Irugapatru Review: ఇరుగపట్రు రివ్యూ.. భార్యాభర్తలు సంతోషంగా ఎలా ఉండాలో చెప్పే మూవీ-tamil movie irugapatru review in telugu and rating ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Irugapatru Review: ఇరుగపట్రు రివ్యూ.. భార్యాభర్తలు సంతోషంగా ఎలా ఉండాలో చెప్పే మూవీ

Irugapatru Review: ఇరుగపట్రు రివ్యూ.. భార్యాభర్తలు సంతోషంగా ఎలా ఉండాలో చెప్పే మూవీ

Sanjiv Kumar HT Telugu
Nov 17, 2023 09:46 AM IST

Irugapatru Movie Review: ఇతర భాషా చిత్రాలు ఓటీటీల్లో తరుచూ విడుదల అవుతూ హిట్ అవుతుంటాయి. ఇటీవల తమిళంలో సూపర్ హిట్ అయిన ఇరుగపాత్రు మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. మరి ఇరుగపట్రు మూవీ రివ్యూలోకి వెళితే..

ఇరుగపట్రు రివ్యూ.. భార్యాభర్తలు సంతోషంగా ఎలా ఉండాలో చెప్పే మూవీ
ఇరుగపట్రు రివ్యూ.. భార్యాభర్తలు సంతోషంగా ఎలా ఉండాలో చెప్పే మూవీ

టైటిల్: ఇరుగపట్రు

నటీనటులు: శ్రద్ధా శ్రీనాథ్, విక్రమ్ ప్రభు, శ్రీ, సానియా అయ్యప్పన్, విధార్థ్, అబర్నతి, మనోబాల తదితరులు

సినిమాటోగ్రఫీ: గోకుల్ బెనోయ్

ఎడిటింగ్: జేవి మణికంద బాలాజీ

సంగీతం: జస్టిన్ ప్రభాకరన్

నిర్మాతలు: ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు, పి. గోపీనాథ్, తంగ ప్రభాహరన్

దర్శకత్వం: యువరాజ్ ధయాలన్

థియేటర్ విడుదల తేది: అక్టోబర్ 6, 2023

ఓటీటీ రిలీజ్ డేట్: నవంబర్ 6, 2023

ఓటీటీ వేదిక: నెట్‌ఫ్లిక్స్

Irugapatru Movie Review In Telugu: అక్టోబర్ 6న తమిళంలో విడుదలై సంచలన విజయం సాధించిన సినిమా ఇరుగపట్రు. ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఇరుగపట్రు సినిమాను నవంబర్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్న ఇరుగపట్రు మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

మిత్ర మనోహర్ (శ్రద్ధా శ్రీనాథ్) ఒక సైకాలజిస్ట్. వివాహ సంబంధానికి సంబంధించిన సమస్యలకు భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇస్తుంది. అనేక కపుల్స్ సమస్యలు తెలుసుకున్న మిత్ర తన భర్త మనోహర్‌తో (విక్రమ్ ప్రభు) ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవిస్తుంటుంది. దివ్య (సానియా అయ్యప్పన్), అర్జున్ (శ్రీ) ప్రేమించి పెద్దలను తిరస్కరించి పెళ్లి చేసుకుని ఒక ఫ్లాట్‌లో ఉంటారు. కొంతకాలం బాగున్న వీరి జీవితంలో మనస్పర్థలు చోటుచేసుకుంటాయి. అర్జున్‌ను వదిలేసి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాలనుకుంటుంది.

రంగేష్ (విధార్థ్), పవిత్ర (అబర్నతి) మరో జంట. బాబు పుట్టాక పవిత్ర లావు పెరిగిందని చీదరించుకుంటాడు రంగేష్. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయినా రంగేష్.. తన భార్యను జిమ్‌కు వెళ్లి డైట్ చేసి స్లిమ్ అవ్వాలని కోరతాడు. కానీ, పవిత్ర అలా చేయకపోవడంతో విడాకులు కావాలని నిర్ణయించుకుంటాడు. ఇలా ఈ రెండు జంటలు సమస్య పరిష్కారానికి మిత్రను కలుస్తారు.

