Taapsee Pannu Wedding: పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ తాప్సీ.. బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్‌తో వివాహం!-taapsee pannu marries mathias boe in an intimate wedding report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Taapsee Pannu Marries Mathias Boe In An Intimate Wedding Report

Taapsee Pannu Wedding: పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ తాప్సీ.. బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్‌తో వివాహం!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 25, 2024 02:28 PM IST

Taapsee Pannu Wedding: హీరోయిన్ తాప్సీ పన్ను వివాహం జరిగినట్టు సమాచారం బయటికి వచ్చింది. తన ప్రియుడు మథియస్ బోయ్‍ను ఆమె పెళ్లాడారని తెలుస్తోంది. ఆ వివరాలివే..

Taapsee Pannu Wedding: పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ తాప్సీ.. ప్రియుడితో వివాహం
Taapsee Pannu Wedding: పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ తాప్సీ.. ప్రియుడితో వివాహం (Instagram)

Taapsee Pannu Marriage: హీరోయిన్ తాప్సీ పన్ను వివాహం జరిగినట్టు తెలుస్తోంది. చాలా కాలంగా ప్రేమిస్తున్న తన బాయ్‍ఫ్రెండ్ మథియస్ బోయ్‍ను మార్చి 23వ తేదీన ఆమె పెళ్లాడినట్టు ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఉదయ్‍పూర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు వారి ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు, అతికొద్ది మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది.

వరుడు ఎవరు?

మథియస్ బోయ్‍తో తాప్సీ పన్ను సుమారు పదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. మథియస్.. డెన్మార్క్ దేశానికి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్. 2012 ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం కూడా సాధించారు. మరిన్ని టోర్నీల్లో మెడల్స్ దక్కించుకున్నారు. 2020లో ఆయన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. 43 ఏళ్ల మథియస్ ప్రస్తుతం కోచ్‍గా ఉన్నారు.

హడావుడి కాకుండా..

తమ వివాహం గురించి హడావుడి బయటికి రాకుండా తాప్సీ పన్ను, మథియస్ బోయ్‍ మార్చి 23న పెళ్లి చేసుకున్నారని న్యూస్ 18 రిపోర్ట్ వెల్లడించింది. ఉదయ్‍పూర్‌లో మార్చి 20వ తేదీనే ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయని ఆ రిపోర్ట్ పేర్కొంది. “ఈ వివాహం ఉదయ్‍పూర్‌లో.. అత్యంత ఆంతరంగీకంగా జరిగింది. ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మార్చి 20న షురూ అయ్యాయి. తమకు ఎంతో ముఖ్యమైన సందర్భం రోజున మీడియా హడావుడి లేకుండా ఉండాలని ఆ ఇద్దరూ డిసైడ్ అయ్యారు. ఆ ఇద్దరూ ప్రైవేట్‍గా ఉండేందుకు ఇష్టపడతారు. అందుకే ఇలా పెళ్లి చేసుకున్నారు” అని సంబంధిత వర్గాలు చెప్పినట్టు ఆ రిపోర్ట్ వెల్లడించింది.

బాలీవుడ్‍లో తాప్సీకి అత్యంత సన్నిహితులైన కొందరు సెలెబ్రిటీలు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారని తెలుస్తోంది. తాప్సీతో కలిసి రెండు సినిమాల్లో నటించిన పవైల్ గులాటీ, దర్శకుడు అనురాగ్ కశ్యప్, కనికా థిల్లాన్, హిమాన్షు శర్మ ఈ వివాహానికి వెళ్లారని సమాచారం. కనిక ఇటీవల ఓ ఇన్‍స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. పింక్, సిల్వర్ ఔట్‍ఫిట్ ధరించి.. మేరే యారి షాదీ (నా ఫ్రెండ్ పెళ్లి) అంటూ షేర్ చేశారు. ఇది తాప్సీ పెళ్లి గురించేనని ఇప్పుడు అర్థమవుతోంది.

తాప్సీ కెరీర్

టాలీవుడ్‍తోనే తాప్సీ పన్ను వెండితెరకు పరిచయం అయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 2010లో వచ్చిన ఝుమ్మంది నాదం చిత్రంతో ఆమె తెరంగేట్రం చేశారు. అనంతరం తెలుగులో చాలా చిత్రాలు చేశారు. అలాగే, తమిళ చిత్రాల్లోనూ నటించారు. తాప్సీకి మంచి నటిగా పేరు వచ్చింది. కెరీర్లో కొన్ని విభిన్నమైన పాత్రలను తాప్సీ చేశారు. అయితే, 2013 నుంచి ఎక్కువగా బాలీవుడ్‍పైనే తాప్సీ ఫోకస్ చేశారు.

2016లో వచ్చిన పింక్ చిత్రంతో బాలీవుడ్‍లో చాలా పాపులర్ అయ్యారు తాప్సీ. ఆ చిత్రంలో నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఎక్కువగా హిందీ సినిమాలే చేస్తున్నారు. తెలుగులో చివరగా 2022లో మిషన్ ఇంపాజిబుల్ చిత్రంలో నటించారు. బాలీవుడ్‍లో మాత్రం వరుసగా చిత్రాలు చేస్తున్నారు. గతేడాది డంకీలోనూ తాప్సీ మెప్పించారు. ప్రస్తుతం బాలీవుడ్‍లో వా లడ్కీ బై కహా? ఫిర్ అయీ హసీన్ దిల్రూబాతో పాటు మరో చిత్రం కూడా తాప్సీ లైనప్‍లో ఉంది.

WhatsApp channel