Sreeleela Viral Video: ఫ్యాన్స్ కోసం ప్రసాదం తెచ్చిన శ్రీలీల: వీడియో వైరల్
Sreeleela Viral Video: హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Sreeleela: యువ హీరోయిన్ శ్రీలీలకు చాలా తొందరగా స్టార్ డమ్ వచ్చేసింది. 2021లో పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్‍లోకి ఆమె అడుగుపెట్టారు. రెండేళ్ల కిందట ధమాకా సినిమాతో బ్లాక్‍బాస్టర్ అందుకున్నారు శ్రీలీల. ఈ చిత్రంలో డ్యాన్స్, అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చేశాయి. 2023లో ఏకంగా నాలుగు చిత్రాలు చేశారు శ్రీలీల. ఈ ఏడాది ఆమె హీరోయన్‍గా నటించిన గుంటూరు కారం రిలీజ్ అయింది. అయితే, వరుస సినిమాల తర్వాత ప్రస్తుతం ఆమె కాస్త విరామం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుమల ఆలయానికి వెళ్లారు.
కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని సోమవారం దర్శించుకున్నారు శ్రీలీల. ఎరుపు రంగుచీర, నుదిటిపై నామంతో సంప్రదాయబద్ధంగా ఆమె ఆలయానికి వచ్చారు. అక్కడ శ్రీలీలను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. ఆమెను పలుకరించారు. దర్శనం చేసుకొని ఆలయం బయటికి నుంచి వచ్చిన శ్రీలీలను ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు.
ప్రసాదం తీసుకొచ్చిన శ్రీలీల
బయట ఉన్న వారి కోసం శ్రీలీల ఆలయంలోని నుంచి ప్రసాదం తీసుకొచ్చారు. “ఎవరో ప్రసాదం తీసుకురమ్మన్నారు.. ఎవరికి ఇవ్వాలి” అని అన్నారు. అప్పుడు అక్కడున్న వారు తీసుకున్నారు. ఫ్యాన్స్ అడిగారని ఆలయంలోని శ్రీలీల ప్రసాదం తీసుకురాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడారు శ్రీలీల. పెళ్లిసందడి సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు తిరుమలకు వచ్చానని చెప్పారు. “ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్నతనంలో తిరుమలకు చాలాసార్లు వచ్చాను. అయితే, ఇప్పుడు చాలాకాలమైంది. పెళ్లిసందడి సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసినప్పుడు వచ్చా. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే వచ్చాను. నాకు కొన్ని సినిమాలు ఉన్నాయి. త్వరలోనే అనౌన్స్‌మెంట్లు వస్తాయి” అని శ్రీలీల చెప్పారు.
వరుస ప్లాఫ్‍లు
గతేడాది శ్రీలీల ఫుల్ బిజీబిజీగా షూటింగ్‍లు చేశారు. ఏకంగా కొన్ని రోజుల్లో మూడు షిఫ్టుల్లోనూ ఆమె షూటింగ్‍లకు వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. శ్రీలీల హీరోయిన్‍గా నటించిన స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు గతేడాది రిలీజ్ అయ్యాయి. అయితే, ఈ మూడు సినిమాలు కూడా డిజాస్టర్‌గా నిలిచాయి. భగవంత్ కేసరి మూవీ మోస్తరుగా హిట్ అయింది.
మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రంలోనూ శ్రీలీల హీరోయిన్‍గా చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ అయింది. శ్రీలీల మాస్ డ్యాన్స్ ఈ చిత్రంలో హైలైట్‍గా నిలిచింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి కూడా నిరాశఎదురైంది.
వరుస ప్లాఫ్‍లు ఎదురవటంతో ఆచితూచి సినిమాలు చేయాలని శ్రీలీల ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అందుకే వెంటవెంటనే చిత్రాలకు ఓకే చెప్పడం లేదని టాక్. అలాగే, మెడిసిన్ చదువుపై కూడా ఆమె ఎక్కువ దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది.
శ్రీలీల చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్‍హుడ్ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్‍లోనూ ఆమెకు ఛాన్స్ దక్కింది. అయితే, ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో స్పష్టత లేదు. మొత్తంగా వరుస ఫ్లాఫ్‍లు ఎదురయ్యాక ఆచితూచి అడుగులు వేస్తున్నారు శ్రీలీల.
టాపిక్