glamping destinations: రైలులో చేరుకోదగ్గ అత్యుత్తమ గ్లాంపింగ్ ప్రదేశాలివే..
glamping destinations: ట్రైన్ ద్వారా సులభంగా చేరుకోగలిగేగ్లాంపింగ్ కోసం అనువైన పర్యాటక ప్రాంతాలు మన దేశంలో ఉన్నాయి. అవేంటో పూర్తి వివరాలతో తెలుసుకుందాం.
పచ్చని ప్రకృతి అందాలు, సముద్ర తీరాలు, నేషనల్ పార్కులు, అద్భుతమైన పర్వత ప్రదేశాలెన్నో మన దేశంలో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ట్రైన్ మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. ఈ మధ్య గ్లాంపింగ్ చాలా ట్రెండ్ అవుతోంది. ప్రకృతి ఒడిలో స్నేహితులతో, కుటుంబంతో కలిసి సేద తీరడానికి ఇదొక మంచి మార్గం. క్యాంపింగ్ లాంటిదే ఈ గ్లాంపింగ్ కూడా . కానీ మరిన్ని వసతులతో ఉంటుందిది. రైలు ద్వారా చేరుకోగలిగే మంచి గ్లాంపింగ్ ప్రదేశాలేంటో తెలుసుకుందాం.
1. జైసల్మేర్ (రాజస్థాన్):
ఎడారిలో గ్లాంపింగ్ ఈ మధ్య చాలా మంది ఇష్టపడుతున్నారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ దానికి బాగా పాపులర్ అవుతోంది. అద్భుతమైన ఇసుక దిబ్బలకు, గొప్ప సంస్కృతికి ఇది ప్రసిద్ధి. ఇక్కడున్న థార్ ఎడారి పర్యాటకుల గ్లాంపింగ్ కోసం చాలా మంచి ప్రదేశం. సఫారీ, ఒంటె మీద సవారీ, వెన్నెల్లో భోజనం, జానపద నాట్యాలు, సంగీతానికి ఈ ప్రదేశం పేరుపెట్టింది. జైసల్మేర్ కు దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ ప్రాంతాల నుంచి ట్రైన్ సౌకర్యం ఉంది.
2. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ (ఉత్తరాఖండ్):
ఉత్తర భారత దేశ రాష్ట్రం ఉత్తరాఖండ్ లో ఉంది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. వన్య సంపదను చూడటానికి మంచి పర్యాటక ప్రాంతం ఇది. ఇక్కడున్న నేషనల్ పార్కు లగ్జరీ, అత్యాధునిక సౌకర్యాలతో మంచి గ్లాంపింగ్ అనుభవాలను అందిస్తుంది. కోసి నది ఒడ్డున అనేక విలాసవంతమైన రిసార్ట్‌లు ఉన్నాయి, ఇవి చల్లని వాతావరణాన్ని మరియు పచ్చని పచ్చిక బయళ్లకు పేరుపొందాయి. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో గ్లాంపింగ్ చేయడం వల్ల పర్యాటకులు అరుదైన జంతువులు మరియు పక్షులను చూసే అవకాశం ఉంటుంది. జిమ్ కార్బెట్‌కి సమీప రైల్వే స్టేషన్ రామ్‌నగర్, భారత దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలనుంచి ఇక్కడికి రైలు ద్వారా చేరుకోవచ్చు.
3. సుజన్ జవాయ్ చిరుతపులి శిబిరం, పాలి(రాజస్థాన్):
చిరుతపులులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించే వన్యప్రాణులు. వీటి విన్యాసాలు, ఈ జంతువులను చూడటానికి పర్యాటకులు వస్తుంటారు. రాజస్థాన్‌లోని పాలిలో సుజన్ జవాయి చిరుతపులి క్యాంప్ ఒక ప్రసిద్ధ ప్రదేశం, ఇది చిరుతపులిని చూడాలనుకునే వారికి గ్లాంపింగ్ అవకాశాలను అందిస్తుంది. ఇక్కడి గ్లాంపింగ్ లొకేషన్‌లో క్యాంప్ ఫైర్‌తో పాటూ మంచి ఆహార సదుపాయం, టెంట్లు, స్పాలు, మంచి వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. రైలులో పాలిలో ఉన్న గ్లాంపింగ్ క్యాంప్ సులభంగా చేరుకోవచ్చు.
4. కాణాతాల్ (ఉత్తరాఖండ్) :
ముస్సోరీ, డెహ్రాడున్ ప్రాంతాలకు దగ్గరల్లో ఉందీ కాణాతాల్ పర్వత ప్రాంతం. ఉత్తరాఖండ్ లోని అందమైన లోయలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడ మంచి గ్లాంపింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. న్యూఢిల్లీ నుంచి కేవలం 5 గంటల ప్రయాణం చేసి రైలు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ ఈకో గ్లాంప్ సౌకర్యం కూడా ఉంది. అక్కడుండే వాళ్లకి, పర్యాటకులకు ఇది ప్రయోజనకరం.
5. కన్హా నేషనల్ పార్క్ (మధ్య ప్రదేశ్) :
కన్హా నేషనల్ పార్క్ భారతదేశంలో చాలా ప్రముఖ ప్రదేశం. పులులకు, ఇతర వన్య ప్రాణులకు ఇది అద్భుతమైన ప్రదేశం. విలాసవంతమైన గుడారాలతో కూడిన ఈ ప్రదేశం గ్లాంపింగ్ కోసం ప్రసిద్ది చెందింది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్, స్పాలు, రెస్టరెంట్లు లాంటి అనేక సౌకర్యాలున్నాయి. ఇక్కడికి నేరుగా రైలు సౌకర్యం లేనప్పటికీ, జబల్ పూర్, గోండియా, నాగ్‌పూర్ ప్రదేశాల నుంచి రైలు ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.
టాపిక్