Thalapathy Vijay: డైరెక్టర్‌గా దళపతి విజయ్ తండ్రి చేసిన తెలుగు సినిమాలు ఇవే - చిరంజీవితో మూడుబ్లాక్‌బస్టర్స్!
Thalapathy Vijay: దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్‌గా తెలుగులో ఆరు సినిమాలు చేశాడు. అందులో మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఆ మూడింటిలో చిరంజీవి హీరో కావడం గమనార్హం.
Thalapathy Vijay: దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తమిళంలో అగ్ర దర్శకుల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్నారు. రజనీకాంత్, విజయ్‌కాంత్‌తో పాటు పలువురుస్టార్ హీరోలకు పెద్ద హిట్స్ ఇచ్చాడు.
వరుసగా పది సినిమాలు...
విజయ్ హీరోగా కోలీవుడ్‌లో నిలదొక్కుకోవడంలో చంద్రశేఖర్ పాత్ర చాలా ఉంది. కెరీర్ ఆరంభంలో విజయ్‌తో సినిమా చేయడానికి ఏ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముందుకు రాలేదు. దాంతో తానే దర్శకుడిగా, నిర్మాతగా మారి విజయ్‌తో వరుసగా సినిమాలు చేశాడు. విజయ్ హీరోగా నటించిన తొలి పది సినిమాలకు ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్ కావడం గమనార్హం. వాటి ద్వారానే విజయ్ టాలెంట్ బయటకు వచ్చింది. స్టార్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు.
ఆస్తులు తాకట్టు పెట్టి...
విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తెలుగులోనూ డైరెక్టర్‌గా ఆరు సినిమాలు చేశాడు. అందులో మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఆ మూడు సినిమాల్లో చిరంజీవి హీరోగా నటించడం గమనార్హం.
అవల్ ఒరు పచల్ కుజుందై మూవీతో డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఎస్ఏ చంద్రశేఖర్. ఈ మూవీ డిజాస్టర్‌గా నిలవడంతో అప్పటివరకు సంపాదించుకున్న ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నాడు. తన ఇళ్లు, మిగిలిన ఆస్తులు తాకట్టు పెట్టి విజయ్ కాంత్‌తో సట్టం ఒరు ఇరుట్టారై మూవీ నిర్మించాడు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
చిరంజీవితో ఫస్ట్ మూవీ...
విజయ్ కాంత్ మూవీని తెలుగులో చిరంజీవితో చట్టానికి కళ్లులేవు పేరుతో ఎస్ఏ చంద్రశేఖర్ రీమేక్ చేశారు ఈ మూవీతోనే డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. చట్టానికి కళ్లులేవు మూవీకి దళపతి విజయ్ తల్లి శోభ కథను అందించింది. ఈ సినిమాలో హీరో చిరంజీవి క్యారెక్టర్ పేరును విజయ్ అని పెట్టాడు చంద్రశేఖర్. చట్టానికి కళ్లులేవు తెలుగులో వంద రోజులు ఆడింది. మాస్ హీరోగా చిరంజీవికి మంచి పేరుతెచ్చిపెట్టింది.
పల్లెటూరి మొనగాడు, దేవాంతకుడు...
చట్టానికి కళ్లులేవు తర్వాత చిరంజీవితో చంద్రశేఖర్ పల్లెటూరి మొనగాడు, దేవాంతకుడు సినిమాలు చేశాడు . ఈ మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచి చంద్రశేఖర్‌కు మంచి పేరుతెచ్చిపెట్టాయి. చిరంజీవి మూవీస్‌తో పాటు తెలుగులో ఇంటికో రుద్రమ్మ, బలిదానం, దోపిడి దొంగలు సినిమాలకు చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలు మాత్రం ఫ్లాపయ్యాయి.
శంకర్ గురువు...
సామాజిక సమస్యలకు కమర్షియల్ ఆంశాలను మేళవించడం చంద్రశేఖర్ స్టైల్‌గా చెబుతుంటారు. చంద్రశేఖర్ శిష్యుడిగా పనిచేసిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా సినిమాల విషయంలో గురువు బాటనే అనుసరిస్తూ వస్తోన్నాడు.