Nikaah: 42 ఏళ్ల క్రితమే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ నికాహ్.. 34 కోర్టు కేసులు, హీరోయిన్‌కు వేధింపులు.. కానీ!-this controversial movie nikaah has 34 court cases salma agha was harassed but nikaah collects 9 cr at box office ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nikaah: 42 ఏళ్ల క్రితమే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ నికాహ్.. 34 కోర్టు కేసులు, హీరోయిన్‌కు వేధింపులు.. కానీ!

Nikaah: 42 ఏళ్ల క్రితమే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ నికాహ్.. 34 కోర్టు కేసులు, హీరోయిన్‌కు వేధింపులు.. కానీ!

Sanjiv Kumar HT Telugu
Feb 17, 2024 01:55 PM IST

Controversy Movie Nikaah Collections: దేశంలోనే అత్యంత కాంట్రవర్సీ మూవీగా రికార్డుకెక్కింది నిఖా. ఈ సినిమాపై ఏకంగా 34 కోర్టు కేసులు, నటీనటులపై వేధింపులు జరిగాయి. అయినా నిఖా మూవీ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. మరి నిఖా మూవీ ఎందుకు అంతలా వివాదం అయిందో చూద్దాం.

అత్యంత కాంట్రవర్సీ మూవీగా రికార్డ్.. 34 కేసులు, హీరోయిన్‌కు వేధింపులు.. కేరళ స్టోరీ కాదు!
అత్యంత కాంట్రవర్సీ మూవీగా రికార్డ్.. 34 కేసులు, హీరోయిన్‌కు వేధింపులు.. కేరళ స్టోరీ కాదు!

Nikaah Movie Court Cases: నటీనటులు, దర్శకనిర్మాతలు ప్రేక్షకులను అలరించాలనే లక్ష్యంతో సినిమా తీస్తారు. కొన్నిసార్లు ఆ చిత్రాల ద్వారా సామాజిక సందేశాన్ని అందించడం లేదా భారతదేశ చరిత్ర గురించి అవగాహన కల్పించడం వంటివి చేస్తారు. అయితే, అలాంటి సినిమాలు ప్రశంసలు దక్కించుకున్న కొన్నిసార్లు తీవ్ర విమర్శల పాలవుతాయి. ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీస్తాయి. దాంతో ఆ సినిమాలను నిషేధించాలని ప్రజలు డిమాండ్ చేస్తుంటారు.

బైకాట్ సంస్కృతి

ఈ మధ్య ఇలాంటి బైకాట్ ఆందోళనలు ఎక్కువగా జరిగిన విషయం తెలిసిందే. ది కశ్మీరి ఫైల్స్, ది కేరళ స్టోరీ సినిమాలు తీవ్ర బహిష్కరణకు గురయ్యాయి. వాటిని బైకాట్ చేయాలంటూ ఆందోలనలు కూడా వ్యక్తం అయ్యాయి. ప్రభాస్ ఆదిపురుష్, హృతిక్ రోషన్ ఫైటర్ (గల్ఫ్ కంట్రీస్‌లో), సల్మాన్ టైగర్ 3 సినిమాలు కూడా ఈ బైకాట్ సెగను ఎదుర్కొన్నాయి. అయితే ఈ బహిష్కరణ సంస్కృతి ఇటీవలే ప్రారంభం కాలేదు. 42 సంవత్సరాల క్రితం కూడా ఒక చిత్రం చాలా వివాదాలను ఎదుర్కొంది. కానీ, ఆ మూవీ హిట్‌గా నిలిచింది.

హీరోయిన్ డెబ్యూ ఎంట్రీ

ఎన్నో విమర్శలు, ఎదురుదెబ్బలు, ఆందోళనలు ఎదుర్కొని కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న 42 ఏళ్ల సినిమానే నికాహ్. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హీరోయిన్‌ను ఓవర్ నైట్ స్టార్ చేసింది. అంతేకాకుండా జీవితంలో ఎన్నడూ చూడని వేధింపులు ఎదుర్కొంది ఆ హీరోయిన్. 1982లో బీఆర్ చోప్రా తెరకెక్కించిన సినిమా నికాహ్. ఈ సినిమాలో రాజ్ బబ్బర్, దీపక్ పరాశర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో సల్మా అఘా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది.

నిర్మాతలపై 34 కేసులు

నికాహ్ మూవీ ట్రిపుల్ తలాక్ ఆధారంగా రూపొందించారు. ఇదే ఈ సినిమాకు వివాదంగా మారింది. ముందుగా ఈ చిత్రానికి తలాక్ తలాక్ తలాక్ అనే టైటిల్ పెట్టారు. అయితే, పలు కారణాలతో ఆ తర్వాత పేరు మార్చారు మేకర్స్. సినిమా టైటిల్, కథాంశం సంప్రదాయవాద ముస్లింల మనోభావాలను ఎంతో దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆందోళనలు చేపట్టారు. అంతేకాకుండా చిత్ర నిర్మాతలపై 34 కేసులు నమోదు చేశారు.

బెదిరింపులు-వేధింపులు

అలాగే చాలా మంది నికాహ్ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మరికొందరు సినిమాను చూడవద్దని విజ్ఞప్తి చేస్తూ థియేటర్ల వెలుపల పోస్టర్లు వేసి మరి ప్రచారం చేశారు. ఇంతటితో ఆగకుండా నికాహ్‌లో నటించిన మెయిన్ హీరోయిన్ సల్మా అఘాను బెదిరింపులు, వేధింపులకు గురి చేశారు. అయితే, ఈ సినిమాలో నటించేందుకు అమృతా సింగ్ చాలా ప్రయత్నించారు. ఆమె తల్లి రుక్సానా సుల్తాన్ డైరెక్టర్ బీఆర్ చోప్రాను ఎంతో ప్రభావితం చేసింది.

లండన్‌కు వెళ్లాలని

కానీ, బీఆర్ చోప్రా మాత్రం నికాహ్‌లో కొత్త హీరోయిన్ కావాలని పట్టిబట్టి మరి సల్మా అఘాను సెలెక్ట్ చేశారు. దీంతో కోపంతో రగిలిపోయింది రుక్సానా. అదే సమయంలో సల్మా అఘాకు వేధించడం, బెదిరింపు లేఖలు, ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. సల్మా లండన్‌కు తిరిగి వెళ్లాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని లేఖల్లో హెచ్చరించారు. అయినప్పటికీ ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా భారత్‌లోనే ఉండిపోయింది సల్మా. అయితే, ఆ లేఖలు అమృతా సింగ్‌కు చెందినవని తెలిసింది. కానీ ఆమెపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.

భారీ బ్లాక్ బస్టర్

ఇన్ని వివాదాలు, వార్నింగ్స్ ఎదుర్కొన్న నికాహ్ మూవీ టిక్కెట్ల కోసం జనాలు థియేటర్లకు బారులు తీరారు. అప్పట్లో రూ. 4 కోట్లతో నిర్మించిన నికాహ్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 9 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే బడ్జెట్‌ కంటే రెట్టింపు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో 1982లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో సల్మా అఘా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Whats_app_banner