DIY Moringa Oil | మునగాకు నూనెతో జుట్టు రాలడం నిరోధించవచ్చు, మీరే చేసుకోవచ్చు ఇలా!
DIY Moringa Oil for Hair Fall Prevention: దాదాపు అన్ని జుట్టు రకాలకు ప్రభావంతంగా పనిచేసే ఒక సహజ మూలిక మునగాకు గురించి తెలియజేస్తున్నాం. మీరు మునగ ఆకులను 2 మార్గాల్లో ఉపయోగించవచ్చు. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
DIY Moringa Oil for Hair Fall Prevention: ఈ రోజుల్లో చాలా మందికి సర్వసాధారణంగా ఉన్నటువంటి ఒక ఆందోళన జుట్టు రాలడం. తల దువ్వినా జుట్టు ఊడి వస్తుంది, తలకు నూనె పెట్టినా ఊడి వస్తుంది, తలస్నానం చేసేటపుడు షాంపూ పెట్టుకున్నా చేతికి జుట్టు అంటుకుని వస్తుంది. ఏం చేసినా, ఏం చేయకపోయినా, వెంట్రుకలు రాలిపోతునే ఉంటున్నాయి, తలపైన జుట్టు మెల్లిమెల్లిగా పల్చబడుతుంది. దీనిని ఆపకపోతే తల మీద బోడి గుండు వస్తుందేమోనన్న ఆందోళన చాలా మందికి ఉంటుంది. ఈ వర్షాకాలంలో అయితే ఈ జుట్టు రాలే సమస్య మరింత పెరుగుతుంది, దీంతో ఆందోళన మరింత తీవ్రమవుతుంది. ముఖ్యంగా మహిళలు జుట్టు రాలడం గురించి చాలా ఆందోళన చెందుతారు.
అయితే, జుట్టు రాలే సమస్యకు పరిష్కారంగా ఎన్నో రకాల చిట్కాలు, ఇంటి నివారణ మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిలో ఏది ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలియదు. ఎందుకంటే అందరి జుట్టు ఒకే రకంగా ఉండదు, జుట్టు రకాన్ని బట్టి ఫలితాలు మారుతుంటాయి.
అందుకే, ఇక్కడ దాదాపు అన్ని జుట్టు రకాలకు ప్రభావంతంగా పనిచేసే ఒక సహజ మూలిక మునగాకు గురించి తెలియజేస్తున్నాం. ఈ ఆకుల్లో జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మునగాకు ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్లు హెయిర్ ఫోలికల్స్‌ను రక్షిస్తాయి, ఊడిపోకుండా దృఢంగా ఉంచుతాయి. మీరు మునగ ఆకులను 2 మార్గాల్లో ఉపయోగించవచ్చు. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
మునగాకు హెయిర్ మాస్క్
జుట్టు రాలడానికి చికిత్సగా మీరు మునగాకులతో హెయిర్ మాస్క్‌ను (DIY Moringa Hair mask) తయారు చేయవచ్చు. ఈ మాస్క్‌ను తయారు చేయడానికి, ఆకులను బాగా గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌లో కొబ్బరి నూనె కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను మీ జుట్టు, తలపై అప్లై చేయండి. కనీసం 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై మీ జుట్టును కడగాలి.
మునగాకు నూనె
జుట్టుకు మునగ ఆకులను ఉపయోగించేందుకు మరొక మార్గం, దానిని నూనెగా ఉపయోగించడం. ఈ నూనెను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మునగాకు నూనె తయారు చేయడానికి, ఒక గుప్పెడు మునగాకులను తీసుకోండి, అలాగే ఒక కప్పు కొబ్బరినూనెను తీసుకోండి. మునగాకులను శుభ్రంగా కడిగి, ఆరబెట్టి ఆపైన చిన్నగా తరగండి. తరిగిన ఆకులను నూనెలో వేయండి. మరోవైపు ఒక వెడల్పాటి బాణాలిలో ఒక గ్లాసు నీటిని వేయండి. మరుగుతున్న నీటి మధ్యలో మునగాకులు కలిపిన నూనె గిన్నెను ఉంచండి. నీళ్లు మరిగేకొద్దీ, గిన్నెలోని నూనె వేడిక్కుతుంది, మునగాకుల్లోని సారం నూనెలోకి వెళ్తుంది. అప్పుడు ఆ నూనె లేత ఆకుపచ్చ రంగులోకి. అప్పుడు ఈ నూనెను వడకట్టి ఒక సీసాలో నిల్వచేసుకోవాలి. ఈ నూనెను మీ జుట్టు, తలకు బాగా పట్టించండి. కాసేపు మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం మీ జుట్టును కడగాలి. క్రమం తప్పకుండా వాడితే జుట్టు పెరుగుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న డేటా నుంచి సేకరించినది. కాబట్టి ఈ చిట్కాలు మీ జుట్టుకు ఉపయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోండి.
సంబంధిత కథనం