Salsa Potatoes | సాయంత్రం వేళ సాల్సా పొటాటో స్నాక్స్ తింటూ జల్సా చేయండి!-craving for snacks here is salsa potatoes to tingle your taste buds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Craving For Snacks? Here Is Salsa Potatoes To Tingle Your Taste Buds

Salsa Potatoes | సాయంత్రం వేళ సాల్సా పొటాటో స్నాక్స్ తింటూ జల్సా చేయండి!

HT Telugu Desk HT Telugu
Aug 18, 2022 06:14 PM IST

టేస్టీగా ఏదైనా స్నాక్స్ తినాలనుకుంటున్నారా? అయితే త్వరగా, తేలికగా సాల్సా పొటాటో స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు. కొంచెం కారంగా, కొంచెం పుల్లగా దీని టేస్ట్ అదిరిపోతుంది. రెసిపీ ఇక్కడ ఉంది, ట్రై చేయండి.

Potato snacks
Potato snacks (Pexels)

మధ్యాహ్నం తిన్న భోజనం ఈపాటికే అరిగిపోయి ఉంటుంది, మళ్లీ రాత్రి భోజనానికి కూడా చాలా టైం ఉంటుంది. ఈ గ్యాప్‌లో లైట్‌గా ఏదైనా తింటే కడుపు మాత్రమే కాకుండా మన మనసు శాంతిస్తుంది. సాయంత్రం వేళ కేవలం టీ-కాఫీలు మాత్రమే కాకుండా స్నాక్స్ కోసం మన నోరు ఆరాటపడుతుంది. అయితే ఏం తినాలి? ఇంట్లో సులభంగా తయారుచేసుకోవటానికి ఏం ఉన్నాయి అని మీరు ఆలోచిస్తుంటే మీ కోసం ఇక్కడ ఒక సింపుల్ స్నాక్స్ రెసిపీ అందిస్తున్నాం. దీని పేరే సాల్సా పొటాటో!

ఆలుగడ్డలతో మనం ఎన్నో రకాల వెరైటీ స్నాక్స్ చేసుకోవచ్చు. ఇందులో సాల్సా పొటాటోల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సాల్సా అంటే లాటిన్ అమెరికాలో టొమాటోతో చేసే సాస్ అనే అర్థం వస్తుంది. పేరుకు తగినట్లుగా సాల్సా పొటాటోలను కూడా టొమాటోతో కలిపి చేసుకోవటమే. ఈ స్నాక్స్‌‌ను చేసుకోవటం చాలా తేలిక, కేవలం 15 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అదిరిపోతుంది.

మరి సాల్సా పొటాటో తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలేమిటి? ఎలా తయారు చేసుకోవాలో ఆ రెసిపీని ఇక్కడ ఇచ్చాం. మీరు చేసుకొని చూడండి.

కావాల్సిన పదార్థాలు

  • 3 బంగాళదుంపలు
  • 1 స్పూన్ కారం
  • 1 స్పూన్ మిరియాలు
  • 1 స్పూన్ ధనియాల పొడి
  • 1 ఉల్లిపాయ
  • 1 టమోటా
  • 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
  • రుచి తగినంత ఉప్పు

తయారీ విధానం

1.బంగాళదుంపలు తీసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిపై కొంచెం నూనె వేసి కలపండి. నూనె లేకుండా కూడా చేసుకోవచ్చు.

2.తరువాత ఓవెన్‌ను 150 డిగ్రీల సెల్సియస్ వద్ద ఐదు నిమిషాల పాటు వేడి చేయండి. బంగాళదుంపలను ఓవెన్‌లో పెట్టి, అవి క్రిస్పీ అయ్యేంత వరకు ఉంచండి. (ఓవెన్ లేకపోతే మామూలుగా పెనంపైన కూడా కాల్చుకోవచ్చు)

3. ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో ఉప్పు, మిరియాలు, కారం, జీలకర్ర పొడి వేసి బాగా కలపి మిశ్రమంగా చేసుకోవాలి.

4. ఈ మిశ్రమాన్ని కాల్చిన బంగాళాదుంప ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి.

5.తర్వాత టొమాటో, ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకొని బంగాళదుంపలపై చల్లుకోవాలి. పైనుంచి నిమ్మరసం పిండుకోవాలి.

అంతే సాల్సా పొటాటోలు రెడీ అయినట్లే.. టీ తాగుతూ వీటిని ఆస్వాదించవచ్చు.

మరో విధానంలో..

టొమాటో, ఉల్లిపాయ ముక్కలు, ఎల్లిపాయ, ఒక ఎండు మిర్చి, ఒక పచ్చి మిర్చి తీసుకొని.. తక్కువ నూనెతో పెనంపై వేసి తేలికగా వేయించాలి. అనంతరం వీటిని మిస్కీ జార్ లోకి తీసుకొని కొన్ని నీరు పోసి ప్యూరీలాగా చేసుకోవాలి. దీనినే సాల్సా సాస్ అంటారు. ఈ సాస్‌ను వేయించిన బంగాళాదుంప ముక్కలతో కలుపుకొని కూడా తీసుకున్నా రుచికరంగా ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్