Yoga Tips for Neck | మెడ పట్టేసిందా? ఈ యోగాసనాలతో పరిష్కారం లభ్యం-follow these yoga tips when you have a stiff neck ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Follow These Yoga Tips When You Have A Stiff Neck

Yoga Tips for Neck | మెడ పట్టేసిందా? ఈ యోగాసనాలతో పరిష్కారం లభ్యం

Manda Vikas HT Telugu
Jan 27, 2022 07:05 AM IST

మెడ కండరాలు పట్టేసినపుడు మన తలను కనీసం తిప్పలేము, ఒకవేళ ఫేస్ టర్నింగ్ ఇవ్వాల్సివస్తే మొత్తం శరీరాన్ని తిప్పాల్సి ఉంటుంది. మెడను కొద్దిగా కదిలించే ప్రయత్నం చేసినా నొప్పి తీవ్రంగా ఉంటుంది. అయితే ఇందుకు యోగా మంచి పరిష్కారం పరిష్కారం.

మెడ నొప్పి
మెడ నొప్పి (Pexels)

మెడ బిగుసుకు పోయిందా? మెడ కండరాలపై ఒత్తిడి తీవ్రమైనపుడు ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. సాధారణంగా భంగిమలు మార్చకుండా ఒకే చోట కూర్చుని పనిచేస్తున్నపుడు, ఒక పక్కగా పడుకున్నప్పుడు లేదా మీ నిద్ర స్థానం సరిగ్గా లేనపుడు, ఏకధాటిగా మొబైల్, కంప్యూటర్ లేదా టీవీ తెరలను చూస్తున్నపుడు, మెడ వంచి ఏదైనా రాస్తున్నపుడు ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది.

ఇలా మెడ కండరాలు పట్టేసినపుడు మన తలను కనీసం తిప్పలేము, ఒకవేళ ఫేస్ టర్నింగ్ ఇవ్వాల్సివస్తే మొత్తం శరీరాన్ని తిప్పాల్సి ఉంటుంది. మెడను కొద్దిగా కదిలించే ప్రయత్నం చేసినా నొప్పి తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ నొప్పు చేతులు, భుజాలకు కూడా పాకుతుంది.

అయితే మెడ నొప్పిని ఔషధాలతోనో, వైద్యంతోనో నివారించుకోవాల్సిన అవసరం లేదు. సహజంగా దానంతటదే తగ్గాలి. మామూలుగా సరైన భంగిమలో కాసేపు నిద్రపోతే, ఆ నిద్రలోనే వెళ్లిపోతుంది. అయితే ఈ ఇబ్బంది తరచూ మిమ్మల్ని వేధిస్తుంటే దీనిని నివారించడానికి యోగా ఒక చక్కని పరిష్కారంగా నిలుస్తుంది. కొన్ని సులభమైన యోగాసనాలు సాధన చేయడం ద్వారా నొప్పి మాయమవడమే కాకుండా కండరాలు తిరిగి పునరుజ్జీవం పొందుతాయి, మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

ఇందుకోసం యోగా, ఆయుర్వేద నిపుణులైన నమితా పిపరయ్య పలు యోగా టిప్స్ అందిస్తున్నారు. అవేంటో చూడండి.

స్ట్రెచింగ్ చేయండి

మెడ బిగుసుకుపోయినపుడు దాని చుట్టూ ఉండే కండరాలను సాగదీయడం చాలా ముఖ్యం. చేతులు, భుజాలను వదులుగా ఉంచి చాచడం చేయాలి. నడుమును అన్ని వైపులా వంచడం చేయాలి. దీంతో మెడ కండరాలు విస్తరణ చెంది, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

భుజాలను వలయాకారంలో తిప్పండి

కీళ్లలో చలనశీలత ఉండేలా భుజాలను ముందుకు, వెనకకు వలయాకారంలో తిప్పుతూ ఉండాలి. ఒకసారి ముందువైపు, మరోసారి అదే స్థాయిలో వెనకవైపు, ఇలా రెండు భుజాలను మార్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజూ ఉదయం లేవగానే ఇలాంటి చిన్నపాటి వ్యాయామాలు చేసిన నొప్పులు దరిచేరవు.

కోబ్రా స్ట్రెచ్‌ వ్యాయామాలు

మొత్తం శరీరాన్ని వంచే క్రోబ్రా స్ట్రెచ్, బ్యాక్‌బెండ్‌ వ్యాయామాలు చేయండి. నేలపై పొజిషన్‌లో పడుకుని అరచేతులు నేలను తాకించి, భుజాలపై మీ బరువును ఉంచండి. మీ ఛాతీ భాగం పైకి లేపండి, మీ మెడను పైకి చూసేలా ఉంచండి. ఇలా కొన్ని సెకన్ల పాటు చేసి విరామం తీసుకోవాలి. ఇలా కొన్ని సెట్లు చేయాలి.

మెడను స్ట్రెచ్ చేయండి

నొప్పి ఉన్నప్పుడు మెడను గుండ్రంగా తిప్పడం చేయకుండా, అన్ని పక్కలా స్ట్రెచ్ చేస్తే ఫలితం ఉంటుంది. ఈ సాధన చేసేటపుడు మెడను ఒకపక్కకు వంచి శ్వాస తీసుకొని కొన్ని సెకన్లు బిగపట్టి, ఆ తర్వాత వదలటం చేయాలి. ఇలా ఉచ్ఛ్వాస, నిశ్వాసలు పూర్తైన తర్వాత, మరో పక్కకు వంచి ఇదే తీరుగా చేయాలి.

ఇలాంటి సాధనలు రోజూ చేయడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం