Rahul-Athiya | రాహుల్, అతియా పెళ్లిపై రియాక్టయిన సునీల్ శెట్టి
స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి డేటింగ్‌లో ఉన్నారన్న విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇక ఇప్పుడు వాళ్ల పెళ్లి ఎప్పుడన్నదే అసలు ప్రశ్న.
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు, నటి అయిన అతియా శెట్టి కొన్నేళ్లుగా టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో డేటింగ్‌లో ఉన్న విషయం తెలుసు కదా. గతేడాది టీమిండియా ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లిన సమయంలో వీళ్ల రిలేషన్‌షిప్ బయటపడింది. రాహుల్‌తోపాటు అతియా కూడా ఆ టూర్‌కు వెళ్లింది. అప్పటి నుంచీ ఈ ఇద్దరూ ఎన్నో పార్టీలకు వెళ్లారు.
అటు అతియా అన్న అహాన్ శెట్టి డెబ్యూ మూవీ తడప్ ప్రీమియర్ షోకు కూడా వీళ్లు జంటగా వెళ్లడం విశేషం. అతియా ఫ్యామిలీతోనూ రాహుల్ తరచూ కనిపిస్తూనే ఉన్నాడు. ఇక ఈ వింటర్‌లో వీళ్లిద్దరూ పెళ్లితో ఒకటవుతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అతియా తండ్రి సునీల్ శెట్టి దీనిపై స్పందించాడు. ఈటీటైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్, అతియా పెళ్లి గురించి సునీల్ మాట్లాడాడు.
తన కూతురు అతియా శెట్టి పెళ్లి త్వరగానే జరగాలని తాను కూడా కోరుకుంటున్నట్లు సునీల్ చెప్పాడు. అటు తన కొడుకు అహాన్ పెళ్లి కూడా త్వరగా జరిగితే చూడాలని ఉన్నట్లు అన్నాడు. అయితే వాళ్ల పెళ్లి వాళ్ల ఇష్టం అని కూడా స్పష్టం చేశాడు. కేఎల్ రాహుల్ గురించి సునీల్ మాట్లాడుతూ.. అతడంటే తనకు ఇష్టమని చెప్పాడు. "వాళ్లు ఏం చేయాలన్న నిర్ణయం వాళ్లకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాలం మారిపోయింది. కొడుకు, కూతురు ఇద్దరూ బాధ్యత కలిగిన వాళ్లే. నిర్ణయం వాళ్లే తీసుకోవాలన్నది నా అభిప్రాయం. వాళ్లకు ఎప్పుడూ నా ఆశీర్వాదాలు ఉంటాయి" అని సునీల్ శెట్టి అన్నాడు.
అయితే పింక్‌విల్లాలో వచ్చిన కథనం ప్రకారం.. కేఎల్ రాహుల్, అతియా శెట్టి ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే వీళ్ల పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇద్దరూ కర్ణాటకకు చెందిన వాళ్లు కావడంతో.. సౌత్ ఇండియన్ స్టైల్ వెడ్డింగ్ జరగనుంది. వీళ్ల పెళ్లిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.