Presidential Elections : రాజేంద్ర ప్రసాద్​ నుంచి కొవింద్​ వరకు.. ఇవి మీకు తెలుసా?-presidential elections 2022 10 facts you need to know ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Presidential Elections : రాజేంద్ర ప్రసాద్​ నుంచి కొవింద్​ వరకు.. ఇవి మీకు తెలుసా?

Presidential Elections : రాజేంద్ర ప్రసాద్​ నుంచి కొవింద్​ వరకు.. ఇవి మీకు తెలుసా?

Sharath Chitturi HT Telugu
Jul 17, 2022 07:10 PM IST

Presidential Elections : రేపే రాష్ట్రపతి ఎన్నిక. మరి ఓసారి.. భారత ‘రాష్ట్రపతి’ చరిత్రను ఓసారి చూద్దామా..

రాజేంద్ర ప్రసాద్​ నుంచి రామ్​నాథ్​ కొవింద్​ వరకు..
రాజేంద్ర ప్రసాద్​ నుంచి రామ్​నాథ్​ కొవింద్​ వరకు.. (PTI)

Presidential Elections : రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్​ వర్షాకాల సమావేశంలో భాగంగా.. సోమవారం రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్​నాథ్​ కొవింద్​ పదవీకాలం ముగియడంతో ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు, విపక్షాల అభ్యర్థి యశ్వంత్​ సిన్హాకు పోటీ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో 'రాష్ట్రపతి', 'రాష్ట్రపతి ఎన్నిక' చుట్టూ ఉన్న చరిత్రను ఓసారి పరిశీలిద్దాం..

భారత ‘రాష్ట్రపతి’ చరిత్ర..

  • 1905లో భారత్​.. గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఇప్పటి వరకు 14మంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్​.. రెండుసార్లు ఆ పదవి చేపట్టారు.
  • రాజేంద్ర ప్రసాద్​.. 12ఏళ్ల 107రోజుల పాటు రాష్ట్రపతి భవన్​లో ఉన్నారు. ఈ రికార్డ్​ ఇప్పటికీ చెరగలేదు. 1952లో తొలిసారి, 1957లో రెండోసారి ఆయన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.
  • ఇప్పటి వరకు 12మంది.. తమ 5ఏళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. ఇద్దరు రాష్ట్రపతులు.. జాకిర్​ హుసేన్​, ఫక్రుద్దిన్​ అలీ అహ్మెద్​లు.. పదవిలో ఉండగానే మరణించారు. వీరిద్దరు.. మూడేళ్లు కూడా ఆ పదవిలో ఉండలేదు.
  • 1969లో.. జాకిర్​ హుసేన్​ మరణాంతరం.. తాత్కాలిక రాష్ట్రపతిగా 35రోజుల పాటు బాధ్యతలు నిర్వహించారు అప్పటి చీఫ్​ జస్టిస్​ మహమ్మద్​ హిదాయతుల్లా. ఆ తర్వాత.. అప్పటి ఉపరాష్ట్రపతి వీవీ గిరి ఆ పదవిని చేపట్టారు. మూడు నెలల్లోనే ఆయన రాజీనామా చేసి.. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేశారు. మరోవైపు హిదాయతుల్లా.. 1979-1984 కాలంలో ఉపరాష్ట్రపతిగా పని చేశారు.
  • ఫక్రుద్దిన్​ మరణం అనంతరం.. 1977లో నాటి ఉపరాష్ట్రపతి బీడీ జట్టి తాత్కాలిక రాష్ట్రపతిగా నియమితులయ్యారు. ఐదు నెలల పాటు ఆ పదవిలో ఉన్నారు. ఆయన సమక్షంలోనే మొరార్జీ దేశాయ్​.. ప్రధానిగా ప్రమాణం చేశారు.
  • 1977లో ఎన్నికలు జరగకుండానే.. రాష్ట్రపతి పదవిని చేపట్టారు నీలం సంజీవ రెడ్డి. 36మంది నామినేషన్​ పత్రాలు తిరస్కరణకు గురికావడమే ఇందుకు కారణం. 1969లో వీవీ గిరిపై పోటీకి నీలం సంజీవ రెడ్డిని బరిలో దింపింది కాంగ్రెస్​. కొద్దిలో ఆయన ఓడిపోయారు.
  • 1969 రాష్ట్రపతి ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఇందిరా గాంధీ మద్దతు ఉన్న నీలం సంజీవ రెడ్డి గెలుపు ఖాయం అని చాలా మంది భావించారు. కానీ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన వీవీ గిరి అందరికి షాక్​ ఇచ్చారు. కాంగ్రెస్​లోని కొందరు చట్టసభ్యులు ఆయనకు మద్దతుగా నిలవడంతో గెలిచారు.
  • ఉపరాష్ట్రపతిగా పని చేసి.. రాష్ట్రపతి పదవిని చేపట్టి తొలి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ. 1962లో ఆయన రాష్ట్రపతి బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత జాకిర్​ హుసేన్​(1967), వీవీ గిరి(1969)లో ఈ ఘనత సాధించారు. మూడేళ్ల పాటు ఉపరాష్ట్రపతిగా పని చేసిన అనంతరం.. 1987లో రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచారు ఆర్​ వెంకటరామన్​. అప్పుడు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన శంకర్​ దయాల్​ శర్మ.. వెంకటరామన్​ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయన హయాంలో ఉపరాష్ట్రపతిగా విధులు నిర్వహించిన కేఆర్​ నారాయణ్​.. 1997లో రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.
  • 1957 ఎన్నికల్లో గెలిచిన రాజేంద్ర ప్రసాద్​కు 98.99శాతం ఓట్లు దక్కాయి. ఇప్పటికీ ఇదే అత్యధిక ఓట్ల శాతం. ఆ తర్వాత.. సర్వేపల్లి రాధాకృష్ణకు 98.25శాతం ఓట్లు దక్కాయి.
  • ప్రస్తుత రాష్ట్రపతి రామ్​నాథ్​ కొవింద్​.. 2017 జులై 25న ఆ పదవిని చేపట్టారు. ఉత్తర్​ప్రదేశ్​ నుంచి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి ఆయనే.

IPL_Entry_Point

సంబంధిత కథనం