VN Aditya Doctorate: తెలుగు డైరెక్టర్ వీఎన్ ఆదిత్యకు గౌరవ డాక్టరేట్.. ఆమెకు అంకితం
VN Aditya Doctorate From George University: ప్రముఖ తెలుగు దర్శకుడు వీఎన్ ఆదిత్య అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు వీఎన్ ఆదిత్య.
Director VN Aditya Doctorate: తెలుగు చిత్ర పరిశ్రమలో ఫీల్ గుడ్ చిత్రాలు తెరకెక్కించే వారిలో వీఎన్ ఆదిత్య ఒకరు. ఆయన సినిమాలు ఎంతో క్లాసిక్‌గా ఉండి ఆకట్టుకుంటాయి. "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి టాలీవుడ్‌లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న వీఎన్ ఆదిత్యకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది.
బెంగళూర్‌లో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్‌లో అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ వివిధ రంగాలలోని ప్రముఖులకి గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేసింది. అందులో సినిమా రంగం నుంచి దర్శకుడు వీఎన్ ఆదిత్య డాక్టరేట్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ ఐఈఎస్ సలహాదారు శివప్ప, సెక్రటరీ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ ఏలూరి, జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ డైరెక్టర్ నీలమణి, నేషనల్ SC & ST కమిషన్ సభ్యుడు దినేష్ గురూజీ అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ "ఈ డాక్టరేట్ గౌరవాన్ని మా అమ్మగారికి అంకితం ఇస్తున్నా. నేను సినీ రంగంలో కాకుండా విద్యారంగంలో ఉన్నతస్థాయిలో ఉండాలని అమ్మ కోరుకుంది. నేను ఇష్టపడిన సినిమా రంగంలో డాక్టరేట్ పొందడం నాకే కాదు అమ్మకు కూడా సంతోషాన్ని ఇచ్చే విషయం. నాకు గౌరవ డాక్టరేట్ అందించిన అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ వారికి కృతజ్ఞతలు చెబుతున్నా" అని తెలిపారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వీఎన్ ఆదిత్యకు చిత్ర పరిశ్రమ నుంచి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వీన్ ఆదిత్య లవ్ @65 అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్, సీనియర్ హీరోయిన్ జయప్రద ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే లవ్ @65 ట్రైలర్ లాంచ్ చేశారు. 65 ఏళ్ల వయసులో లేచిపోయిన ఓ జంట నేపథ్యంలో సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.
లవ్ అండ్ ఎమోషన్స్, కామెడీ అంశాలతో లవ్ @65 ట్రైలర్ సాగింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. త్వరలో థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు. కాగా వీఎన్ ఆదిత్య ఎన్నో మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. మనసంతా నువ్వే, నేనున్నాను సినిమాలతోపాటు మనసు మాట వినదు, ఆట, బాస్, శ్రీరామ్, రాజ్, వాళ్లిద్దరి మధ్య, ముగ్గురు, మర్యాద క్రిష్ణయ్య తదితర చిత్రాలను తెరకెక్కించారు వీఎన్ ఆదిత్య.
ఇప్పుడు లవ్ @65 సినిమాతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చూపించనున్నారు వీఎన్ ఆదిత్య. ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్, జయప్రదతోపాటు కార్తీక్ రాజు, స్పందన, క్రిష్, నిహంత్రీ రెడ్డి, నారాయణరావు, ప్రదీప్, సాయి శ్రీనివాస్, ప్రీతి నిగమ్ ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే నటుడు అజయ్, సునీల్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సుధీర్ చింటూ కథను అందించగా.. లక్ష్మీ భూపాల డైలాగ్స్ అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.