణ శక్తిపై, ఏకాగ్రతపై పడుతుంది. స్ట్రెస్, యాంగ్జైటీకి దారితీస్తుంది.
సాధారణ సంభాషణల ద్వారా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సామాజిక సూచనలు తెలుసుకోలేకపోతారని డాక్టర్ సుప్రకాష్ చౌదరి విశ్లేషించారు. ‘సోషల్ మీడియాను అనుసరించేవారు కాగ్నిటివ్ టెస్ట్‌లో విఫలమవుతారు. అభద్రతకు, యాంగ్జైటీకి లోనవుతారు. ముఖ్యంగా శ్రద్ధ కోల్పోతారు. మల్టీటాస్క్ చేసే సామర్థ్యం కోల్పోతారు. ఏకాగ్రత కోల్పోతారు..’ అని వివరించారు.
అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రెండేళ్ల లోపు చిన్నారులు అసలు స్క్రీన్‌వైపే చూడరాదని, రెండు నుంచి ఐదేళ్లలోపు పిల్లలైతే రోజూ ఓ గంట వరకు చూడొచ్చని చెబుతోంది. అయితే అది కూడా అత్యధిక నాణ్యమైన.. అంటే ఎడ్యుకేషనల్ కంటెంట్ అయి ఉండాలని చెబుతోంది.
పేరెంట్స్ రోల్ ఇలా ఉండాలి..
- వారితో మాట్లాడండి: పిల్లలు వారి సమాచారం కోసం సోషల్ మీడియా కంటే తల్లిదండ్రులపైనే ఆధారపడతారని గమనించాలి. అందువల్ల వారితో మాట్లాడుతూ ఉండాలి.
- సమాచార తనిఖీ: సమాచార విశ్వసనీయతను తనిఖీ చేసేందుకు మార్గాలను చూపండి. ఒకటికి రెండుసార్లు రచయిత, వెబ్‌సైట్ విశ్వసనీయతను పరిశీలించాలని చెప్పండి. పేరున్న సైట్లను, ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్స్ ఆధారంగా వాస్తవాలను తనిఖీ చేయాలని సూచించండి.
- భాగస్వామ్యం: భాగస్వామ్యం గురించి అవసరమైన డిజిటల్ లిటరసీ ముఖ్యం. అప్రమత్తంగా, నిజాయతీగా, క్రియేటివ్‌గా ఉంటేనే డిజిటల్ సేవలు సద్వినియోగపరుచుకోవచ్చని చెప్పండి.
- ప్రశ్నించడం: ఒక్కో సమయంలో ఒక్కో మీడియా గురించి అన్వేషించండి. మీ పిల్లలు చూస్తున్నవి, వింటున్న వాటి గురించి ప్రశ్నించేలా ప్రోత్సహించండి.
- విశ్లేషించండి: సమాచారాన్ని ఎలా విశ్లేషించాలో మీ పిల్లలకు నేర్పండి. అలాగే ఏది అభిప్రాయం, ఏది వాస్తవమో తేల్చడాన్ని నేర్పండి.
- పర్యవేక్షణ: తప్పుడు వార్తలు అందించే వెబ్‌సైట్లను బ్లాక్ చేయడం ద్వారా వారికి సరైన సమాచారం అందేలా చూడాలి.
- లభ్యత: విభిన్న రకాల సమాచారం పిల్లలకు అందేలా చూడడం ముఖ్యం. అలాగే సరైన సమాచారం అందడం కూడా ముఖ్యం. పాఠశాలలు, లైబ్రరీలు, బుక్స్ ఈ విషయంలో బాగా సాయపడతాయి.