Green Chilli Powder | ఎర్రని కారంపొడి స్థానంలో ఇప్పుడు ఆకుపచ్చని కారంపొడి!-green chilly powder to spice up your meals soon ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Green Chilli Powder | ఎర్రని కారంపొడి స్థానంలో ఇప్పుడు ఆకుపచ్చని కారంపొడి!

Green Chilli Powder | ఎర్రని కారంపొడి స్థానంలో ఇప్పుడు ఆకుపచ్చని కారంపొడి!

HT Telugu Desk HT Telugu
Apr 07, 2022 07:26 PM IST

పచ్చిమిర్చి మంచిదా ? ఎర్ర కారం వేసుకుంటే మంచిదా? అంటే పచ్చిమిర్చే మంచిదంటారు. ఎందుకంటే ఇందులో నీటిశాతం ఎక్కువ, కాలరీలు తక్కువ. అయితే పచ్చిమిర్చి పొడిగా ఉండదా అంటే? ఇకపై పచ్చకారం కూడా మన కిచెన్లలో ఉండబోతుంది.

Green Chilly Powder
Green Chilly Powder (Stock Photo)

పచ్చి మిరపకాయలు పచ్చగా ఉంటాయి, ఎండు మిరపకాయలు ఎర్రగా ఉంటాయి. ఏ మిరపకాయలు ఎలా ఉన్నా మిరపపొడి (మిరం) మాత్రం ఎర్రగానే ఉంటుంది. అయితే ఇకపై ఎర్ర కారంతో పాటు ఆకుపచ్చ కారం కూడా అందుబాటులోకి రానుంది. మనం ఇదివరకు వంటల్లో ఎరుపు రంగులో ఉండే పొడికారం మాత్రమే వేసుకునే వాళ్లం, ఇలా కారపుపొడి వద్దనుకుంటే పచ్చి మిరపకాయలే ప్రత్యామ్నాయంగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆకుపచ్చని కారం కూడా ప్రత్యామ్నాయంగా రాబోతుంది.

సూపర్ మార్కెట్లలో ఇప్పటికే ఆకుపచ్చని కారం అందుబాటులో ఉన్నప్పటికీ, ఆ కారం మనం సాధారణంగా ఉపయోగించే ఎర్ర కారానికి రెట్టింపు ధరలో ఉంటుంది. అంతేకాకుండా అన్ని ప్రాంతాల వారికి సులభంగా లభించదు. కానీ ఇకపై ఆ చింత ఉండదు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, వారణాసిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR)కి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ (IIVR) ఇప్పుడు పచ్చిమిర్చి పొడిని తయారుచేసే సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇలా అభివృద్ధి చేసిన ఆకుపచ్చని కారాన్ని త్వరలోనే అందరికీ సులభంగా లభించేలా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. ఈ కొత్త ఆకుపచ్చని కారానికి సంబంధించిన సాంకేతికతకు IIVR పేటెంట్ హక్కులను కూడా పొందింది.

ప్రత్యేకమైన సాంకేతికతతో తయారు చేసిన తమ ఆకుపచ్చని కారంపొడిలో 30 శాతంకు మించి విటమిన్ సి, 94-95 శాతం క్లోరోఫిల్, 65-70 శాతం క్యాప్సిన్ ఉంటాయని IIVR తెలిపింది. మామూలు కారపు పొడితో పోలిస్తే ఇలాంటి కారపు పొడిలో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. అలాగే తమ కారపు పొడిని సాధారణ ఉష్ణోగ్రత వద్ద చాలా నెలల పాటు నిల్వ చేయవచ్చునని IIVR డైరెక్టర్ తెలిపారు.

ఆకుపచ్చ కారం ఎలా తయారు చేస్తారు?

పచ్చి మిరపకాయలను అదే తాజాదనంతో నిల్వచేసి, ప్రత్యేక పద్ధతులను అనుసరించి రంగు కోల్పోకుండా ఎండబెట్టి కారంపొడిగా రూపొందిస్తే కారం పొడి ఆకుపచ్చని రంగులో ఉత్పత్తి అవుతుంది. ఇలాంటి కారపుపొడిని సాధారణంగా చిల్లీ సాస్ తయారీలో కూడా ఉపయోగిస్తారు.

ఎర్రని కారంపొడితో పోలిస్తే ఈ ఆకుపచ్చని కారం మరింత ఘాటుగా, ఇంకాస్త కారంగా ఉంటుంది.

ఎర్రకారంతో పోలిస్తే పచ్చకారం తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఈ కారం ఆహారంలో ఉపయోగించడం ద్వారా తిన్న ఆహారం మరింత వేగంగా జీర్ణం అవుతుంది. ఈ కారంతో శరీరానికి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా లభిస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించేలా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్