ఎంగేజ్ చేసే విషయాలు

ఆ కపుల్స్ కి మిత్ర ఎలాంటి సలహాలు ఇచ్చింది? వారి కాపురం నిలబడిందా? వారు విడిపోవడానికి, మనస్పర్థలు రావడానికి అసలు కారణాలు ఏంటీ? ఎలాంటి చిన్న గొడవ లేని మిత్ర-మనోహర్ మధ్య వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటీ? వాటిని వాళ్లు ఎలా అధిగమించారు? దివ్య-అర్జున్ ఒక్కటయ్యారా? పవిత్రకు రంగేష్ విడాకులు ఇచ్చాడా? ఎన్నో జంటల సమస్యలు విన్న మిత్ర తన భర్త మనోహర్‌ను అర్థం చేసుకుందా? వంటి సున్నితమైన విషయాల కలయికే ఇరుగపట్రు మూవీ.

విశ్లేషణ:

ఇరుగపట్రు అంటే నమ్మకం లేదా హోల్డ్ టైట్ అనే అర్థం వస్తుంది. భార్యాభర్తల మధ్య నమ్మకం కంటే అతిపెద్ద ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవడం అని ఇరుగపట్రు ద్వారా చెప్పారు. భార్యాభర్తల రిలేషన్స్, లోపాలు, మనస్పర్థలు వంటి కాన్సెప్టుతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ, స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. అందులో యువరాజ్ ధయాలన్ నూటికి నూరుశాతం సక్సెస్ అయ్యారు.

గొడవ లేకపోవడం కూడా

ఇరుగపట్రు సినిమాలో పాత్రల డైలాగ్స్ సింపుల్‌గా ఉంటాయి. కానీ, మనసుకు హత్తుకుంటాయి, నవ్విస్తాయి, ఏడిపిస్తాయి, పార్టనర్ బాధను వ్యక్తపరుస్తాయి. భార్యాభర్తల మధ్య ఎలాంటి చిన్న గొడవ లేకపోవడం కూడా పెద్ద సమస్య ఎలా అవుతుందో హృద్యంగా చూపించారు.

కపుల్స్ ఎలా ఉండాలి

భార్యాభర్తలు గొడవపడాలి, సర్దుకుపోవాలి, ఎమోషన్స్ బయట పెట్టుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఇతరులని అనసవరంగా నిందించకూడదు, తన పార్టనర్ టాలెంట్‌పై ఈర్శ్య పడకూడదు, జాబ్ ఒత్తిడి భాగస్వామిపై ఎలా చూపిస్తాం, ఎవరిపైనో ఉన్న కోపాన్ని పార్టనర్‌పై చూపించడం వంటి సాధారణంగా సగటు భార్యాభర్తల మధ్య జరిగే విషయాలని ఇందులో ఆవిష్కరించారు.

ఊహించని ట్విస్ట్

అంతేకాకుండా, ఒక అబ్బాయి తను అనుకున్నట్లు జీవించేందుకు తల్లిదండ్రులు, కుటుంబ బాధ్యతలు ఎలా ఆటంకం అయ్యాయో రంగేష్ పాత్ర ద్వారా చూపించారు. ఆ పాత్రలు మనకు చాలా దగ్గరిగా ఉన్నట్లు భావన కలుగుతుంది. మూవీ ప్రీ ఇంటర్వెల్ సీన్‌లో మిత్ర, మనోహర్ రిలేషన్‌లో వచ్చే ట్విస్ట్ ఏమాత్రం ఊహించలేం. సినిమాకు అది మెయిన్ హైలెట్. ఇక క్లైమాక్స్ దాదాపు ఊహించినట్లుగానే ఉంటుంది. కానీ, అందమైన సన్నివేశాలతో చాలా బాగా కన్విన్స్ చేశారు డైరెక్టర్.

కచ్చితంగా చూసే సినిమా

ఇక సినిమాలో నటీనటుల యాక్టింగ్ చాలా ప్లస్ అయింది. తమ పాత్రల్లో ప్రతి ఒక్కరూ జీవించేశారు. ఓ ఒక్కరిని తక్కువ చేయలేం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఆయా సన్నివేశాలకు తగిన ఫీల్ ఎలివేట్ చేసింది. పాటలు అర్థవంతగా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, సాంకేతిక నిర్మాణ విలువలు చక్కగా కుదిరాయి. ఫైనల్‌గా చెప్పాలంటే సగటు భార్యాభర్తల జీవితం ఎలా ఉంటుందో, వాళ్లు సంతోషంగా జీవించాలంటే ఏం చేయాలో చెప్పే సినిమా ఇరుగపట్రు. ఫ్యామిలీ ఆడియెన్స్ కచ్చితంగా చూడాల్సిన మూవీ ఇరుగపట్రు.

రేటింగ్: 3/5

Whats_app_banner