Sonakshi Sinha: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి రూమర్లపై స్పందించిన సోదరుడు.. ఏం చెప్పారంటే..-sonakshi sinha brother luv sinha responds on her wedding with zaheer iqbal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sonakshi Sinha: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి రూమర్లపై స్పందించిన సోదరుడు.. ఏం చెప్పారంటే..

Sonakshi Sinha: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి రూమర్లపై స్పందించిన సోదరుడు.. ఏం చెప్పారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 11, 2024 09:27 PM IST

Sonakshi Sinha Wedding: నటుడు జహీర్ ఇక్బాల్‍ను హీరోయిన్ సోనాక్షి సిన్హా ఈనెలలోనే పెళ్లి చేసుకోనున్నారంటూ రూమర్లు వస్తున్నాయి. ఈ విషయంపై ఆమె సోదరుడు లవ్ సిన్హా స్పందించారు.

Sonakshi Sinha: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి రూమర్లపై స్పందించిన సోదరుడు.. ఏం చెప్పారంటే..
Sonakshi Sinha: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి రూమర్లపై స్పందించిన సోదరుడు.. ఏం చెప్పారంటే..

Sonakshi Sinha: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహంపై రూమర్లు వస్తున్నాయి. ఈనెలలోనే ఆమె వివాహం చేసుకోనున్నారని టాక్ చక్కర్లు కొడుతోంది. తాను పెళ్లి చేసుకునేందుకు తొందరలో ఉన్నానని గత నెల ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో సోనాక్షి చెప్పారు. హీరామండి: ది డైమండ్ బజార్ ప్రమోషన్లలో భాగంగా ఆ షోలో పాల్గొన్న సోనాక్షి ఈ విషయాన్ని చెప్పారు. అయితే, ఈ జూన్ నెల 23వ తేదీనే తన బాయ్‍ఫ్రెండ్, నటుడు జహీర్ ఇక్బాల్‍ను సోనాక్షి వివాహం చేసుకోనున్నారనే రూమర్లు తాజాగా బయటికి వచ్చాయి.

సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ కలిసి 2022లో డబుల్ ఎక్స్‌ఎల్ చిత్రంలో నటించారు. అప్పటికే వారిద్దరూ ప్రేమలో ఉన్నారని అందుకే ఆన్‍స్క్రీన్ కెమెస్ట్రీ అంత బాగా పండిందనే టాక్ వచ్చింది. అయితే, ఈ రూమర్లపై ఇద్దరూ మౌనం వహిస్తూనే వచ్చారు. అయితే, సోనాక్షి, జహీర్ కలిసి వెకేషన్లకు చాలాసార్లు వెళ్లారు. అయితే, కపిల్ శర్మ షోలో తమ బంధం గురించి సోనాక్షి సిన్హా చెప్పకనే చెప్పేశారు. దీంతో ఈ నెలలోనే సోనాక్షి పెళ్లి ఉంటుందనే అంచనాలు బయటికి వచ్చాయి.

సోనాక్షి సోదరుడు ఏం చెప్పారంటే..

సోనాక్షి పెళ్లి రూమర్లపై స్పష్టత కోసం ఆమె సోదరుడు లవ్ సిన్హాను హెచ్‍టీ సిటీ సంప్రదించింది. అయితే, తన సోదరి విషయంలో తాను ఏమీ చెప్పలేనంటూ అతడు స్పందించారు. “నేను ఈ విషయంపై కామెంట్ చేయలేను. సోనాక్షి సిన్హాను లేకపోతే వేరే వాళ్లను నేరుగా సంప్రదిస్తే మేలు. ఈ విషయంలో నేను ఏం చెప్పలేనని మాత్రమే నేను చెప్పగలను” అని లవ్ సిన్హా చెప్పారు.

శత్రుఘ్న సిన్హా కూడా..

సోనాక్షి పెళ్లి రూమర్లపై ఆమె తండ్రి, సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. వివాహం గురించి సోనాక్షి తనకు ఏమీ చేప్పలేదని తెలిపారు. ఒకవేళ వివాహం చేసుకుంటే బారాత్‍లో డ్యాన్స్ చేస్తానని చెప్పారు. “ప్రస్తుతం కాలంలో పెళ్లి కోసం తల్లిదండ్రుల వద్ద పిల్లలు అనుమతి తీసుకోవడం లేదు. కేవలం సమాచారం ఇస్తున్నారు. మేం కూడా ఆ సమాచారం కోసమే ఎదురుచూస్తున్నాం” అని శత్రుఘ్న సిన్హా అన్నారు.

నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం సోనాక్షికి ఉందని శతృఘ్న సిన్హా చెప్పారు. “సోనాక్షి పెళ్లి గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. మేం ఎప్పుడూ ఆమె సంతోషాన్ని కోరుకుంటాం. ఆమె నిర్ణయాన్ని మేం ఎప్పుడూ నమ్ముతాం. సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఆమెకు పూర్తిగా ఉంది. నా కూతురు ఎప్పుడు పెళ్లి చేసుకున్నా.. బారాత్ ముందు నేను డ్యాన్స్ చేసేందుకు ఇష్టపడతా. ఈ విషయంలో మీడియాకు తెలిసిన విషయాలు కూడా మీకు తెలియవా అని నన్నే చాలా మంది అడుగుతున్నారు” అని శత్రుఘ్న సిన్హా చెప్పారు.

సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ వివాహం జూన్ 23వ తేదీన జరగనుందని.. సన్నిహితులు, బంధులువు, హీరామండి సిరీస్ నటీనటులకు ఇప్పటికే ఆహ్వానం అందిందనే రూమర్లు వచ్చాయి. ముంబైలో ఈ పెళ్లి జరుగుతుందని కూడా టాక్ నడుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇప్పటి వరకు సోనాక్షి, జహీర్ స్పందించలేదు.

Whats_app_banner