Peddha Kapu 1 Teaser: ‘పెదకాపు’ సినిమా టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్‍గా.. సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగంతో..
Peddha Kapu 1 Teaser: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న పెదకాపు 1 సినిమా టీజర్ వచ్చేసింది. టీజర్ మొత్తం ఇంటెన్స్ యాక్షన్‍తో ఉంది.
Peddha Kapu 1 Teaser: ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప సినిమాతో రూటు మార్చాడు. కులాల మధ్య ఆధిపత్యాలు, వర్గ పోరాటాలు, రాజకీయాల నేపథ్యంలో ప్రస్తుతం ‘పెదకాపు 1’ చిత్రాన్ని అడ్డాల తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌తోనే అందరి దృష్టిని ఈ మూవీ ఆకర్షించింది. నేడు (జూలై 2) పెదకాపు 1 టీజర్ వచ్చేసింది. ఈ టీజర్ చాలా ఇంటెన్స్, పవర్‌ఫుల్‍గా ఉంది. ఓ గ్రామంలో వర్గాల మధ్య పోరు, రాజకీయాల నేపథ్యంలో సాగే కథగా కనిపిస్తోంది. పెదకాపు 1 టీజర్ ఎలా ఉందంటే..
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు.. తెలుగు దేశం పార్టీని స్థాపించిన సందర్భంలో ఇచ్చిన ప్రసంగం బ్యాక్‍గ్రౌండ్ వాయిస్ ఓవర్‌తో ‘పెదకాపు 1’ టీజర్ మొదలవుతుంది. తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో చెప్పిన మాటలు బ్యాక్‍గ్రౌండ్‍లో ఉన్నాయి. ఆ తర్వాత హీరో విరాట్ కర్ణ ఎంట్రీ ఉండగా.. అనంతరం తనికెళ్ల భరణి డైలాగ్స్ ఉన్నాయి. “ఈ ఊరికి రెండే దిక్కులు ఉంటాయి” అంటూ.. ఆ గ్రామంలోని రెండు వర్గాలను ఈ టీజర్‌లో పరిచయం చేసింది చిత్రయూనిట్. నాగబాబు డైలాగ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. యాక్షన్, ఎమోషన్, రస్టిక్‍గా పెదకాపు టీజర్ 1గా ఉంది. ‘ఇది కేవలం జెండా కాదురా.. మన ఆత్మగౌరవం’ అనే డైలాగ్‍తో ఈ టీజర్ ముగుస్తుంది. ఈ చిత్రంతో వెండి తెరకు పరిచయమవుతున్న హీరో విరాట్ కర్ణ.. ఇంటెన్స్ లుక్‍తో కనిపించాడు. రెండు వర్గాలను ఎదిరించి లీడర్‌గా ఎదిగే పాత్ర చేసినట్టు తెలుస్తోంది. మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ కూడా టీజర్లో మరో ప్లస్ పాయింట్‍గా ఉంది.
పెదకాపు 1 మూవీలో ప్రగతి శ్రీవాత్సవ, రావు రమేశ్, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగాడ సాగా, రాజీవ్ కనకాల, అనసూయ, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా స్వయంగా ఓ పాత్రలో కనిపించనున్నాడు. ఆగస్టు 18న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
అఖండ చిత్రాన్ని నిర్మించిన మిర్యాల రవిందర్ రెడ్డి.. ఈ పెదకాపు 1 మూవీకి ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం వస్తోంది. పెదకాపు సినిమాకు రెండో భాగం కూడా ఉంటుందని ఇప్పటికే చిత్రయూనిట్ సంకేతాలు ఇచ్చింది. పీయర్ హెయిన్స్.. ఈ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేశాడు.