Vivek Agnihotri The Vaccine War: కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ నుంచి వ్యాక్సిర్ వార్
Vivek Agnihotri The Vaccine War: కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ నుంచి వ్యాక్సిర్ వార్ మూవీ వస్తోంది. అప్పట్లో కశ్మీర్ ఫైల్స్‌తో వివేక్ అగ్నిహోత్రి ఎంతటి సంచలనం సృష్టించాడో తెలుసు కదా. దీంతో ఈ లేటెస్ట్ మూవీపై అంచనాలు మరింత భారీగా ఉన్నాయి.
Vivek Agnihotri The Vaccine War: వివేక్ అగ్నిహోత్రి.. బాలీవుడ్ బడా దర్శకుల్లాగా కమర్షియల్ సినిమాలకు చాలా దూరంగా ఉంటాడు. చాక్లెట్, బుద్ధా ఇన్ ఎ ట్రాఫిక్ జామ్, హేట్ స్టోరీ, తాష్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్‌లాంటి సినిమాలన్నీ వివాదాస్పదమైనవే. అయితే కశ్మీర్ ఫైల్స్ మూవీతోనే వివేక్ సంచలనం సృష్టించాడు. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది.
అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ది వ్యాక్సిన్ వార్ పేరుతో మరో కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. ఈసారి కూడా టైటిల్‌తోనే వివేక్ ఆసక్తి రేపుతున్నాడు. ఈ మధ్య తానీ మూవీ చేయబోతున్నట్లు వివేక్ అగ్నిహోత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అతి తక్కువ సమయంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేయడమే కాకుండా.. దేశంలో 200 కోట్లకుపైగా డోసులను ప్రజలకు ఇచ్చిన ఘనతను సొంతం చేసుకోవడంపై సినిమా చేయబోతున్నట్లు వివేక్ ప్రకటించాడు.
చెప్పినట్లే అతడు ది వ్యాక్సిన్ వార్ పేరుతో కొత్త సినిమాను గురువారం (నవంబర్ 10) అనౌన్స్ చేశాడు. అంతేకాదు ఈ మూవీ పోస్టర్‌ను కూడా అతడు రిలీజ్ చేశాడు. ఓ వ్యాక్సిన్ బాటిల్‌పైనే సినిమా టైటిల్ వేయడం విశేషం. కొవిడ్-19, ఆ తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన అంశాలనే కథాంశంగా చేసుకొని వివేక్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు.
ది వ్యాక్సిన్ వార్ మూవీని వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించడం విశేషం. ఈ సినిమాను ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తెలుగు, హిందీతోపాటు ఇంగ్లిష్, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, ఒడియా, పంజాబీ, భోజ్‌పురి భాషల్లో ది వ్యాక్సిన్ వార్‌ను రిలీజ్ చేయనున్నట్లు వివేక్ చెప్పాడు.
మీరు పోరాడినట్లు తెలియకుండానే పోరాడి గెలిచిన యుద్ధం అంటూ ఈ పోస్టర్‌పై రాశారు. దీంతో సినిమా ప్రకటనే ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ నెలలోనే ది వ్యాక్సిర్ వార్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.