Tiger Nageswara Rao Trailer: పవర్‌ఫుల్‍గా టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్.. గజదొంగగా మాస్ మహారాజ వీరవిహారం: చూసేయండి
Tiger Nageswara Rao Trailer: రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ వచ్చేసింది. రవితేజ యాక్షన్స్ సీన్లు హైలైట్‍గా ఉన్నాయి.
Tiger Nageswara Rao Trailer: మాస్ మహారాజ్, స్టార్ హీరో రవితేజ ప్రధాన పాత్ర పోషిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. నాగేశ్వరరావు పాత్ర చేస్తున్నారు రవితేజ. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్‌తో టైగర్ నాగేశ్వరరావు సినిమాపై అమితాసక్తి నెలకొంది. యువ దర్శకుడు వంశీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కాగా, టైగర్ నాగేశ్వర రావు సినిమా ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉందంటే..
స్టువర్టుపురంలో దొంగతనాలు చేసే ప్రదేశాల కోసం వేసే వేలంపాటతో టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ మొదలైంది. కరడు గట్టిన దొంగగా రవితేజ అదరగొట్టారు. యాక్షన్ సీక్వెన్సులు, రవితేజ డైలాగ్స్, చేజింగ్‍లు అదిరిపోయాయి. సర్కార్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ దోపిడీ అవుతుందని ఫోన్ చేసి మరీ దొంగతనం చేస్తాడు టైగర్ నాగేశ్వరరావు (రవితేజ). ఆ తర్వాత ఓ యాక్షన్స్ సీక్వెన్స్ ఉంది. ఇక నాగేశ్వరరావుకు డబ్బు, బంగారం అంటే ఎంత ఇష్టమో ట్రైలర్‌లో చూపించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా అనుపమ్ ఖేర్ నటించారు. ‘మగజాతి మొత్తం.. కొలతలే చూస్తారు.. కాకపోతే అనుభూతి, ఆరాధన అని బూతులు మాట్లాడతారు’ అంటూ హీరోయిన్‍తో తన ఫిలాసఫీ చెబుతాడు నాగేశ్వరరావు. స్టువర్టుపురంలో ఆధిపత్య పోరు గురించి కూడా ట్రైలర్లో ఉంది.
స్టువర్టుపురంలో దొంగలను అణచివేసే కఠినమైన పోలీస్ క్యారెక్టర్ చేశారు జిస్సు సెంగుప్త. టైగర్ నాగేశ్వరరావు (రవితేజ) జైలుకు కూడా వెళతాడు. స్టువర్టుపురం నాగేశ్వరరావు కథ అయిపోయిందని, అయితే.. టైగర్ నాగేశ్వర రావు కథ అక్కడే మొదలైందని మురళీ శర్మ చెప్పే డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రేణు దేశాయ్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. ట్రైన్ సీక్వెన్స్ ఈ చిత్రానికి హైలైట్‍గా నిలిచేలా ఉంది. టైగర్ నాగేశ్వరరావు గురించి ప్రధాన మంత్రి పర్సనల్ సెక్యూరిటీకి తెలపాలని అనుపమ్ ఖేర్ చెప్పే డైలాగ్ ఈ మూవీ ట్రైలర్ చివర్లో ఉంది. పంజాబీ గెటప్‍లో టైగర్ నాగేశ్వరరావు కనిపించడంతో ట్రైలర్ ముగిసింది.
మొత్తంగా టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ పవర్‌ఫుల్‍గా, ఇంట్రెస్టింగ్‍గా ఉంది. జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంటెన్స్‌గా సాగింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. ట్రైలర్ కూడా ఐదు భాషల్లో వచ్చింది.
టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రవితేజ సరసన నుపుర్ సనన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. గాయత్రీ భరద్వాజ్, అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జుస్సు సెంగుప్త, మురళీ శర్మ, హరీశ్ పేరడి, సుదేవ్ నాయర్ కీలకపాత్రలు పోషించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.