2022 TVS Radeon | మైలేజ్ ఇండికేటర్‌తో టీవీఎస్ రేడియన్.. ఇది అప్‌గ్రేడ్ వెర్షన్!
TVS మోటార్ కంపెనీ తమ రేడియన్ బైక్ (2022 TVS Radeon) ను అప్ డేట్ చేసింది. ఇప్పుడు అదనపు ఫీచర్లు, అందుబాటు ధరల్లో ఈ బైక్ లభ్యమవుతోంది.
TVS మోటార్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి 2022 TVS Radeonని భారత మార్కెట్లో విడుదల చేసింది. RTMi (రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్)తో మల్టీ-కలర్ రివర్స్ LCD క్లస్టర్‌ను కలిగి ఉన్న భారతదేశపు మొదటి 110 cc మోటార్‌సైకిల్ Radeon అని కంపెనీ పేర్కొంది. దీని ద్వారా రైడింగ్ కండీషన్ కు అనుగుణంగా వినియోగదారుడు మైలేజీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక్క RTMi మాత్రమే కాకుండా ఇంకా దీని డిజిటల్ క్లస్టర్‌లో సమయాన్ని చూపించే క్లాక్, సర్వీస్ ఇండికేటర్, లో- బ్యాటరీ ఇండికేటర్, టాప్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ వంటి 17 రకాల ఫీచర్లు ఉన్నాయి.
ఈ సరికొత్త కొత్త TVS Radeonలో ఇంధనం వృధా కాకుండా TVS' Intelligo సిస్టమ్ అమర్చారు. ఇది ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద లేదా ఎక్కడైనా కొద్ది సమయం పాటు బైక్ నిలిపినపుడు ఇంజిన్‌ను స్విచ్ ఆఫ్ చేస్తుంది. మళ్లీ ఆ వెంటనే ఇంజిన్ థొరెటల్ రెవ్ ద్వారా తిరిగి ఆన్ అవుతుంది. ఈ సాంకేతికత మెరుగైన మైలేజీతో పాటు గొప్ప రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
ఇంజిన్, ఇతర స్పెసిఫికేషన్లు
TVS Radeonలో దీర్ఘకాలంపాటు నిలిచి ఉండే 109.7cc Dura-Life ఇంజిన్‌ను అమర్చారు. దీని 4-స్పీడ్ గేర్ బాక్సుతో జత చేశారు. ఈ ఇంజన్ మోటార్ సైకిల్ కదలడానికి మంచి శక్తితో పాటు, ఇంధనాన్ని పొదుపు చేసే ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (ET-Fi) సాంకేతికతతో రూపొందించారు. ఈ ఇంజన్ 7,000 rpm వద్ద 8.4 PS శక్తిని అలాగే 5,000 rpm వద్ద 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. TVS Radeonలో 10-లీటర్ సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ ఉంటుంది.
TVS రేడియన్ 4 విభిన్న వేరియంట్‌లలో లభ్యమవుతుంది. బేస్ ఎడిషన్, రివర్స్ LCD క్లస్టర్‌తో డ్యూయల్ టోన్ ఎడిషన్ డ్రమ్, రివర్స్ LCD క్లస్టర్‌తో డ్యూయల్ టోన్ ఎడిషన్ డ్రమ్, డ్యూయల్ టోన్ ఎడిషన్ డిస్క్
TVS Radeon డిజైన్ పరంగా పొడవైన సీటు, USB ఛార్జర్, హెడ్‌ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్‌లపై క్రోమ్ ఫినిషింగ్, ముందువైపు డిస్క్ బ్రేకులను కలిగి ఉంటుంది. అలాగే స్టార్‌లైట్ బ్లూ, మెటల్ బ్లాక్, రాయల్ పర్పుల్ , టైటానియం గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది.
బేస్ వేరియంట్ ధర ఎక్స్- షోరూం వద్ద రూ.59,925/- ఉండగా, డ్యూయల్ టోన్ రూ. 71,966/- నుంచి లభిస్తుంది.