Kite festival: సంక్రాంతి రోజు గాలి పటాలు ఎగరేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే-follow these precautions to be taken while flying kites on sankranti day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kite Festival: సంక్రాంతి రోజు గాలి పటాలు ఎగరేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Kite festival: సంక్రాంతి రోజు గాలి పటాలు ఎగరేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Gunti Soundarya HT Telugu
Jan 15, 2024 07:00 AM IST

Kite festival: సంక్రాంతి పండుగ రోజు పతంగులు ఎగురవేస్తున్నారా? అయితే మీరు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాలు అరికట్టండి.

అంతర్జాతీయ పతంగుల పండుగలో సందడి
అంతర్జాతీయ పతంగుల పండుగలో సందడి (PTI)

సంక్రాంతి పండుగ సంబరాలు అంటే గాలిపటాలు ఎగరవేయకుండా ఉండలేరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు గాలి పటాలు ఎగరేస్తూ సంతోషంగా గడుపుతారు. సంక్రాంతి రోజు నీలాకాశం మొత్తం రంగు రంగుల గాలి పటాలతో కనువిందు చేస్తుంది.

గుజరాత్ లో సంక్రాంతి సందర్భంగా పతంగుల పండుగ చేస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో దేశ విదేశాల నుంచి ఎంతో మంది వింత విచిత్రమైన ఆకరాల్లోని గాలి పటాలు ఎగురవేస్తారు. వీటిని తిలకించేందుకు అనేక ప్రాంతాల నుంచి సందర్శకులు అక్కడికి చేరుకుంటారు. రంగు రంగుల పొడవైన, విభిన్నమైన గాలి పటాలు మనకి అక్కడ దర్శనమిస్తాయి.

గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారు?

సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఇప్పటి నుంచి దేవతలకి పగలు సమయంగా పరిగణిస్తారు. దేవతలు ఆకాశంలో విహరిస్తూ ఉంటారని, వారిని ఆహ్వానించేందుకు ఇలా గాలి పటాలు ఎగరేస్తారని చెబుతారు. ఇది ఇప్పటి చరిత్ర కాదు. దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచే పతంగులు ఎగురవేయడం ఉంది. సంక్రాంతి సమయంలో ఎక్కడ చూసిన రంగు రంగుల గాలి పటాలు అమ్ముతూ షాపుల ముందు కనిపిస్తాయి. చాలా సంతోషంగా ఈ పతంగుల పండుగ చేసుకుంటారు.

గాలిపటాలు ఎగరేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అందరి కంటే తమ గాలిపటమే ఎక్కువ ఎత్తులో ఉండాలని ఆశపడుతూ ఎక్కడ నిలబడుతున్నామని కొంతమంది గమనించుకోరు. ఎత్తైన భవనాల మీదకు, గోడల మీదకి చేరుకుని గాలి పటాలు ఎగరేస్తూ ఉంటారు. ఇతరులతో పోటీ పడుతూ పతంగుల మీద దృష్టి పెడతారు కానీ ఎక్కడ నిలబడుతున్నామనేది చూసుకోరు. దీని వల్ల కాలు జారి కిందపడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎత్తైన భవనాల మీద గాలి పటాలు ఎగరేయడం కోసం వెళ్ళకుండా మైదానల వద్దకి వెళ్ళడం మంచిది.

కైట్స్ కోసం చాలా మంది చైనా మాంజ ఉపయోగిస్తారు. కానీ ఇది చాలా ప్రమాదకరమైనది. దీనికి బదులు సాధారణ దారం ఉపయోగించడం మంచిది. చైనా మాంజాలు పక్షులు లేదా మనుషులకి చుట్టుకుంటే గాయాలు అవుతాయి. ఒక్కొక్కసారి అవి తగలడం వల్ల పక్షుల ప్రాణాలు పోతాయి. వాహనాలపై వెళ్తున్న వారికి మెడకి ఇవి తగలడం వల్ల గాయాలు అయి ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి వార్తల్లో వింటూనే ఉంటున్నాం. అందుకే వాటిని ఉపయోగించకూడదు.

జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలు, రోడ్ల మీద గాలి పటాలు ఎగరేయకూడదు. ఇలా చేస్తే వేగంగా వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఎవరూ లేని ప్రదేశాలకి వెళ్ళి ఎగరేసుకోవడం మంచిది.

ఇప్పుడు ఇళ్ల ముందే విద్యుత్ తీగలు ఉంటున్నాయి. గాలి పటాలు వాటి మీద పడినప్పుడు కొంతమంది పొరపాటున అవి తీసుకునేందుకు ట్రై చేస్తూ విద్యుత్ షాక్ కి గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి ప్రదేశాలలో కూడా గాలి పటాలు ఎగరేయపోవడం మంచిది.

గాలి పటాలు ఎగురవేసే టప్పుడు చేతులకి ప్లాస్టర్ చుట్టుకోవడం మంచిది. ఇలా చేస్తే దారాలు తెగినప్పుడు చేతులకు గాయాలు కాకుండా ఉంటాయి.

Whats_app_banner